Share News

Terror Attack: రెండు జంటలు.. ఇద్దరు నవవరుల మృతి

ABN , Publish Date - Apr 24 , 2025 | 06:14 AM

జమ్మూకశ్మీర్‌లోని బైసారన్‌లో సరిగ్గా వివాహం చేసుకున్న జంటలు, హనీమూన్‌కు వెళ్ళి ఉగ్రవాదుల దాడిలో బలవయ్యారు. ఈ దాడిలో నావికాదళం అధికారి వినయ్‌ నర్వాల్‌ మరియు వ్యాపారవేత్త శుభమ్‌ ద్వివేదీ ప్రాణాలు కోల్పోయారు.

 Terror Attack: రెండు జంటలు.. ఇద్దరు నవవరుల మృతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: నిండు నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు కోటి ఆశలతో ఒక్కటైన రెండు జంటలు.. ఒకరికొకరు తోడుగా ప్రకృతి అందాలను వీక్షిస్తూ మైమరిచిపోయిన సమయంలో ముష్కర మూకలు వారిని విడదీశాయి. వందేళ్ల బతుకు కలలను క్షణంలో చిదిమేశాయి. జమ్మూకశ్మీర్‌లోని బైసారన్‌లో ఉగ్రవాదుల మారణకాండలో ఇటీవలే పెళ్లయిన ఇద్దరు యువకులు కన్నుమూశారు. వారిలో ఒకరు నావికాదళంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్న వినయ్‌ నర్వాల్‌ (26), మరొకరు వ్యాపారవేత్త శుభమ్‌ ద్వివేదీ (30). హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందిన వినయ్‌ నర్వాల్‌కు ఈ నెల 16వ తేదీనే హిమాన్షితో వివాహం జరిగింది. 19వ తేదీన రిసెప్షన్‌ వేడుక జరిగింది. హనీమూన్‌ కోసం యూరప్‌ వెళ్లడానికి సిద్ధమైన ఈ జంట.. వీసా తిరస్కరణకు గురవడంతో బదులుగా కశ్మీర్‌ను ఎంచుకుంది. 22వ తేదీన బైసారన్‌ ప్రాంతంలో విహరిస్తుండగా ఉగ్రవాదుల దుశ్చర్యకు వినయ్‌ బలయ్యారు. తన కళ్లముందే భర్తను కాల్చి చంపేయడంతో హిమాన్షి తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. బుధవారం వినయ్‌ మృతదేహాన్ని ఢిల్లీకి తరలించిన సమయంలో.. శవపేటికను గట్టిగా కౌగిలించుకుని ఆమె చేసిన రోదన అందరినీ కలచివేసింది. మే 1వ తేదీన వినయ్‌ పుట్టినరోజు ఉండటంతో.. కుటుంబ సభ్యులు వేడుకల కోసం ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. కానీ ఇంతలోనే కన్నుమూశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శుభమ్‌ ద్వివేదీకి ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీనే అశాన్యతో వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం తమ తొలి ట్రిప్‌గా వారు జమ్మూకశ్మీర్‌కు వచ్చారు. సరదాగా గుర్రాలు ఎక్కి బైసారన్‌ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతలోనే ఉగ్రదాడిలో శుభమ్‌ బలయ్యాడు. తన కళ్లముందే భర్తను చంపేయడంతో అశాన్య హతాశురాలైంది. ‘‘అప్పుడే గుర్రాలపై కొండపైకి చేరుకున్నాం. ఓ వ్యక్తి మావద్దకు వచ్చి.. మీరు హిందువా, ముస్లిమా అని అడిగాడు. అతను జోక్‌ చేస్తున్నాడని అనుకుని నవ్వేశాం. కానీ అతను మళ్లీ అడిగాడు. మేం ముస్లింలం కాదని చెప్పగానే.. గన్‌ తీసి శుభమ్‌ను తలపై కాల్చాడు. నన్ను కూడా కాల్చేసి ఉంటే బాగుండేది..’’ అంటూ అశాన్య వాపోయారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 06:14 AM