Share News

మనం స్వేచ్ఛగానే ఉన్నామా?

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:42 AM

మనకు ఇష్టం వచ్చిన మతాన్ని మనం అనుసరిస్తాం. నచ్చిన రాజకీయ పార్టీకి ఓటు వేస్తాం. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటాం. నచ్చిన ప్రదేశంలో జీవిస్తాం. ప్రజాస్వామ్యం పుణ్యమా అని మనకు...

మనం స్వేచ్ఛగానే ఉన్నామా?

చింతన

మనకు ఇష్టం వచ్చిన మతాన్ని మనం అనుసరిస్తాం. నచ్చిన రాజకీయ పార్టీకి ఓటు వేస్తాం. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటాం. నచ్చిన ప్రదేశంలో జీవిస్తాం. ప్రజాస్వామ్యం పుణ్యమా అని మనకు అంత స్వేచ్ఛ ఉంది. మన దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనంత సేవ్ఛను ఈనాడు అనుభవిస్తున్నామంటే అతిశయోక్తి కాదు. మరి మనం నిజంగానే స్వేచ్ఛగా ఉన్నామా?

జిడ్డు కృష్ణమూర్తి దృష్టిలో ఈ స్వేచ్ఛ కేవలం ఒక భ్రాంతి మాత్రమే. నిజానికి మనం ఎన్నో ప్రభావాలకు లోనై ఉంటాము. ఉదాహరణకు, మన వృత్తికి సంబంధించిన నిర్ణయం వెనుక ఎన్నో ఆదర్శాలు, ఆశలు, దురాశలు, దేశకాల పరిస్థితులు గుప్తంగా ఉంటాయి. మనం ప్రేమించి పెళ్ళి చేసుకొనే వ్యక్తి కూడా అంతే. అసలు అందం అనే భావం మీద ఎన్నో ప్రభావాలు కనిపిస్తాయి. ఈ ప్రభావాలకు అతీతమైన అందం ఏదైనా ఉంటుందా? అనేది ఒక పెద్ద వివాదాంశం. ‘‘మనిషి తీసుకొనే నిర్ణయాల మీద ఈ ప్రభావాలు ఉన్నంతకాలం... మనిషిని స్వేచ్ఛాజీవి అనడానికి వీలు లేదు’’ అనేది కృష్ణమూర్తి మనకు తెలియజేసే ఒక ముఖ్యమైన సత్యం. అంటే... అన్ని ప్రభావాలను వదిలించుకున్న తరువాతే మనిషికి స్వేచ్ఛ వస్తుంది. మన పెంపకం, చదువుకున్న పుస్తకాలు (అది భగవద్గీత కావచ్చు, కమ్యూనిస్ట్‌ మేనిఫెస్టో కావచ్చు), నేర్చుకున్న సిద్ధాంతాలు, విద్యలు, మన అనుభవాలు, సమకాలీన పరిస్థితులు, మన సమాజం, మన వాతావరణం, చివరకు మనం తీసుకొనే ఆహారం... వీటన్నిటి ప్రభావం మన చైతన్యం మీద ఉంటుంది. ఈ ప్రభావాలను మనం ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవచ్చు. మన చైతన్యాన్ని శుభ్రపరచుకోవచ్చు. అయితే అంతమాత్రాన మనకు నిజమైన స్వేచ్ఛ రాదు. మనిషి చైతన్యం మీద ఇంకొక లోతైన ప్రభావం ఉంటుంది.


కొందరు తత్త్వవేత్తల దృష్టిలో మనిషి ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు... అతడు ఒక స్వేచ్ఛాజీవి. కానీ ఈ ప్రతిపాదనలో ఉన్న దోషాలను కృష్ణమూర్తి చూపిస్తారు. ఆలోచనలలోని అంశాలన్నీ మనం గతంలో జ్ఞానేంద్రియాల ద్వారా సంపాదించిన విషయాలే. వీటన్నిటి సాయంతో మనం... అంటే మన చైతన్యం ఆలోచించగలుగుతుంది. అంటే ‘ఆలోచించడం’ అనే ఒక ప్రక్రియ... గతానికి బద్ధమై, గతంలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది. గతాన్ని అధిగమించలేని ఆలోచనా ప్రక్రియకు స్వేచ్ఛ ఉండే అవకాశం లేదు. అయితే మనిషి చైతన్యంలో మరో రెండు ప్రగాఢమైన ప్రభావాలు ఉంటాయి, అవి: అహంకారం అంటే ‘నేను’ అనే భావం, అలాగే కాలం. ఇవి ఆలోచనల్లో పుట్టే అతి క్లిష్టమైన రెండు ప్రభావాలు. అంటే కేవలం ఉపరితలంలో ఉండే పెంపకం, చదువు లాంటి ప్రభావాలను వదిలించుకున్నంతమాత్రాన మనిషికి స్వేచ్ఛ రాదు. మనిషి చైతన్యం ఆలోచనను, అహంకారాన్ని, కాలాన్ని కూడా నిశ్శేషంగా నిర్మూలించాలి. అప్పుడే అతనికి పరిపూర్ణమైన స్వేచ్ఛ లభిస్తుంది. ‘‘ఈ మూడింటిని ఒక్క క్షణంలో అధిగమించాలి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి చేసే సాధన ద్వారా కాదు. దీనికి వేరే మార్గం ఏదీ లేదు అంటారు’’ కృష్ణమూర్తి. ‘అది ఎలా సాధ్యం?’ అనేదే అసలు ప్రశ్న. క్లిష్టమైన శేషప్రశ్న.

గుంటూరు వనమాలి

www.gunturu.de

Updated Date - Jan 03 , 2025 | 06:42 AM