Home Makeover: అందంగా అలంకరిద్దాం!
ABN , Publish Date - Jan 01 , 2025 | 03:00 AM
నూతన సంవత్సరం వచ్చేసింది. శుభాకాంక్షలు చెప్పడానికి స్నేహితులు, బంధువులు మన ఇంటికి వస్తుంటారు.
నూతన సంవత్సరం వచ్చేసింది. శుభాకాంక్షలు చెప్పడానికి స్నేహితులు, బంధువులు మన ఇంటికి వస్తుంటారు. ఇంటిని అందంగా శోభాయమానంగా అమర్చుకుంటే అందరితో కలిసి సంతోషంగా గడిపేయవచ్చు. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ ఇంటిని ఎలా ముస్తాబు చేసుకోవాలో తెలుసుకుందాం!
ఇల్లు శుభ్రం: ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే ఏ అలంకరణ చేసినా ఇంటి అందం ఇనుమడిస్తుంది. రోజూ చేసేదానికంటే కొంచెం ఎక్కువ శ్రద్ద పెట్టి ఇంటిని శుభ్రం చేయండి. పాత కర్టెన్లు, బెడ్‌షీట్లు, సోఫా కవర్లు మార్చి కొత్తవి వేయండి. అలాగే పనికి రాని వస్తువులను తీసివేయండి. మీ అభిరుచిని తెలిపే పుస్తకాలను చక్కగా సర్దండి. అందమైన గాజు వస్తువులను పొందికగా అమర్చండి. వంటిల్లు, బెడ్‌రూమ్, స్టడీరూమ్, లివింగ్ రూమ్, హాల్ అన్నింటిని దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసి అక్కడి వస్తువులను అందంగా అమర్చండి. జలపాతాల సవ్వడి, పక్షుల అరుపులు వినిపిస్తూ అందమైన చేపలు తిరుగాడే అక్వేరియాన్ని హాల్లో అమర్చండి. ఇది పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తుంది. మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ లాంటి మొక్కల కుండీలను కూడా గది మూలల్లో ఉంచండి.
ముగ్గులు: రంగురంగుల ముగ్గులు ఇంటి శోభని పెంచుతాయి. రంగులతోనే కాకుండా రకరకాల పూల రెక్కలతో చిన్న చిన్న ముగ్గులను అక్కడక్కడా పెడితే ఇంటికి మంచి కళ వస్తుంది. ఇంటి గుమ్మం, దేవుని గది. బెడ్ రూమ్‌ల ముందు ముగ్గులు వేస్తే బాగుంటుంది. హాల్లో సోఫా ఎదుట కొంచెం పెద్ద ముగ్గు ఉండేలా చూసుకోవాలి.
ఫెయిరీ లైట్స్: బాల్కనీ, గార్డెన్ ఏరియాలను ఫెయిరీ లైట్లతో అలంకరించండి. ఇవి సాయంత్రం వేళ అందంగా అహ్లాదకరంగా కనిపిస్తాయి. గార్డెన్ మధ్యలో టేబుల్.... చుట్టూ కుర్చీలు వేస్తే అతిథులు కూర్చోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇంటి ముందు, బాల్కనీలో కూడా కుర్చీలు వేసి ఉంచండి. ఇంటి పరిసరాల్లో నియాన్ లైట్లు ఏర్పాటు చేస్తే అహ్లాదకరంగా ఉంటుంది.
గోడల అలంకరణ: గోడల మీద అందమైన ఫొటో ఫ్రేమ్‌లు, చక్కని పెయింటింగ్‌లు, పిల్లలు-స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు ఏర్పాటు చేస్తే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. చిన్న కథలు, సరదా వాక్యాలు రాసిన రంగుల కాగితాలు అక్కడక్కడా అంటిస్తే అతిథులను కట్టిపడేస్తాయి.
కొవ్వొత్తులు: రకరకాల కొవ్వొత్తులు ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. కొవ్వొత్తుల వెలుతురులో ఇల్లు మెరిసిపోతుంది. మంచి సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులు కూడా లభ్యమవుతున్నాయి. వీటిని టీవీకి ఇరుపక్కలా, టీపాయ్ మీద, సోఫా పక్కన ఏర్పాటు చేస్తే ఇల్లు సువాసన భరితంగా కళకళలాడుతుంది. వేలాడే లాంతర్లు, చిన్న దీపాలతో కూడా ఇల్లు అలంకరించుకోవచ్చు.