జీవితమే సందేశం
ABN , Publish Date - Jan 03 , 2025 | 06:45 AM
పూర్వం ఒక ధనికుడి దగ్గర ఒక సామాన్యుడు పనిచేస్తూ ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. బావిలో నీళ్ళు తోడేవాడు. ఆ ఇంట్లో వారు చెప్పిన ఇతర పనులన్నీ చేసేవాడు. యజమాని పెట్టిన తిండి తినేవాడు...
సద్బోధ
పూర్వం ఒక ధనికుడి దగ్గర ఒక సామాన్యుడు పనిచేస్తూ ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. బావిలో నీళ్ళు తోడేవాడు. ఆ ఇంట్లో వారు చెప్పిన ఇతర పనులన్నీ చేసేవాడు. యజమాని పెట్టిన తిండి తినేవాడు. ఇచ్చిన వస్త్రాలు ధరించేవాడు. ఏదో ఒక మూల నిద్రపోతూ ఉండేవాడు. అయితే అతనిలో జ్ఞానపిపాస ఉండేది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. అలా ఒక రోజు అతను ఆలోచిస్తూ, ఆలోచిస్తూ తాదాత్మ్యస్థితిలోకి వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా అతనికి జ్ఞానోదయం కలిగింది. అతని హృదయంలో ప్రేమ, ఆనందం ఉప్పొంగాయి. క్రమంగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతణ్ణి చూసినవారికి ఏదో తేజస్సు కనిపించేది. క్రమంగా జనం ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. అతణ్ణి అనేక విషయాల గురించి అడిగేవారు. అతను ఏదో చెప్పి తప్పించుకొనేవాడు. కానీ అతను గొప్పవాడనే ప్రచారం చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించింది. గురువుగా అతణ్ణి భావించేవారు. అలాగే పిలిచేవారు.
ఈ గురువు గురించి తెలుసుకున్న ఒక వ్యక్తి... తన సందేహాలను చర్చించడం కోసం దూరప్రాంతం నుంచి ఆ గ్రామానికి బయలుదేరాడు. ఊరు బయటే అతను కనిపించడంతో... పలకరించాడు. కొద్దిసేపు మాట్లాడిన తరువాత... అతనికి జ్ఞానోదయం కలిగిందని స్పష్టమయింది. ‘‘మీరు జ్ఞాని అయ్యారు కదా! అంతకుముందు మీరేం చేసేవారు?’’ అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ గురువు నవ్వి ‘‘మా యజమాని కోసం కట్టెలు కొట్టి తెచ్చేవాణ్ణి. బావికి వెళ్ళి నీరు తోడి తెచ్చేవాణ్ణి’’ అని సమాధానం ఇచ్చాడు.
‘‘ఇప్పుడు మీరు జ్ఞాని కదా! ఇప్పుడేం చేస్తున్నారు?’’ అని అడిగాడు ఆ వ్యక్తి.
‘‘ఇప్పుడూ అదే పని చేస్తున్నాను అన్నాడు గురువు.
‘‘మరి తేడా ఏముంది? మీరు జ్ఞాని కావడం వల్ల ప్రయోజనం ఏముంది?’’ అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. అప్పుడు గురువు ‘‘ఎంతో తేడా ఉంది. అంతకుముందు కట్టెలు కొట్టి తెచ్చినా, బావి నుంచి నీరు మోసుకువచ్చినా యజమాని మీద కోపంతో ఎప్పుడూ ఏదో గొణుక్కొంటూ ఉండేవాణ్ణి. ఆ పనులన్నీ తిట్టుకుంటూ చేసేవాణ్ణి. పనిపట్ల విసుగు, యజమానిపట్ల ద్వేషం ఉండేవి. తినే తిండి నచ్చేది కాదు. కంటికి నిద్ర పట్టేది కాదు. మనసుకు ప్రశాంతత అసలే ఉండేదికాదు. కానీ ఇప్పుడు ఆ పనులన్నీ నాకు ఎంతో ఆనందదాయకమైన, ఆహ్లాదమైన కార్యాలు. వాటిలో అందం, ఆనందం ఇంతా అంతా అని చెప్పలేను. ఇప్పుడు నా దృష్టిలో ఆ యజమాని... నా శ్రేయోభిలాషి, నా సంరక్షకుడు. అతని పట్ల నాకు అమితమైన కృతజ్ఞతాభావం ఏర్పడింది. ఎందుకంటే నాకు కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర ప్రసాదిస్తున్నాడు. సరే! ఇప్పటికే ఆలస్యమయింది. నా యజమాని నాకోసం ఎదురుచూస్తూ ఉంటాడు. వెళ్ళొస్తాను’’ అని ప్రశాంతవదనంతో, మెరిసేకళ్ళతో చెబుతూ వెళ్ళిపోయాడు.
ఈ కథను ఒక సందర్భంలో ఓషో (రజనీశ్) ఉదహరించారు. శిష్యులతో సేవలు చేయించుకొనే గురువుల గురించి మాత్రమే విన్న మనకు ఇతరులకు సేవలు చేయడానికి ఉబలాటపడే గురువుల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ‘‘ధ్యానం చేస్తాను, జపం చేస్తాను, ప్రవచనం చెబుతాను’’ అనే గురువులే తెలిసిన మనకు... ‘‘ఆకలైనప్పుడు తింటాను, నిద్రవస్తే నిద్రపోతాను’’ అని చెప్పే గురువుల తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇది నిజం. ఇలాంటివారు ఎందరో ఉన్నారు. ఎంతో సాధారణ వ్యక్తుల్లా జీవిస్తారు. వారు ఎక్కడా ఏ ప్రత్యేకతా కోరుకోరు. ప్రతి పనిని మనస్ఫూర్తిగా, సంతోషంగా చేయాలి, వాటిలో ఆనందం వెతుక్కోవాలి. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించాలి. ఆదరించేవారిపట్ల కృతజ్ఞతతో ఉండాలి. అలాంటి జీవితాన్ని గడపడం ద్వారా... తమ జీవితాన్నే ఒక సందేశంగా బోధించే గురువులకన్నా గొప్పవారు ఇంకెవరుంటారు?
రాచమడుగు శ్రీనివాసులు