Bhimgal clash: మంత్రి జూపల్లి గీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:47 AM
నిజామాబాద్ భీమ్‌గల్‌లో జరిగిన కల్యాణలక్ష్మీ చెక్కుల కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మధ్య మాటల తూటాలు. సభ అనంతరం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, లాఠీచార్జీతో ఘటన మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
తులం బంగారం ఎప్పుడిస్తారని మంత్రిని నిలదీసిన ఎమ్మెల్యే
కేసీఆర్ ఏ సీఎం చేయని అప్పులు చేశాడన్న మంత్రి
మంత్రి వెళ్లాక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల ఘర్షణ
పోలీసుల లాఠీచార్జి.. నిరసనగా రోడ్డుపై ఎమ్మెల్యే బైఠాయింపు
భీమ్‌గల్, ఏప్రిల్ 16 (ఆంరధజ్యోతి): నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో బుధవారం జరిగిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తులం బంగారం హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఎప్పుడిస్తారని ఆయన మంత్రిని నిలదీశారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం తులం బంగారం కూడా అందజేస్తామని చెప్పారు. కేసీఆర్ పదేళ్ల హయాంలో గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా అప్పులు చేశారని, ఆయన చేసిన అప్పులకు ప్రస్తుతం వడ్డీకి వడ్డీ చెల్లించే పరిస్థితి నెలకొందని అన్నారు. దీంతో మధ్యలో ఎమ్మెల్యే కల్పించుకోవడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం మంత్రి బయలుదేరి వెళ్లగా బయట ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఘర్షణకు దిగారు.
పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేయగా.. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని బీఆర్‌ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య మాటామాటా పెరగడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పోలీసుల తీరుకు నిరసనగా భీమ్‌గల్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. లాఠీచార్జీలో 10 మంది బీఆర్‌ఎస్ నాయకులు గాయాల పాలయ్యారని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడకు చేరుకున్న ఆర్మూర్ ఏసీపీ ఎమ్మెల్యేను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా లాఠీచార్జీ చేసిన పోలీసులను వదిలే ప్రసక్తే లేదని, అందరి వివరాలు నమోదు చేసుకున్నామని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...