ఆ దేవి దర్శనం ఏడాదికి ఒకసారే!
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:33 AM
మంగళాదేవి కన్నగి ఆలయ సందర్శన ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, సాహస యాత్ర కూడా. చుట్టూ క్రూరమృగాల సంచారం ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయంలోకి భక్తులను ఏడాదికి ఒకసారి మాత్రమే...
ఆలయదర్శనం
మంగళాదేవి కన్నగి ఆలయ సందర్శన ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, సాహస యాత్ర కూడా. చుట్టూ క్రూరమృగాల సంచారం ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయంలోకి భక్తులను ఏడాదికి ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో కొలువైన మంగళాదేవి కన్నగికి చారిత్రకంగానూ, సాహిత్యపరంగానూ కూడా ప్రాధాన్యం ఉంది.
పశ్చిమ కనుమల్లోని పెరియార్ పులుల అభయారణ్యం వృక్ష, జీవ వైవిధ్యానికి నెలవు. ఈ అరణ్యంలో... సముద్రమట్టానికి దాదాపు అయిదువేల అడుగుల ఎత్తున ఉన్న మంగళాదేవి కన్నగి ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. దీని నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
ఎవరీ కన్నగి?
ప్రాచీన తమిళ సాహిత్యంలో గొప్ప ఇతిహాసాలుగా పరిగణించే అయిదింటిలో ‘సిలప్పదికారం’ ఒకటి. దీన్ని క్రీస్తుశకం అయిదు, ఆరు శతాబ్దాల మధ్య తమిళ సంగమ సాహిత్య యుగంలో రచించారనేది చరిత్రకారుల అభిప్రాయం. ఒక సామాన్య మహిళ ప్రధాన పాత్రగా రూపొందిన తొలి తమిళ కావ్యం కూడా ఇదే. ‘సిలప్పదికారం’ కథాంశానికి వస్తే... కోవలన్ అనే ధనికుడైన వ్యాపారితో కన్నగి వివాహం జరిగింది. తన సంపదనంతటినీ ఒక నర్తకి కోసం ఖర్చు చేసిన కోవలన్... పశ్చాత్తావంతో తిరిగి భార్యను చేరుకున్నాడు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్న ఆ దంపతులు... మదురై నగరానికి వెళ్ళారు. అక్కడ కన్నగి కాలి అందెను అమ్మడానికి వెళ్ళాడు. మదురై రాణి కాలి అందె దొంగతనానికి గురి కావడంతో... దానికోసం వెతుకుతున్న భటులు కోవలన్‌ను అనుమానించి బంధించారు. ఎలాంటి విచారణ లేకుండానే రాజు ఆదేశం మేరకు కోవలన్‌కు మరణ శిక్ష అమలు చేశారు. ఈ సంగతి తెలిసిన కన్నగి రాజాస్థానానికి వెళ్ళి, చోరీకి గురైన అందె, కోవలన్ అమ్మబోయిన అందె ఒకటి కాదని నిరూపించింది. దాంతో... ఒక నిరపరాధిని శిక్షించాననే వేదనతో రాజు గుండె పగిలి మరణించాడు. కన్నగి కోపాగ్నికి మధురై నగరం దగ్ధమయింది. ఆ తరువాత పధ్నాలుగు రోజుల పాటు కాలినడకన ప్రయాణించిన కన్నగి... ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశమైన వెంగైకనల్ నెడున్‌కుండ్రం దగ్గరకు చేరుకుంది. అక్కడ దివ్య రూపంలో ఉన్న తన భర్తను ఆమె కలుసుకుందనీ, వారిద్దరూ ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానమైపోయారనీ ఆ ఇతిహాసం చెబుతోంది. ఈ అపూర్వ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు... చేర రాజు సెంగుట్టువన్‌కు వివరించగా... ఆయన ఆ ప్రదేశాన్ని సందర్శించాడనీ, హిమాలయాల నుంచి శిలలను తెప్పించి... కన్నగి ఆలయాన్ని నిర్మించాడనీ స్థల పురాణం వెల్లడిస్తోంది. సెంగుట్టవన్ క్రీస్తుశకం రెండో శతాబ్దానికి చెందినవాడు. కాబట్టి ఈ ఆలయం 1800 ఏళ్ళ నాటిదని స్థానికులు పేర్కొంటున్నారు.
ఎన్నో ఆంక్షల మధ్య...
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కన్నగిని దేవతగా ఆరాధించే ఆలయాలు అనేక చోట్ల కనిపిస్తాయి. మంగళాదేవి కన్నగి ఆలయం అడవుల్లో ఉండడం వల్ల చేరుకోవడం కష్టం. దానికి తోడు ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించడంతో అనేక ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమినాడు జరిగే ఉత్సవాలకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. అటవీ, పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఈ యాత్ర సాగుతుంది. ఈ ఉత్సవాలను కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. పర్యావరణ పరిరక్షణ కోసం, జంతువుల భద్రత కోసం ఈ ప్రాంతం మీద నిరంతరం నిఘా ఉంటుంది. మామూలు రోజుల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే... అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలయం కావడంతో... దీన్ని యథాతథ స్థితిలో కేరళ పురావాస్తు శాఖ భద్రపరిచింది. ఈ కారణంగా... ఆలయం శిథిలావస్థలో దర్శనమిస్తుంది. దీర్ఘచతురస్రాకారంలోని గ్రానైట్ రాళ్ళను పేర్చినట్టుండే ఈ కట్టడంలో పాండ్య నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఇక్కడ మంగళాదేవితో పాటు శివుడు, వినాయకుడు తదితర ఉపాలయాలు ఉన్నాయి. చైత్ర పౌర్ణమినాడు అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆమెను దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఎలా వెళ్ళాలి?
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కుమిలీ నుంచి సుమారు పది కిలోమీటర్లు, తమిళనాడులోని తేని జిల్లా పళియంకుడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో మంగళాదేవి కన్నగి ఆలయం ఉంది. ఇరువైపులా నుంచి ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే కుమిలీ నుంచి జీపుల్లో ప్రయాణించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..