చలి కాలం పిల్లల రక్షణ
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:50 AM
చల్లని వాతావరణంలో వైరస్, బ్యాక్టీరియాలు విస్తృతంగా విస్తరించి ఉంటాయి. పైగా పసికందుల్లో వ్యాధినిరోధకశక్తి తక్కువ కాబట్టి తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. శ్వాసకోశ సమస్యలతో పాటు, చెవికి సంబంధించిన...
కౌన్సెలింగ్
చలి కాలం పిల్లల రక్షణ
డాక్టర్! మా బాబుకు ఏడాది వయసు.
చలి కాలంలో శ్వాసకోశ సమస్యలకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ కాలంలో చల్లని వాతావరణం నుంచి ఎలా కాపాడుకోవాలి?
- ఓ సోదరి, హైదరాబాద్
చల్లని వాతావరణంలో వైరస్, బ్యాక్టీరియాలు విస్తృతంగా విస్తరించి ఉంటాయి. పైగా పసికందుల్లో వ్యాధినిరోధకశక్తి తక్కువ కాబట్టి తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. శ్వాసకోశ సమస్యలతో పాటు, చెవికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు, స్టమక్ ఫ్లూలు పసికందుల్లో సహజం.
ఆవిరి, సెలైన్ డ్రాప్స్ కీలకం
ఈ కాలంలో రాత్రుళ్లు గాలిలో తేమ పెరిగిపోతుంది కాబట్టి ముక్కులు మూసుకుపోయి, శ్వాస తీసుకోడానికి కష్టపడుతూ ఉంటారు. పాలు తాగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వేడి నీటి ఆవిరితో ఈ సమస్య సులభంగానే తగ్గిపోతుంది. కాబట్టి ఆవిరి పట్టే డబ్బాను ఉపయోగించి, చేత్తో ఆ ఆవిరి బిడ్డ ముక్కు వైపు వెళ్లేలా చేయాలి. అలాగే నాసికా రంథ్రాల్లో ఒకట్రెండు చుక్కల సెలైన్ డ్రాప్స్ వేసి, ముక్కును సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే, ద్రవాలు గొంతులోకి జారి, పసికందులు వాటిని మింగేస్తారు కాబట్టి ముక్కు దిబ్బెడ వదిలి సునాయాసంగా ఊపిరి పీల్చుకోగలుగుతారు. చాలా మంది తల్లితండ్రులు యాంటీ హిస్టమిన్ మందులు, యాంటీబయాటిక్స్ స్వయంగా కొనేసి, పిల్లలకు వాడడం మొదలుపెట్టేస్తూ ఉంటారు. ఇలా వైద్యులను సంప్రతించకుండా సొంతగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను పెంచిన వాళ్లవుతారు. అలర్జీ తత్వం కలిగిన పిల్లల్లో ఈ కాలంలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు పదే పదే వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి పిల్లలకు పీడియాట్రిషియన్లు సూచించిన మందులనే వాడుకుంటూ, అలర్జీలను పెంచే అంశాలను గుర్తించి వాటి నుంచి రక్షణ కల్పించాలి. ఉదయాన్నే సమస్యలు పెరుగుతూ ఉంటే, వెంటనే మందుల వాడకం మొదలుపెట్టి, ఇన్‌ఫెక్షన్ తీవ్రతరం కాకుండా నియంత్రించాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఐదేళ్ల కంటే చిన్న వయసు పిల్లలకు ఏడాదికోసారి ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్ వేయించాలి
తరచూ దగ్గు, జలుబుకు గురయ్యే పిల్లల్లో చెవి ఇన్‌ఫెక్షన్లు కూడా పెరుగుతాయి. ఆవిరి పట్టడం, యాంటీ హిస్టమిన్లతో ఈ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకూడదు.
చలికాలంలో పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి బయటి పదార్థాలు తినకుండా పిల్లలను కట్టడి చేయాలి
చర్మం తేమగా ఉండడం కోసం స్నానానికి ఒకటి రెండు గంటల ముందు స్వచ్ఛమైన కొబ్బరినూనెతో మర్దన చేయించాలి
పసికందులకు రోజుకు ఒక్కసారి స్నానం చేయిస్తే సరిపోతుంది
పసికందుల స్నానానికి ఆల్కలైన్ పిహెచ్‌కు బదులుగా న్యూట్రల్ పిహెచ్ కలిగిన సబ్బులు వాడుకోవాలి.
డాక్టర్ సి.వి.ఎస్ లక్ష్మి,
సీనియర్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, క్లౌడ్ నైన్ హాస్పిటల్స్,
కొంపల్లి, హైదరాబాద్
హీటర్లు వాడకూడదు
చలికాలం పసికందులకు వెచ్చదనం కోసం మందపాటి స్వెటర్లు, దుప్పట్లు వాడుకోవాలి. చాలామంది పడగ్గదుల్లో హీటర్లను వాడుతూ ఉంటారు. కానీ విపరీతమైన చలితో కూడా ఢిల్లీ, కాశ్మీరు లాంటి ప్రాంతాల్లోనే వీటిని వాడుకోవాలి. చలి మధ్యస్తంగా ఉండే దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి పసికందుల కోసం హీటర్లను వాడుకోవలసిన అవసరం లేదు. వీటిని వాడడం వల్ల గాల్లోని తేమ మొత్తం మాయమైపోయి, పిల్లల ముక్కులోని స్రావాలు పొడిబారి, ముక్కు దిబ్బెడ మరింత పెరిగిపోతుంది. శ్వాస తీసుకోవడం కూడా మరింత సమస్యగా మారుతుంది.