Share News

Vanilla cake: వెనీలా కేక్‌... మీ కోసం

ABN , Publish Date - Jan 01 , 2025 | 02:52 AM

కొత్త సంవత్సరం మొదటి రోజున కేక్‌ కావాలని పిల్లలు అడుగుతూ ఉంటారు. బేకరీల్లో కొని తెచ్చే కేక్‌ పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది.

Vanilla cake: వెనీలా కేక్‌...  మీ కోసం

కొత్త సంవత్సరం మొదటి రోజున కేక్‌ కావాలని పిల్లలు అడుగుతూ ఉంటారు. బేకరీల్లో కొని తెచ్చే కేక్‌ పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. అలాకాకుండా పిల్లలు ఇష్టపడే కేక్‌ని ఇంట్లోనే తయారుచేస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఓవెన్‌ అందుబాటులో లేకపోయినా కుక్కర్‌లోనే రుచికరమైన వెనీలా కేక్‌ తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల చక్కెర పొడి, ఒక కప్పు వెన్న, రెండు చెంచాల బేకింగ్‌ సోడా, అర చెంచా ఉప్పు, రెండు గుడ్లు పగులగొట్టి వేసి బాగా కలపాలి. తరవాత ఇందులో మూడు కప్పుల మైదా పిండి, రెండు చెంచాల వెనీలా ఎసెన్స్‌ వేసి కలపాలి. రెండు కప్పుల పాలను కొద్ది కొద్దిగా వేస్తూ పిండి మిశ్రమాన్ని వేగంగా కలపాలి. పిండిలో ఉండలు రాకుండా చూసుకోవాలి.

కుక్కర్‌లో పెట్టడానికి అనువుగా ఉన్న మందపాటి గుండ్రని గిన్నెను తీసుకుని అందులో ఒక చెంచా మైదా పిండి వేసి గిన్నె అంతా అంటుకునేలా తిప్పాలి. పిండి మిగిలితే గిన్నె వంచేయాలి. ఈ గిన్నెలో ముందుగా తయారుచేసుకున్న కేక్‌ పిండి మిశ్రమాన్ని వేయాలి. గిన్నెని కుక్కర్‌లో పెట్టి సన్నని మంట మీద 45 నిమిషాలు ఉడికించాలి. కుక్కర్‌కు విజిల్‌ పెట్టకూడదు.

సమయం పూర్తయిన తరవాత కుక్కర్‌లో నుంచి గిన్నెను బయటికి తీసి పది నిమిషాలు చల్లారనివ్వాలి. గిన్నె గోడల నుంచి కేక్‌ విడిపోయేలా చాకును గిన్నె చుట్టూ ఒకసారి తిప్పాలి. ఒక పళ్లెంలోకి గిన్నెను బోర్లించి పైన తడితే కేక్‌ గిన్నె నుంచి వచ్చేస్తుంది.

కేక్‌ పైన చెర్రీలు అలంకరించి చాక్లెట్‌ క్రీమ్‌ లేదా బట్టర్‌ క్రీమ్‌తో హ్యాపీ న్యూ ఇయర్‌ 2025 అని రాసేస్తే వెనీలా కేక్‌ సిద్దం అయిపోతుంది.

Updated Date - Jan 01 , 2025 | 02:53 AM