Pahalgam: సరిహద్దుల్లో పాక్ హైఅలెర్ట్!
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:56 AM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం, పాక్ వాయుసేన రెండు విమానాలను సరిహద్దుల దగ్గర మోహరించిందని, వాటిలో అధునాతన ఎయిర్‌బోర్న్ రాడార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. భారత్ ఏరియల్ స్ట్రైక్స్ చేస్తే ఈ వ్యవస్థ అప్రమత్తం అవుతుంది.
భారత్ ప్రతీకారదాడులపై భయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అప్రమత్తమైందా? పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ఘాతుకానికి.. భారత్ బదులు తీర్చుకోనుందని ఆందోళన చెందుతోందా? బాలాకోట్ తరహా ఏరియల్ స్ట్రైక్స్ జరిపే సూచనలుండడంతో.. సరిహద్దుల్లోని రాడార్ వ్యవస్థలను అప్రమత్తం చేసి, నిఘాను ముమ్మరం చేసిందా? ఈ ప్రశ్నలకు ఫ్లైట్‌ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్‌రాడార్24’ అవుననే సమాధానం చెబుతోంది. దక్షిణ పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌బేస్ నుంచి ఆ దేశ వాయుసేనకు చెందిన రెండు విమానాలను ఉత్తరాన-- రావల్పిండి, లాహోర్ సమీపంలో.. భారత సరిహద్దులకు దగ్గర్లో ఉన్న వైమానిక స్థావరాలకు తరలించినట్లు వివరిస్తోంది. ఫ్లైట్‌ట్రాకింగ్ సమాచారం మేరకు సీ-130ఈ(పీఏఎఫ్ 198) రవాణా విమానం, పీఏఎఫ్ 101 నిఘా, వీఐపీలను తరలించే విమానాలను భారత సరిహద్దుల్లో మోహరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా మిలటరీ వనరులను సైతం సరిహద్దులకు తరలిస్తున్నట్లు సమాచారం. వీటిల్లో పీఏఎఫ్-101 విమానంలో అధునాతన ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్(ఏఈడబ్ల్యూ అండ్ సీ) ఉంటుంది. అంటే.. భారత్ ఏదైనా ఏరియల్ స్ట్రైక్స్‌కు సిద్ధమైతే.. ఈ వ్యవస్థలోని రాడార్లు వెనువెంటనే అప్రమత్తం చేస్తాయి. పాక్‌వైపు దూసుకువచ్చే క్షిపణులు, యుద్ధ విమానాలను గుర్తిస్తుంది. అదేవిధంగా రావల్పిండిలోని నూర్‌ఖాన్ బేస్‌లో రాడార్లను కూడా పాకిస్థాన్ వాయుసేన అప్రమత్తం చేసినట్లు సమాచారం. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ వంటి ఉదంతాల నేపథ్యంలో.. పాకిస్థాన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..