ధనుర్మాసంలో... పంచరంగాలు చూసొద్దాం!
ABN , Publish Date - Jan 03 , 2025 | 06:58 AM
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు... దేశంలో అత్యంత పవిత్రమైనవిగా పూర్వులు పేర్కొన్న ఏడు నదుల్లో కావేరి ఒకటి. ఒక పురాణ కథ ప్రకారం... కవేర ముని కుమార్తె కావేరి. ఆమె అగస్త్య మహాముని రెండో భార్య. అగస్త్యుడు నిరంతరం దేశ సంచారంలో ఉండేవాడు. ఆయనతోనే ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించిన కావేరి... నీటిగా మారింది. ఆయన కమండలంలో స్థిరపడింది....
ఆలయదర్శనం
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు...
దేశంలో అత్యంత పవిత్రమైనవిగా పూర్వులు పేర్కొన్న ఏడు నదుల్లో కావేరి ఒకటి. ఒక పురాణ కథ ప్రకారం... కవేర ముని కుమార్తె కావేరి. ఆమె అగస్త్య మహాముని రెండో భార్య. అగస్త్యుడు నిరంతరం దేశ సంచారంలో ఉండేవాడు. ఆయనతోనే ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించిన కావేరి... నీటిగా మారింది. ఆయన కమండలంలో స్థిరపడింది. అలా ఒకసారి సహ్యాద్రి ప్రాంతంలో (పశ్చిమ కనుమల్లో) అగస్త్యుడు పర్యటిస్తూ... ఒక చోట ధ్యానం కోసం ఆగాడు. అదే సమయంలో... ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని భావించిన భగవంతుడు... ఒక కాకిలో ప్రేరణ కలిగించాడు. ఆ కాకి ఎగురుతూ వచ్చి, అగస్త్యుడి కమండలాన్ని తోసేసింది. కమండలంలో నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహించి, నదీ రూపం దాల్చింది. అదే కావేరి. కావేరీ నదిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా భావిస్తారు. ఆ నదీ తీరంలో... కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొన్న అయిదు రంగనాథుడి ఆలయాలు... పంచ రంగ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ క్షేత్రాల్లో రంగనాథస్వామి శయన భంగిమలో దర్శనమిస్తాడు. వైష్ణవులకు ఇవి అత్యంత పవిత్రమైనవి. ముఖ్యంగా ధనుర్మాసంలో వీటిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకొని, రంగనాథుణ్ణి పూజిస్తారు.
శ్రీరంగపట్నం:
పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగపట్నంలోని రంగనాథుడి ఆలయం మొదటిది. కర్ణాటకలోని మైసూరు నగరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం వెయ్యేళ్ళ పూర్వం నాటిది. పశ్చిమ గంగవంశానికి చెందిన పాలకులు దీన్ని కట్టించారని చరిత్ర చెబుతోంది. శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకొని టిప్పుసుల్తాన్ పరిపాలించాడు. విశిష్టాద్వైత ప్రతిపాదకుడైన శ్రీమద్రామానుజాచార్యులు ఇక్కడ కొంతకాలం నివసించారు. ఆలయం గర్భగుడిలో రంగనాయకీ సమేతుడైన శ్రీ రంగనాథస్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు, నారసింహుడు, హనుమంతుడు, గరుత్మంతుడు తదితర దేవతామూర్తులు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో కొలువుతీరి ఉన్నారు.
కోవిలడి (తిరుప్పర్‌నగర్):
వైష్ణవులు పవిత్రంగా భావించే 108 దివ్యదేశాలలో ఒకటైన అప్పక్కుడుతాన్ పెరుమాళ్ ఆలయం తమిళనాడులోని ప్రధాన నగరాల్లో ఒకటైన తిరుచిరాపల్లి (తిరుచ్చి)కి 28 కిలోమీటర్ల దూరంలోని కోవిలడిలో ఉంది. ఇక్కడి రంగనాథుడికి ‘అప్పక్కుడుతాన్ పెరుమాళ్’ అనే పేరు రావడం వెనుక ఒక కథ... స్థలపురాణంలో కనిపిస్తుంది. ఉపమన్యుడనే మహారాజుకు శ్రీమహావిష్ణువు వృద్ధ రూపంలో దర్శనం ఇచ్చాడు. తనకు ఆహారం కావాలని అడిగాడు. ఉపమన్యుడు ఎన్ని పదార్థాలను నివేదించినా... స్వామి ఆకలి శాంతించలేదు. ఏం చెయ్యాలో తెలియక... తనకు మార్గం చూపించాలని పరాశర మహర్షిని ఉపమన్యుడు ఆశ్రయించాడు. అప్పాలను భక్తిపూర్వకంగా స్వామికి సమర్పించుకోవాలని పరాశరుడు సలహా ఇచ్చాడు. వాటితో సంతృప్తుడైన మహా విష్ణువు... అక్కడ కొలువయ్యాడు. మధ్యయుగ చోళుల కాలం నాటి ఈ ఆలయంలో శ్రీరంగనాథుడు భూదేవి, కోమలవల్లీ తాయార్ సమేతుడై ఉంటాడు.
కుంభకోణం:
ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కుంభకోణంలోని అతి పెద్ద వైష్ణవాలయాల్లో సారంగపాణి ఆలయం ఒకటి. భృగుమహర్షి... లక్ష్మీ నిలయమైన మహావిష్ణువు వక్షస్థలం మీద తన్నడం, లక్ష్మీదేవి భృగువుపై ఆగ్రహించడం, భృగువు అరికాలిలో ఉన్న కన్నును మహావిష్ణువు చిదిమెయ్యడంతో... భృగువు అహంకారం తొలగిపోవడం... ఈ కథ ‘శ్రీవేంకటాచల మహాత్మ్యం’లో కనిపిస్తుంది. ఆ తరువాత లక్ష్మీదేవిని భృగువు ప్రార్థించి, ప్రసన్నం చేసుకొని, తన కుమార్తెగా పుట్టాలని కోరుకుంటాడు. ఆ తరువాత హేమమహర్షిగా భృగువు, ఆయన కుమార్తె కోమలవల్లి (కోమలాంబాళ్)గా లక్ష్మీదేవి జన్మించారు. హేమమహర్షి కోరికపై విష్ణుమూర్తి తన విల్లును (సారంగాన్ని) చేతపట్టి, భూలోకానికి వచ్చి, కోమలవల్లిని పెళ్ళి చేసుకొని, అక్కడే స్థిరపడిపోయాడని స్థలపురాణం వివరిస్తోంది. అందుకే ఈ స్వామిని ‘వీట్టోడు మాప్పిళ్ళై’ (ఇల్లరికం అల్లుడు) అని పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం ఏడు, ఎనిమిది శతాబ్దాల్లో తొలి చోళ రాజుల కాలంలో జరిగి ఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం. కాగా పంచరంగ క్షేత్రాల్లో ఒకటిగా... ఈ ఆలయానికి బదులు తమిళనాడులోని నాగపట్నం జిల్లా వడ(ట)రంగంలో ఉన్న రంగనాథపెరుమాళ్ ఆలయాన్ని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి.
తిరుఇందలూర్:
తమిళనాడులోని మయిలాడుతురై పట్టణ శివార్లలోని తిరుఇందలూర్‌లో కొలువుతీరిన రంగనాథస్వామిని ‘పరిమళ పెరుమాళ్’ అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం... శాపగ్రస్థుడైన చంద్రుడు ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి ఇక్కడ తపస్సు చేశాడు. అనుగ్రహించిన మహావిష్ణువు ప్రత్యక్షమై, చంద్రుణ్ణి శాపవిముక్తుణ్ణి చెయ్యడంతోపాటు అతని కోరికపై ఇక్కడ వెలిశాడు. ఇందుడు అంటే చంద్రుడు... ఆ పేరుమీద ఈ క్షేత్రానికి ‘తిరుఇందలూర్’ అనే పేరు వచ్చింది. వెయ్యేళ్ళకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని మధ్య యుగ చోళులు, విజయనగర రాజులు, మధుర నాయకులు అభివృద్ధి చేశారు. పరిమళ పెరుమాళ్ దేవేరి పరిమళ రంగనాయకి. ఆమెను ‘చంద్రశాప విమోచనవల్లి’, ‘పుండరీకవల్లి’ అని కూడా పిలుస్తారు. గర్భాలయంలో నదీ దేవతలైన గంగ, కావేరి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆవరణలో యోగనరసింహుడు, రామాంజనేయులు, సూర్య చంద్రులు తదితర ఉపాలయాలు కూడా ఉన్నాయి. మయిలాడుతురై పట్టణ కేంద్రానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
శ్రీరంగం:
108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అత్యంత ప్రధానమైన శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం ‘భూలోక వైకుంఠం’గా, ‘ఇండియన్ వాటికన్’గా ప్రసిద్ధి చెందింది. దీన్ని ‘పెరియకోయిల్’ (పెద్ద గుడి) అని కూడా పిలుస్తారు. ‘శ్రీరంగ మహాత్మ్యం’తో సహా అనేక గ్రంథాల్లో ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన ఎన్నో కథలున్నాయి. ఈ ఆలయ గోపురం క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిదనేది వాటిలో ఒకటి. విభీషణుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది. రామాయణం, మహాభారతం, పద్మ, బ్రహ్మాండ, గరుడ పురాణాల్లో, అనేక ప్రాచీన గ్రంథాల్లో శ్రీరంగనాథుడి ప్రస్తావన ఉందని ‘శ్రీరంగ మహాత్మ్యం’ పేర్కొంటోంది. కాగా, క్రీస్తుపూర్వం 500 నుంచి 300 మధ్యకాలానికి చెందిన సంగమ యుగ తమిళ సాహిత్యం కూడా శ్రీరంగ క్షేత్ర విశిష్టతను వివరించింది. ధనుర్మాసంలో గానం చేసే తిరుప్పావై పాశురాలను రచించిన గోదాదేవి (ఆండాళ్)కి, శ్రీరంగనాథుడికి వివాహం కూడా జరిగిన ప్రదేశంగానూ దీనికి ప్రశస్తి ఉంది. 150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో 21 గోపురాలు, ఏడు ప్రాకారాలు ఉన్నాయి. 236 అడుగులతో, పదమూడు అంతస్తుల్లో ఉండే సమున్నతమైన రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ. అలాగే ప్రపంచంలోనే పెద్దదైన రంగనాథస్వామి విగ్రహం ఈ ఆలయంలో ఉంది. స్వామి దేవేరి శ్రీరంగనాయకి. ఆమెను ‘రంగనాయకి నాచియార్’ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలతో పాటు శ్రీరామానుజస్వామి భౌతిక దేహం కూడా దాదాపు 1200 ఏళ్లుగా భద్రపరచి ఉండడం మరో విశేషం. తిరుచిరాపల్లి (తిరుచ్చి)కి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
ఆదిమధ్యాంత రంగాలు
కావేరీ నది తీరంలోని మూడు వేర్వేరు దీవుల్లో ఉన్న రంగనాథ ఆలయాలను ‘ఆది’, ‘మధ్య’, ‘అంత్య’ రంగాలుగా పేర్కొంటారు. వీటిలో శ్రీరంగపట్నలోనిది ఆద్యరంగం, శ్రీరంగంలోనిది అంత్యరంగం కాగా... కర్ణాటకలోని శివసముద్రంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ‘మధ్యరంగం’గా వ్యవహరిస్తారు. ఇక్కడ రంగనాథస్వామి యవ్వనంలో ఉంటాడని భక్తుల నమ్మకం. కాబట్టి ఆయనను ‘మోహన రంగడు’, ‘జగన్మోహన రంగడు’ అని పిలుస్తారు.