Star Kids: వారసులొస్తున్నారు
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:59 AM
బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే హిందీలోనే ఈ ట్రెండ్ ఎక్కువ.
బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే హిందీలోనే ఈ ట్రెండ్ ఎక్కువ. అయితే వారసత్వంతో తెరకు పరిచయమైనా... స్వయం ప్రతిభతో స్టార్స్‌గా ఎదిగినవారెందరో ఉన్నారు. ఈ ఏడాది ఏకంగా ఎనిమిది మంది వారసులు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. బిగ్ స్ర్కీన్‌పై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన వారంతా సినీ నేపథ్యమున్న కుటుంబాల నుంచి వచ్చిన వారే. మరి వీరిని బాలీవుడ్ ప్రేక్షకులు ఏ మాత్రం ఆదరిస్తారో చూడాలి!
అమన్ దేవ్‌గణ్- రాషా తడాని
బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని, స్టార్ హీరో అజయ్ గేవ్‌గణ్ మేనల్లుడు అమన్ దేవ్‌గణ్ జంటగా ‘ఆజాద్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో అజయ్ దేవగణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాషా తడానికి ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా రవీనా కూతురిగా కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ఇబ్రహీం అలీఖాన్
సైఫ్ అలీఖాన్, మొదటి భార్య అమృతాసింగ్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ ‘సర్‌జమీన్’ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమవుతున్నాడు. కయోజ్ ఇరానీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం. హీరో పాత్రకు ఇబ్రహీం అలీఖాన్ పర్ఫెక్ట్ చాయిస్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
షనాయా కపూర్
ప్రముఖ నటుడు సంజయ్ కపూర్, మహీప్ కపూర్‌ల ముద్దుల కుమార్తె షనాయా కపూర్. కపూర్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి తరానికి చెందిన అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే షనాయా కపూర్ కూడా గ్లామర్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బేనర్‌పై కరణ్ జోహర్ ‘బేధడక్’ అనే చిత్రాన్ని షనాయా కపూర్ హీరోయిన్‌గా 2022లోనే అనౌన్స్ చేశారు. కానీ ఏవో తెలియని కారణాలతో ఈ చిత్ర నిర్మాణం పట్టాలెక్కలేదు. దీంతో షనాయా విక్రాంత్ మాస్సే సరసన ‘ఆంఖోన్ కి గుస్తాకియాన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
అహాన్ పాండే
బాలీవుడ్ నటి అనన్య పాండే కజిన్ బ్రదర్, చుంకీ పాండే మేనల్లుడు ‘అహాన్ పాండే’ యశ్ రాజ్ ఫిల్మ్స్ బేనర్‌పై మోహిత్ సూరీ దర్శకత్వం వహించనున్న చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఇందుకోసం యశ్‌రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా గత ఐదేళ్లుగా తన స్వీయ పర్యవేక్షణలో అహాన్‌కు ప్రత్యేక శిక్షణను ఇప్పిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రానుంది.
అమన్ ఇంద్ర కుమార్
బాలీవుడ్ దర్శకనిర్మాత ఇంద్ర కుమార్ కుమారుడు అమన్ ఇంద్ర కుమార్ ‘తేరా యార్ హూ మై’ చిత్రంలో నటిస్తున్నారు. మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఐశ్వరీ థాకరే
శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే మనువడు ఐశ్వరీ థాకరే. సాధారణంగా సెలబ్రీటీల సంతానం వారి తల్లిదండ్రులు రాణిస్తున్న రంగాల్లోనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కానీ అందుకు భిన్నంగా ఐశ్వరీ రాజకీయాలను కాదని గ్లామర్ ఫీల్డ్ బాట పట్టారు. అందుకోసం ఫిల్మ్ మేకింగ్‌లో ఐదేళ్లు శిక్షణ కూడా తీసుకున్నారు. బాలీవుడ్‌లోని ఓ బిగ్ బేనర్ ద్వారా ఐశ్వరీ థాకరే ఎంట్రీ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావల్సి ఉంది.
వీర్ పహారియా
జాన్వీ కపూర్ స్నేహితుడు శిఖర్ పహారియా సోదరుడు వీర్ పహారియా ‘స్కై ఫోర్స్’ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు వరుణ్ ధావన్ నటించిన ‘భేదియ’ చిత్రానికి వీర్ పహారియా సహాయ దర్శకుడిగా పనిచేశారు.