Maharashtra politics: హిందీ పై ఠాక్రేలు ఏకం
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:16 AM
రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే మధ్య రాజకీయ సంబంధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. హిందీ భాషా వివాదం నేపథ్యంలో తమ విభేదాలను పక్కనపెట్టేందుకు ఇద్దరూ సిద్ధమయ్యారు. ఈ పరిణామాలు మహారాష్ట్ర ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముంబై, ఏప్రిల్ 20: అన్నదమ్ములు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ చేతులు కలుపబోతున్నారా? మహారాష్ట్రలో ఫడణవీస్ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీ భాష నేర్చుకోవడం తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలు ఇందుకు దోహదపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్.. ఉద్ధవ్ తండ్రి బాల్ ఠాక్రే తమ్ముడి కుమారుడన్న సంగతి తెలిసిందే. తనను కాదని ఉద్ధవ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాక ఆయన శివసేనకు దూరమై ఎంఎన్‌ఎ్‌సను ఏర్పాటు చేసుకున్నారు. కొద్దికాలంగా రాష్ట్రంలో మరాఠీ భాష అమలు కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. హిందీ భాషా వివాదం నేపథ్యంలో శనివారం సినీదర్శకుడు మహేశ్ మంజ్రేకర్‌తో పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రాజ్ మాట్లాడారు. మహారాష్ట్ర ప్రజల కోసం చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టేందుకు తాను సిద్ధమని రాజ్ స్పష్టంచేశారు. ‘మహారాష్ట్ర ప్రయోజనం నాకు సర్వోచ్ఛం. ఉద్ధవ్‌తో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. మరి ఆయన సంసిద్ధంగా ఉన్నారా అనేదే ప్రశ్న. రెండు పార్టీల మధ్య విభేదాలు మహారాష్ట్రకు, మరాఠా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా పరిణమించాయి’ అని వ్యాఖ్యానించారు. దీనిపై ఉద్ధవ్ కూడా వేగంగా స్పందించారు.
‘మరాఠా భాష కోసం, మహారాష్ట్ర ప్రజల కోసం మా విభేదాలను పక్కనపెట్టేందుకు నేనూ సిద్ధమే’ అని ప్రకటించారు. అయితే బీజేపీ పేరెత్తకుండా.. మహారాష్ట్ర వ్యతిరేక శక్తులకు రాజ్ దూరంగా ఉండాలన్నారు. ఈ అంశంపై ఉద్ధవ్ సన్నిహితుడు, ఎంపీ సంజయ్ రౌత్ కూడా స్పందించారు. ‘రాజ్, ఉద్ధవ్ సోదరులు. వారి బంధం తెగిపోలేదు. ఇప్పుడు పొత్తులేమీ లేవు. కుటుంబ సంబంధంగా భావోద్వేగ చర్చలు మాత్రమే నడుస్తున్నాయి’ అని తెలిపారు. కాగా, కొద్ది నెలల్లో రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఎంఎన్‌ఎ్‌సతో చేతులు కలిపితే పుంజుకోవచ్చని ఉద్ధవ్ శివసేన భావిస్తోంది. అందుకే రాజ్‌తో పొత్తు కోసం ఉద్ధవ్ చూస్తున్నారని.. హిందీ వ్యతిరేక ఉద్యమం ఇందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు.. రాజ్, ఉద్ధవ్‌లు కలవడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని ఫడణవీస్ అన్నారు. విభేదాలు పరిష్కరించుకుంటే సంతోషదాయకమే కదా అని వ్యాఖ్యానించారు.
హిందీ వ్యతిరేకతపై ఫడణవీస్ విస్మయం
మహారాష్ట్ర ప్రతిపక్షాలు హిందీని వ్యతిరేకిస్తూ ఆంగ్ల భాషను వెనకేసుకు రావడం ఆశ్చర్యంగా ఉందని సీఎం ఫడణవీస్ అన్నారు. మరాఠీకి ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఊరుకునేదే లేదని ఆయన హెచ్చరించారు. మహారాష్ట్రలో మరాఠీని అందరూ తప్పనిసరి నేర్చుకోవాల్సిందేనని, మిగతా భాషలు నేర్చుకోవాలా వద్ద అనేది వారి వ్యక్తిగతమని స్పష్టం చేశారు. అయితే మహారాష్ట్రలో 1-5తరగతుల వరకు మూడో భాషగా హిందీని ప్రభుత్వం తప్పనిసరి చేయడాన్ని ఆ రాష్ట్ర భాష సలహా కమిటీ వ్యతిరేకించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదివారం ఫడణవీ్‌సకు లేఖ రాసింది.
ఇవి కూడా చదవండి:
Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News