Student Suicides: విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్‌ఫోర్స్
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:41 AM
ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్ (NTF) ఏర్పాటు చేసింది. విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, కుల వివక్ష వంటి అంశాలను పరిశీలించేందుకు ఈ కమిటీని నియమించింది.

జస్టిస్ భట్ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన సుప్రీం
న్యూఢిల్లీ, మార్చి 24: ఉన్నత విద్యాసంస్థల్లో తరచుగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, ఆత్మహత్యల నివారణకు జాతీయస్థాయి టాస్క్‌ఫోర్స్(ఎన్‌టీఎ్‌ఫ)ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌ను ఎన్‌టీఎ్‌ఫకు చైర్మన్‌గా నియమించింది. ఉన్నత విద్య, సామాజిక న్యాయం-సాధికారిత, మహిళా శిశు అభివృద్ధి, న్యాయ శాఖల కార్యదర్శులు ఎన్‌టీఎ్‌ఫలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారని తెలిపింది. విద్యార్థుల ఆత్మహత్యకు కారణాలు గుర్తించడం, ప్రస్తుతం ఉన్న నిబంధనలను విశ్లేషించడం, వారి రక్షణను బలోపేతం చేసేందుకు సిఫారసులు సహా సమగ్ర నివేదికను ఎన్‌టీఎఫ్ రూపొందిస్తుందని ధర్మాసనం తెలిపింది. దీనికోసం ఏ ఉన్నతవిద్యా సంస్థనైనా ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారం ఎన్‌టీఎ్‌ఫకు ఉందని తెలిపింది. నాలుగు నెలల వ్యవధిలో మధ్యంతర నివేదికను, ఎనిమిది నెలల వ్యవధిలో తుది నివేదికను ఎన్‌టీఎఫ్ అందజేయాలని నిర్దేశించింది. 2023 జూలై 8న ఆయుష్ అశ్న, సెప్టెంబరు 1న అనిల్ కుమార్ అనే దళిత విద్యార్థులు ఐఐటీ-ఢిల్లీలోని హాస్టల్ గదుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, అవి హత్యలేనని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. కుల వివక్ష పట్ల తమ పిల్లలు ఆందోళన చెందారని తెలిపారు. ఘటనలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ చేసిన అభ్యర్థనలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనను సుప్రీంకోర్టు మన్నించింది.
ర్యాగింగ్‌తో మూడేళ్లలో 51 మంది మృతి
విద్యా సంస్థల్లో ర్యాగింగ్ కారణంగా మూడేళ్ల వ్యవధిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో పరీక్షల ఒత్తిడి కారణంగా కోచింగ్ సెంటర్ల కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాలో 57 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సొసైటీ ఎగనెస్ట్ వయలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (సేవ్) సంస్థ 2022-24సంవత్సరాల మధ్య కాలానికి జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా సేవ్ సంస్థ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన 3,156ఫిర్యాదులను విశ్లేషించింది. ర్యాగింగ్ సమస్య వైద్య కళాశాలల్లో ఎక్కువున్నట్లు తేలింది.