Seema Haider: ఈ ప్రేమ జంట గుర్తుందా.. శుభవార్త చెప్పేశారు..
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:01 PM
పబ్ జీ ద్వారా పరిచయం అయిన యువకుడి కోసం సీమా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చింది. ఆమె అక్రమంగా దేశంలోకి ప్రవేశించటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది.

పై ఫొటోలో కనిపిస్తున్న ప్రేమ జంట మీకు గుర్తుండే ఉంటుంది. పాకీస్తాన్‌కు చెందిన సీమా హైదర్.. ప్రేమించిన వాడి కోసం దేశాన్ని వదిలి ఇండియాకు వచ్చేసింది. తర్వాత చాలా ఇబ్బందులు పడింది. అన్ని కష్టాలు తట్టుకుని నిలబడి ప్రేమించిన వాడిని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలోనే ఉంటోంది. ఈ సంచలన జంట జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సీమా హైదర్ గ్రేటర్ నోయిడాలోని కృష్ణ హాస్పిటల్‌లో ఆడబిడ్డను ప్రసవించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. సోషల్ మీడియాలో జనం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పబ్జీలో ప్రేమ.. ఇండియాకు సీమా..
కొన్నేళ్ల క్రితం పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌కు పబ్‌జీ ద్వారా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకు చెందిన సచిన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కొద్దిరోజులకే స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్తా ప్రేమ అయింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, పాకిస్తాన్ నుంచి ఇండియాకు రావటం అంత సులభం కాదు కాబట్టి.. ఆమె ఓ నిర్ణయం తీసుకుంది. అప్పటికే సీమాకు నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికి సచిన్ కోసం పెద్ద సాహసం చేసింది. కట్టుకున్నవాడిని, కన్న బిడ్డలను, సొంత దేశాన్ని వదిలి ఇండియాకు వచ్చింది. సచిన్ సీమాతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇలాంటి సమయంలో ఊహించని షాక్ తగిలింది. సీమా అక్రమంగా ఇండియాలోకి రావడం అధికారులకు తెలిసింది.
దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొన్ని నెలల తర్వాత ఆమె బెయిల్‌పై విడుదల అయి బయటికి వచ్చింది. తర్వాతి నుంచి నోయిడాలోని సచిన్ దగ్గరే ఉంటోంది. ఇక, ఈ జంట ఆరు యూట్యూబ్ ఛానళ్లను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఛానళ్లలో సీమా, సచిన్‌లు విభిన్నమైన కంటెంట్ చేస్తూ.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారట. రెండు నెలల క్రితం ఓ జాతీయ మీడియాతో సీమా మాట్లాడుతూ... ‘ యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత నాకు తొలి సంపాదనగా 45,000 రూపాయలు వచ్చింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం నెలా 80 వేల నుంచి లక్షకు పైగా సంపాదిస్తున్నాం’ అని తెలిపింది.
Also Read: త్వరలో ఐపీఎల్ సీజన్.. హాట్‌స్టార్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందజేస్తున్న జీయో
Sunita Williams: ఆస్ట్రనాట్ సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ