Share News

Ramadan: దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల్లో ముస్లింలు

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:15 AM

రంజాన్ 'ఈద్-ఉల్-ఫితర్' శుభ సందర్భంలో దేశ వ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని నేతలంతా తమ సుహృద్భావాన్ని, ఆకాంక్షని తెలియచేస్తున్నారు.

Ramadan: దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల్లో ముస్లింలు
Ramadan Celebrations

భారత దేశ వ్యాప్తంగా ఇవాళ ముస్లింలు ఈద్‌ వేడుకలు (Eid) ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన ఉదయం నుంచి మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. ముస్లింలు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ, వేడుకలలో పాల్గొంటున్నారు. నెలరోజుల కఠోర ఉపవాస దీక్ష విరమించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈద్ పర్వదినమైన ఇవాళ ముస్లింలు కొత్త దుస్తులు ధరించి, వివిధ రకాల ఆహార పదార్థాలతో బంధువులు, స్నేహితులతో విందు వినోదాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా షవ్వాల్ నెల ప్రారంభమైన వేళ దేశమంతటా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటారు. గత నెల 2వ తేదీ నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటించారు. ఆదివారంతో ఉపవాస దీక్షలు ముగియడంతో పవిత్రమాసాన్ని ముగించుకొని నేడు రంజాన్ ఈద్ జరుపుకుంటున్నారు.

Eid Mubarak

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. "నేను నా దేశస్థులందరికీ, ముఖ్యంగా నా ముస్లిం సోదరులు, సోదరీమణులకు, ఈద్-ఉల్-ఫితర్ శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ సోదరభావాన్ని బలపరుస్తుంది. కరుణ, సద్భావన,దానధర్మాల సందేశాన్ని అందిస్తుంది. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమృద్ధి, సంతోషాన్ని తీసుకురావాలని, ప్రతి ఒక్కరి హృదయాలలో మంచితనం పరిడవిల్లాలని నేను ప్రార్థిస్తున్నాను." అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.


ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈద్‌ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌' పోస్ట్‌లో ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ మొదలైన గుణాల స్ఫూర్తిని పెంపొందించాలి. మీరు చేసే అన్ని మంచి ప్రయత్నాలలో విజయం దక్కాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్' అని మోదీ ఆకాంక్షించారు.


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు, ఆకాంక్షలు తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరూ సమాజంలో సద్భావన, సామాజిక సామరస్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.


ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకాశంలో ఈద్-ఉల్-ఫితర్ చంద్రుడు కనిపించాడు. దీంతో పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. అనంతరం నేడు (సోమవారం) దేశవ్యాప్తంగా ఈద్ ఆనందంగా జరుపుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

మయన్మార్‌లో హాహాకారాలు

ఫోన్‌ను చొక్కా జేబులో పెడుతున్నారా.. ఎలా కొట్టేశాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Updated Date - Mar 31 , 2025 | 11:55 AM