Share News

Supreme Court Waqf properties: వక్ఫ్‌ ఆస్తులేవీ డీనోటిఫై చేయొద్దు!

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:17 AM

సుప్రీంకోర్టు, 'వక్ఫ్ బై యూజర్‌'గా నమోదైన ఆస్తులపై డీనోటిఫై చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వక్ఫ్ సవరణ చట్టంపై చర్చలు కొనసాగించనున్నట్లు కోర్టు పేర్కొంది.

Supreme Court Waqf properties: వక్ఫ్‌ ఆస్తులేవీ డీనోటిఫై చేయొద్దు!

‘వక్ఫ్‌ బై యూజర్‌’ అయినా, వక్ఫ్‌ బోర్డుల ఆస్తులైనా ప్రస్తుతానికి చర్యలొద్దు

కేంద్రానికి సుప్రీం సూచన.. చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్ధం?

‘వక్ఫ్‌ బై యూజర్‌’లను అనుమతించకుంటే ఎలా?

వందల ఏళ్ల కిందటి ఆస్తులకు పత్రాలు ఎలా వస్తాయి?

హిందూ మత ట్రస్టుబోర్డుల్లో ముస్లింలకు చోటిస్తారా అని సుప్రీంకోర్టు నిలదీత

విచారణ జరపకుండా ఉత్తర్వులు ఇవ్వవద్దంటూ కేంద్రం కేవియట్‌ దాఖలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: దేశవ్యాప్తంగా ‘వక్ఫ్‌ బై యూజర్‌’గా నమోదై ఉన్నవి సహా వక్ఫ్‌ ఆస్తులను వేటినీ డీనోటిఫై చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కేంద్రం తెచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా ఈ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకూ సిద్ధమైంది. కానీ విచారణ చేపట్టకుండా ఉత్తర్వులేవీ జారీ చేయవద్దంటూ కేంద్రం కేవియట్‌ దాఖలు చేయడంతో విచారణను గురువారం (ఏప్రిల్‌ 17) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఇదే సమయంలో వక్ఫ్‌ సవరణ చట్టంలోని పలు అంశాలపై కేంద్రానికి కొన్ని ప్రశ్నలను సంధించింది. కేంద్రం చేసిన వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వీ, రాజీవ్‌ ధవన్‌, ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తదితరులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. వక్ఫ్‌ ఆస్తులన్నీ రిజిస్టర్‌ చేసుకోవాలన్న నిబంధన సరికాదని, వందల ఏళ్లుగా చాలా ఆస్తులు ‘వక్ఫ్‌ బై యూజర్‌ (ఎలాంటి పత్రాలు లేకుండా చాలా కాలం నుంచి వక్ఫ్‌ ఆస్తులుగా కొనసాగుతున్నవి)’గా కొనసాగుతున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి నివేదించారు. అయితే వక్ఫ్‌ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ఉద్దేశమని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘వందల ఏళ్లుగా వ్యక్తిగత ట్రస్టులుగా కొనసాగుతున్న ‘వక్ఫ్‌ బై యూజర్‌’లను ఇప్పుడు ఎలా రిజిస్టర్‌ చేస్తారు? వాటికి పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? రిజిస్టర్‌ చేసుకోకుంటే వక్ఫ్‌ గుర్తింపు (డీనోటిఫై) తొలగిస్తే ఎలా? ఇంతకుముందు చాలా సందర్భాల్లో కోర్టులు ‘వక్ఫ్‌ బై యూజర్‌’ను గుర్తించాయి. ఇప్పుడు మీరు గుర్తింపును వెనక్కి తీసుకుంటే చాలా సమస్యలు చెలరేగుతాయి..’’ అని స్పష్టం చేసింది. వక్ఫ్‌ బై యూజర్‌, వక్ఫ్‌ బోర్డులు సహా వక్ఫ్‌గా కోర్టులు ప్రకటించిన ఆస్తులు వేటినీ డీనోటిఫై చేయవద్దని సూచించింది.


హిందూ బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా?

వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యుల నియామకాల సెక్షన్‌ను ప్రస్తావిస్తూ.. ‘హిందూ మత ట్రస్టు బోర్డుల్లో ముస్లింను నియమిస్తారా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వక్ఫ్‌ బోర్డులు, కేంద్ర వక్ఫ్‌ కౌన్సిల్‌లో సభ్యులుగా ముస్లింలే ఉండాలని పేర్కొంది. వక్ఫ్‌ బోర్డుల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ముస్లింలే ఉండాలని సూచించింది. వక్ఫ్‌ చట్టం ప్రకారం కలెక్టర్లు తమ బాధ్యతలను నిర్వర్తించవచ్చని.. కానీ దీనికి సంబంధించిన వివాదాస్పద సెక్షన్‌ను మాత్రం ప్రస్తుతానికి అమలు చేయవద్దని సూచించింది. చివరగా పార్లమెంటు చేసిన చట్టాల్లో సాధారణంగా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదని.. కానీ వక్ఫ్‌ చట్టంలోని పలు అంశాలపై అభ్యంతరాలు, వాటితో సమస్యలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. గురువారం మధ్యాహ్నం విచారణ చేపడతామని.. ఆలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో హింస చెలరేగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

అటు వ్యతిరేకం... ఇటు మద్దతుగా..

వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ, జమియత్‌ ఉలేమా ఈ హింద్‌, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వంటి సంస్థలతోపాటు ఆప్‌, డీఎంకే, సీపీఐ, జేడీయూ తదితర పార్టీలు వేసినవి కలిపి మొత్తం 72 పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు కేంద్రానికి మద్దతుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, అసోం రాష్ట్రాలు పిటిషన్లు వేయడం గమనార్హం.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్

BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

Updated Date - Apr 17 , 2025 | 04:17 AM