నేస్తాల అక్షర యజ్ఞం
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:53 AM
‘‘ఒకసారి సంపాదిస్తే మనతోనే ఉండేది, ఎవరూ తీసుకోలేనిదీ, ఎంత పంచినా తరగనిది విద్య మాత్రమే. ఎన్నో కారణాలతో విద్యకు దూరమవుతున్న వారిలో భరోసా కల్పించాలనే చిన్న ప్రయత్నం మాది’’ అంటారు అదితి శ్రీవత్సన్, నేహా గోవిందరాజన్...
‘‘ఒకసారి సంపాదిస్తే మనతోనే ఉండేది, ఎవరూ తీసుకోలేనిదీ, ఎంత పంచినా తరగనిది విద్య మాత్రమే. ఎన్నో కారణాలతో విద్యకు దూరమవుతున్న వారిలో భరోసా కల్పించాలనే చిన్న ప్రయత్నం మాది’’ అంటారు అదితి శ్రీవత్సన్, నేహా గోవిందరాజన్. ఈ చెన్నై అమ్మాయిలు ఏర్పాటు చేసిన ‘బ్లూ లిలాక్ ఫౌండేషన్’... పుస్తక విరాళాలు, ఇతర కార్యక్రమాలతో సర్కారు బడుల్లో చదివే అట్టడుగు వర్గాల పిల్లల వికాసానికి దోహదం చేస్తోంది.
‘‘పుస్తకాలను విరాళంగా సేకరించి, పేద పిల్లలకు పంచాలనే ఆలోచనను నా స్నేహితురాలు అదితి శ్రీవత్సన్ చెప్పినప్పుడు... నేను సంకోచించాను. ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టడానికి తగినంత వయసు మాకు లేదనేది నా అభిప్రాయం. అప్పుడు అదితి ‘‘సమాజానికి ఏదైనా సేవ చెయ్యాలంటే ముప్ఫయ్యేళ్ళో, నలభయ్యోళ్ళో రానవసరం లేదు. మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు’’ అంది. ‘నిజమే కదా!’ అనిపించింది. ఆలస్యం చెయ్యకుండా మా ‘బ్లూ లిలాక్ ఫౌండేషన్’కు శ్రీకారం చుట్టాం’’ అని గుర్తు చేసుకుంది నేహా గోవిందరాజన్. చెన్నైలో పుట్టి, పెరిగిన ఈ పదిహేడేళ్ళ అమ్మాయిలిద్దరూ మంచి స్నేహితులు. ప్లస్ వన్ విద్యార్థులు. పుస్తకాలంటే ఇష్టం. కనీస చదువులకు నోచుకోని పేద పిల్లలను చూసి ఇద్దరూ బాధపడేవారు. ఎలాంటి సాయమైనా విద్యకు సంబంధించినదే చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కిందటి ఏడాది వేసవి సెలవుల్లో... తమ ఆలోచనలకు ఒక రూపం ఇచ్చారు.
తాతయ్య స్ఫూర్తితో...
‘‘చదువుకొనే స్థోమత లేనివారికి ఏదైనా సాయం చేయాలనేది ఒక్కరోజులో నాకు కలిగిన ఆలోచన కాదు. సామాజిక ఒత్తిడుల కారణంగా మా అమ్మమ్మ అయిదో తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. ఈ సంగతి నాతో ఎన్నోసార్లు చెప్పి బాధపడింది. బాగా చదువుకోవాలనే కోరిక ఉన్నా... కుటుంబ, ఆర్థిక పరిస్థితుల వల్ల, మౌలిక వనరులు లేకపోవడం వల్లా ఎందరో తమ కలను నెరవేర్చుకోలేకపోతున్నారనే వాస్తవం నన్ను కలవరపెట్టేది. అయితే నా వంతుగా ఏదో చెయ్యాలనే స్ఫూర్తి... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అధికారి అయిన మా తాతయ్య ఎ.ఆర్.శ్రీధర్ నుంచి పొందాను. ‘‘మనకు ఉన్నదాన్ని పదిమందితో పంచుకోవడం మన బాధ్యత’’ అని ఆయన చెప్పిన మాటలు నాలో నాటుకుపోయాయి. ఒక రోజు మా ఇంట్లో పాత పుస్తకాలను సర్దుతున్నప్పుడు... దాదాపు వందకు పైగా నా పాత తరగతుల పుస్తకాలు కనిపించాయి. అవన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి. వాటిని అవసరం ఉన్నవారికి ఇస్తే ప్రయోజనం ఉంటుందనిపించింది’’ అంటోంది అదితి. నేహాతో కలిసి ఆ పుస్తకాలను ఒక అనాథాశ్రమానికి తీసుకువెళ్ళింది. అక్కడ అట్టడుగువర్గాల అమ్మాయిలు కూడా ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఈ పుస్తకాలను స్నేహితులిద్దరూ పంచిపెట్టారు. ఆ పిల్లల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని చూసిన తరువాత... ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నారు.
మొదట్లో భయపడినా...
తొలి ప్రయత్నంగా.. షోలింగనల్లూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు వెళ్ళారు. పుస్తకాలు విరాళాలుగా ఇవ్వాలని కోరుతూ వాటి సేకరణ వెనుక ఉద్దేశాన్ని వివరించారు. ఎలాంటి స్పందన వస్తుందోనని మొదట భయపడ్డారు. కానీ అక్కడ నివసిస్తున్నవారు ఉత్సాహంగా స్పందించారు. తమ దగ్గర ఉన్న పాత పుస్తకాలు, తమకు అవసరం లేదనుకున్న పుస్తకాలు ఇచ్చారు. ‘‘కొద్ది రోజుల్లోనే 350 పుస్తకాలు వచ్చాయి. వాటిలో పాఠ్య పుస్తకాల నుంచి కాల్పనిక సాహిత్యం వరకూ ఉన్నాయి. వాటిని ఒక బాలికల పాఠశాలకు అందజేశాం. మా గురించి విన్న వారు పిలిచి మరీ పుస్తకాలు ఇవ్వడం ఆరంభించారు’’ అని చెప్పారు అదితి, నేహ.. క్రమంగా స్థానికంగా పనిచేసే సంస్థలు, ఇంటి యజమానుల సంఘాల్లో వారు భాగస్వాములయ్యారు. ఏడాది కాలంలో దాదాపు 4,700కు పైగా పుస్తకాలను పాఠశాలలకు అందజేశారు. వీటివల్ల 3,000 మందికి పైగా పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. అంతేకాదు, ఆరు లైబ్రరీల ఏర్పాటుకు కూడా ఈ స్నేహితులు దోహదం చేశారు.
ఆంగ్లం... ఆర్థికం
‘‘ఇప్పుడు ఫౌండేషన్ కార్యకలాపాల పరిధిని విస్తరించాం. ప్రధానంగా రెండు అంశాల మీద దృష్టి పెట్టాం. అవి ఆంగ్ల భాషలో నైపుణ్యం, ఆర్థిక అక్షరాస్యత. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎంతోమంది పిల్లలు ఇంగ్లీష్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. తప్పులు మాట్లాడతామనే భయంతో మాట్లాడడానికి సందేహిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం కోసం కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆంగ్ల సంభాషణా నైపుణ్యాలను పెంచడం కోసం విద్యావేత్తలతో కలిసి ఒక పాఠ్య ప్రణాళిక రూపొందించాం’’ అంటోంది అదితి. అలాగే ‘‘జీవితం సక్రమంగా సాగాలన్నా, సురక్షితమైన భవిష్యత్తు కావాలన్నా ఆర్థిక విషయాల్లో నైపుణ్యం ఎంతో ముఖ్యం. అందుకే ఇంటి బడ్జెట్, ఆదా చేసుకోవడం, ఆర్థిక మోసాల బారిన పడకుండా ఉండడం లాంటి అంశాలను బోధిస్తున్నాం’’ అని చెబుతోంది నేహా. ‘బ్లూ లిలాక్ ఫౌండేషన్’ చేపడుతున్న కార్యక్రమాలు పలువురు విద్యార్థులను ఆకర్షించాయి. వారు తమ పాఠశాలల్లో ‘బుక్‌డ్రైవ్’లను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా మరింతమందికి పుస్తకాలు ఉచితంగా అందించడానికి వీలవుతోంది. ‘‘మా స్నేహితురాలు తనుశ్రీ... ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఫౌండేషన్ వ్యవహారాల్లో మాకు తోడుగా ఉంది. ఏడాది క్రితం ఫౌండేషన్‌ను ప్రారంభించినప్పుడు ఇంత స్పందన వస్తుందని మేమనుకోలేదు. ఇప్పుడు ఇదొక పూర్తిస్థాయి ఉద్యమంగా రూపుదిద్దుకుంది. అవసరం ఉన్న ప్రతి విద్యార్థికి సాయం అందించాలన్నది మా లక్ష్యం. దాని కోసం కృషి చేస్తాం’’ అని చెబుతున్నారు అదితి, నేహా.