కుండీలో కలబంద ఇలా...
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:44 AM
కలబంద పలు అనారోగ్య సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. సౌందర్య సాధనంగా కూడా కలబంద గుజ్జును వాడుతుంటాం. చర్మ వ్యాధులకు, కాలిన గాయాలకు, చుండ్రు నివారణకు, శిరోజాల పెరుగుదలకు...
కలబంద పలు అనారోగ్య సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. సౌందర్య సాధనంగా కూడా కలబంద గుజ్జును వాడుతుంటాం. చర్మ వ్యాధులకు, కాలిన గాయాలకు, చుండ్రు నివారణకు, శిరోజాల పెరుగుదలకు, బరువు తగ్గడానికి ఈ మొక్కనే ఆశ్రయిస్తాం. ఇలా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే కలబంద మొక్కను ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు.
కుండీలో మట్టి మరీ మెత్తగా కాకుండా మిశ్రమంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వేర్లు లోపలికి చొచ్చుకొని పోవడానికి వీలుగా ఉంటుంది. తోటమట్టిలో కొబ్బరి పీచు పొడి. తేలికపాటి సేంద్రీయ ఎరువు కలిపితే చాలు. ఈ రకం మట్టిలో కలబంద మొక్క తొందరగా నాటుకుంటుంది. అరటి పండు తొక్కను చిన్న ముక్కలు లేదంటే గుజ్జుగా చేసి మొక్క మొదట్లో వేస్తే పొటాషియం తదితర పోషకాలు అంది ఆకులు ఏపుగా పెరుగుతాయి. మట్టి కూడా సారవంతమవుతుంది. వెడల్పాటి కుండీలు మొక్క పెరుగుదలకు అనువుగా ఉంటాయి.
కలబంద మొక్కకు ఎండ తగిలితే వేగంగా పెరుగుతుంది. కుండీలను బాల్కనీలో లేదంటే కిటికీ దగ్గర ఏర్పాటు చేసుకుంటే మొక్క గుబురుగా తయారవుతుంది. స్టడీ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో కుండీని ఉంచితే అహ్లాదకరంగా కనిపిస్తుంది. కానీ అంత వేగంగా మొక్క పెరగదు. ఎక్కువ కాలం జీవించి ఉంటుంది.
కలబంద మొక్కకు పక్క నుంచి పిలకలు వస్తుంటాయి. వీటిని వేరు చేసి వేరే కుండీల్లో నాటుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి.
దీనికి ఎక్కువ నీరు అవసరం ఉండదు. కుండీలో నీళ్లు నిల్వ ఉండకుండా అడుగుభాగంలో రంధ్రం చేయండి. లేదంటే మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ మొక్కకు నీళ్లు ఎక్కువగా పోస్తే ఆకులు పసుపు రంగులోకి మారతాయి. వాటిపై మచ్చలు కూడా వస్తాయి. మొక్క వాలిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కుండీని ఎండలో ఉంచండి. కొన్ని రోజులు నీళ్లు పోయకండి. ఆకులు ముదురు గోధుమ రంగులోకి మారితే మాత్రం మొక్కకు నీళ్లు అవసరమని గుర్తుంచుకోండి.
మందంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకులను మాత్రమే అవసరానికి కోసుకోండి. లేతగా ఉన్న ఆకులను కోస్తే మొక్క పెరుగుదల ఆగిపోతుంది.