Share News

Healthy Desserts: పంచదారకు బదులుగా...

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:11 AM

చలికాలంలో తరచుగా వచ్చే ప్రత్యేక సందర్భాల కోసం తీపి పదార్థాలు వండుతుంటాం.

Healthy Desserts: పంచదారకు బదులుగా...

చలికాలంలో తరచుగా వచ్చే ప్రత్యేక సందర్భాల కోసం తీపి పదార్థాలు వండుతుంటాం. వీటిలో చాలావరకూ పంచదారనే ఉపయోగిస్తాం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. పంచదారకు బదులు ఏమి వాడవచ్చో తెలుసుకుందాం!

తేనె

ఇది సహజంగా లభించే తీపి పదార్థం. దీనిని సంప్రదాయ తీపి వంటకాలతోపాటు కేక్‌లు, కుకీలు, పేస్ట్రీల తయారీలో వాడవచ్చు. తేనెలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ముడి తేనె వాడుకోవడం మంచిది.

బెల్లం

దీనిని చెరకు లేదా తాటి రసంతో తయారు చేస్తారు. రెండూ ఆరోగ్యానికి మంచివే. వీటిలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. నువ్వుల లడ్డూలు, క్యారెట్‌ లేదా గాజర్‌ హల్వా, పుడ్డింగ్‌ల తయారీలో బెల్లాన్ని వాడడం మంచిది.

ఖర్జూరాలు

కేక్‌, కుకీల తయారీలో ఖర్జూరం సిరప్‌... ఖీర్‌, పాయసం, హల్వా, డ్రైఫ్రూట్‌ లడ్డూల తయారీలో ఖర్జూరం పేస్ట్‌.... వాడుకోవచ్చు. ఖర్జూరంలో ఉండే పొటాషియం రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధిస్తుంది.

కొబ్బరి చక్కెర

దీనిని కొబ్బరి చెట్టు పూల మొగ్గల కాండం స్రవించే రసం నుంచి తయారు చేస్తారు. దీనిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ శాతం చాలా తక్కువ. మామూలు పంచదారలో కంటే 400 రెట్లు అధికంగా పొటాషియం ఉంటుంది. కొబ్బరి చక్కెరలో అత్యధికంగా ఉండే సుక్రోజ్‌... కొవ్వుగా మారదు. పాయసం, లడ్డూలు, మఫిన్ల తయారీకోసం కొబ్బరి చక్కెరను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.

మాపుల్‌ ద్రావణం

దీనిని మాపుల్‌ చెట్ల కాండం నుంచి తయారు చేస్తారు. ఇది బంగారం రంగులో ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాన్‌ కేక్‌, కుకీ, పేస్ట్రీల తయారీకి ఈ ద్రావణం అనుకూలంగా ఉంటుంది.

Updated Date - Jan 06 , 2025 | 04:16 AM