Share News

Good Friday: లోకానికి వెలుగుదారి

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:47 AM

క్రీస్తు జననం, మరణం, పునరుత్థానం అంటే అద్బుతాలు, ఇవి మన జీవితంలో మార్గదర్శకాలు గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ మనిషిలో ఆశాశక్తిని నింపే శక్తివంతమైన సందర్భాలు

Good Friday: లోకానికి వెలుగుదారి

దైవమార్గం

నేడు గుడ్‌ ఫ్రైడే

క్రీస్తు జననం, మరణం, పునరుత్థానం... ఈ మూడూ అద్బుతాలే. ఈ సందర్భాలను క్రిస్మస్‌, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పేరిట క్రైస్తవు లు జరుపుకొంటారు. జననం, పునరుత్థానం... సంతోషకరమైన ఘట్టాలు.

మరి మరణించిన ఈ శుక్రవారం శుభమైనది ఎలా అయింది?

క్రీస్తు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే... ఆయన మరణం గురించి ఎందరో భక్తులు, ప్రవక్తలు ముందుగానే ప్రవచించిన దాఖలాలు బైబిల్‌ గ్రంథంలో కనిపిస్తాయి. ఆయన జననం, మరణం యాదృచ్ఛికం కాదని, అది ముందుగానే నిర్దేశించి ఉందనీ బైబిల్‌ పూర్వ లేఖన సాహిత్యం చెబుతోంది. ఆయన మరణానికి ముందు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుందాం.

గలిలియా సముద్రతీరాన ఉన్న ప్రాంతంలోని పల్లె పల్లెను ఏసు పలకరించి, అక్కడి ప్రజలకు తన సూక్తులను, ఉపమాన కథలను వినిపించాడు. ఆయన బోధలతో ప్రజలు అనేక సత్యాలు తెలుసుకొని చైతన్యవంతులు ఉన్నారు. అప్పటికే స్థిరపడి ఉన్న యూదా మత పెద్దరికం దీన్ని చూసి ఓర్వలేకపోయింది. అసూయతో, తమ ప్రాధాన్యం తగ్గిపోతుందనే భయంతో ఆయనపై కుట్రలు పన్నింది. అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని క్రీస్తుపై నిందలు మోపింది, విప్లవకారుడిగా ముద్ర వేసింది. రాచరికానికి వ్యతిరేకంగా ప్రజల్ని మారుస్తున్నట్టు చిత్రీకరించింది. నాటి రోమన్‌ రాచరికం కూడా దీన్ని నమ్మింది. ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈ సంగతి తెలుసుకున్న ప్రభువే వారికి పట్టుబడ్డాడు. ఆయనను బంధించి, సంకెళ్ళు వేశారు. దోషిగా తీర్పు ఇచ్చారు.


తలపై ముళ్ళ కిరీటం పెట్టి, భుజానికి బరువైన శిలువను ఎత్తి, కొరడాలతో కొడుతూ కొండపైకి నడిపించారు. బలహీనస్థితికి చేరుకున్న ఆయనను కల్వరి శిఖరానికి చేర్చారు. ఆయనను శిలువ కొయ్యపై ఉంచి, కాళ్ళకు, చేతులకు మేకులు కొట్టి వేలాడదీశారు. ఆ స్థితిలో కూడా ‘‘తండ్రీ వీరు ఏం చేస్తున్నారో వీరికే తెలియదు. కనుక వీరిని క్షమించు’’ అని ఆ దేవుణ్ణి వేడుకున్నాడు. శిలువపై అంతటి బాధలోనూ క్షమాగుణాన్ని వీడలేదు. తన ప్రేమ సందేశాన్ని వినిపించాడు. రక్తసిక్తమైన దేహంతో ఆ శిలువపైనే ఆయన మరణించాడు. అదే శుభ శుక్రవారం. గుడ్‌ ఫ్రైడే.

జీవన మార్గదర్శులు

అలా మరణించిన క్రీస్తు శరీరాన్ని ఆయన శిష్యులు అతి భద్రంగా సమాధి చేశారు. మరణించిన మూడో రోజు ఆదివారం... సమాధి నుంచి ఆయన తిరిగి లేచాడు. అదే ఈస్టర్‌... పునరుత్థానం. ఇద్దరు మహిళలు ఆయనను దర్శించుకోవడానికి తెల్లవారుజామునే సమాధి ఉన్న చోటుకు చేరుకున్నారు. అప్పటికే మరణం నుంచి లేచిన క్రీస్తు.. ఆ సమాధి తోటలో తిరగడం చూశారు. అతను తోటమాలి అనుకొని... ఆయన ఆచూకీ గురించి ఆయననే అడిగారు. క్రీస్తులో దైవత్వానికి ఈ పునరుత్థానమే సాక్ష్యం. ఆ తరువాత ఆయన అనేకసార్లు తన శిష్యులకు కనిపించాడు. వారి మధ్య తిరిగాడు. అయినా వారు గుర్తు పట్టీపట్టనట్టు అనుమానంతో ఉండిపోయారు. ఒకసారి... వారంతా గుమిగూడిన గదిలో ప్రభువు వారికి దర్శనమిచ్చి... ప్రజల కోసం ఏం చేయాలో ఆదేశించాడు. ప్రజలను బాప్తిస్మం (బాప్టిజం) ఇచ్చి, తన వాక్యం బోధించి, శిష్యులుగా చేయాలని, వారికి పవిత్రాత్మ తప్పకుండా తోడవుతుందని భరోసా ఇచ్చాడు.


ఏసు ఈ భూమి మీద ముప్ఫై మూడేళ్ళపాటు జీవించాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నాడు. ఉపమానాలతో కూడిన ఎన్నో కథలతో, తనచుట్టూ ఉన్న సామాన్య జనానికి అర్థమయ్యే భాషలో బోధనలు చేశాడు. వాటిని ప్రపంచం నేటికీ ఆసక్తిగా వింటూనే ఉంది. ఎందుకంటే... అవి మానవ జీవనానికి మార్గదర్శులు. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? తోటి వారితో ఎలా మెలగాలి? ఏది సత్యమైన మార్గం? ఏది ఆదర్శమైన జీవనం?... ఇలా ఎన్నో అంశాలకు అవి నిర్వచనాలు.

గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌... మనిషిలో ఆశావాదాన్ని నింపుతాయి. కష్టకాలంలో ఆత్మస్థైర్యంతో నిలబడాలని చెబుతాయి. మానవులకు కష్టాలు సర్వసాధారణం. మానవుడిగా జన్మించిన దైవపుత్రుడు కూడా అందుకు అతీతుడు కాదు. క్రీస్తు మరణం రాబోయే శుభాలకు సంకేతం. ఎండిపోయిన విత్తనం తిరిగి జీవాన్ని పుంజుకొని, చిగిర్చి, పైకి లేచినట్టు... ఆయన మరణం నుంచి తిరిగి లేచాడు. క్రీస్తు మానవునిలా పుట్టి, మానవునిలా మరణించిన ఘట్టాలు రెండూ ఈ భూమిపైనే జరిగాయి. ఆయన పునరుత్థానం ఇక్కడే జరిగింది. ఇది ఆయన పట్ల జనంలో విశ్వాసాన్ని బలోపేతం చేసింది. ఆయన చూపిన వెలుగుదారిని లోకం అనుసరించేలా చేసింది.

-డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 12:48 AM