Share News

New Year 2025: ఆరంభం హుషారుగా..

ABN , Publish Date - Jan 01 , 2025 | 03:05 AM

ప్రస్తుతం మొబైల్స్‌ మన జీవితాలను శాసిస్తున్నాయి. ఒక సారి మొబైల్‌ చూడటం మొదలుపెడితే ఆగటమే ఉండదు. సోషల్‌ మీడియా మన ఆలోచనలను కమ్మేస్తుంది.

New Year 2025: ఆరంభం హుషారుగా..

కొత్త ఆశలతో.. కొత్త ఊహలతో మళ్లీ కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. 2025 హుషారుగా సాగాలంటే ఈ కింది పనులన్నీ మీరు చేయాల్సిందే!

ఎక్కువ చదవండి..

ప్రస్తుతం మొబైల్స్‌ మన జీవితాలను శాసిస్తున్నాయి. ఒక సారి మొబైల్‌ చూడటం మొదలుపెడితే ఆగటమే ఉండదు. సోషల్‌ మీడియా మన ఆలోచనలను కమ్మేస్తుంది. అసలు ఆలోచించికుండా చేసేస్తుంది. అందుకే మొబైల్స్‌ చూసే సమయాన్ని తగ్గించి.. ఆ సమయంలో నచ్చిన పుస్తకాలను చదవమని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. పుస్తకాలు చదవటం వల్ల మన ఆలోచనలలో స్పష్టత వస్తుంది. ఒక వేళ పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే - ఆడియో పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని శ్రద్ధగా విన్నా బావుంటుంది.

చిన్న పొదుపు

వారానికి వంద రూపాయలు దాచగలిగితే- ఏడాదికి 5200 రూపాయలు అవుతుంది. దానిని మంచి రిటర్న్స్‌ ఇచ్చే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే? అతి తక్కువ సమయంలో రెండు రెట్లు అవుతుంది. ఇది ఒక చిన్న ఉదాహరణే కావచ్చు.. చిన్నగా పొదుపు చేయటం మొదలుపెడితే - దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి. చాలా మంది పొదుపు చేయటమంటే ఒకే సారి వేలో, లక్షలో జమపరుచుకోవటం అనుకుంటారు. అలా కాకుండా చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేస్తే చాలా మంది ఫలితాలు ఉంటాయి. మనం చేసే పొదుపును ట్రాక్స్‌ చేసే అప్లికేషన్లు కూడా అనేకం వచ్చేసాయి. ఆర్థిక వ్యవహారాలపై కొద్దిగా అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం ఉంటుంది.

వ్యసనాలు మానండి..

ప్రపంచంలో అత్యంత సులభంగా చెప్పగలిగినది.. ఆచరణలో అత్యంత కఠినమైనది ఇదే! ఒకసారి అలవాటు అయిన తర్వాత సిగరెట్లు, ఆల్కాహాల్‌ వంటివి మానటం కష్టం. కానీ ఆ అలవాటును నెమ్మదిగా నియంత్రించుకోవచ్చు. ఉదాహరణకు ఒక నెల రోజులు పూర్తిగా సిగరెట్లు మానేస్తానని పెట్టుకుంటే- పెద్దగా ఇబ్బంది అనిపించదు. అదే విధంగా ప్రతి వారం తాగే మద్యం కోటాను సగానికి తగ్గించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల అనుకూల ఫలితాలు వస్తున్న కొలది.. వ్యవసనాలు పూర్తిగా మానేందుకు అవకాశం చిక్కుతుంది.


కొత్త భాష నేర్చుకోండి..

కొత్త భాషలను నేర్చుకోవటం వల్ల మన ఆలోచనా పరిధి పెరుగుతుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారితో సంభాషించగలుగుతాం.. వారి సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోగలుగుతాం.. అంతకు మంచి.. ఆ భాషలో ఉన్న సాహిత్యాన్ని చదవగలుగుతాం. ఇదంతా మన మేధో విస్తృతిని పెంచుతుంది. అంతే కాకుండా ఈ ఆధునిక యుగంలో భాషలు నేర్చుకోవటం చాలా సులభం కూడా. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా కొత్త భాషలు నేర్చుకోవటం సులభమనే చెప్పాలి.

విజన్‌ బోర్డు

2025లో ఏం చేయాలనుకుంటున్నామో ఆలోచించి.. వాటన్నింటిని ఒక చోట పెడితే దానిని విజన్‌ బోర్డు అంటారు. దీనిలో మనం చేయాలనుకుంటున్న ప్రయాణాలు కావచ్చు.. చేరుకోవాలనుకుంటున్న లక్ష్యాలు కావచ్చు.. ఊహలు కావచ్చు.. ఇలా మనకు సంబంధించిన వాటన్నింటినీ కలిపినదే ఈ విజన్‌ బోర్డు.

ధ్యానం..

రోజుకు ఒక అరగంట ధ్యానం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. యోగా, ధ్యానం ఒకటే అనుకొనేవారు ఇంకా ఉన్నారు. వారందరూ తెలుసుకోవాల్సినది ఒకటే. యోగా శరీరానికి సంబంధించినది. ధ్యానం మన మనసుకు సంబంధించినది. ఈ రెండు కలిపి చేయటం వల్ల ఇటు శరీరం అటు మనసు చురుకుగా పనిచేస్తాయి. ఆలోచనా విధానం కూడా మారుతుంది.

Updated Date - Jan 01 , 2025 | 03:05 AM