ఉపవాస దీక్ష తరవాత
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:54 AM
ముస్లింలు రంజాన్ మాసమంతా కఠిన ఉపవాస దీక్ష కొనసాగించారు. నేటి నుంచి వీరు సాధారణ విధానాన్ని అనుసరించాలి. నెల రోజులు ఉపవాసం చేయడం వల్ల జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. కాబట్టి శరీరం సాధారణ ఆహారపు...

ముస్లింలు రంజాన్ మాసమంతా కఠిన ఉపవాస దీక్ష కొనసాగించారు. నేటి నుంచి వీరు సాధారణ విధానాన్ని అనుసరించాలి. నెల రోజులు ఉపవాసం చేయడం వల్ల జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. కాబట్టి శరీరం సాధారణ ఆహారపు అలవాట్లకు సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియలు యథావిధిగా కొనసాగేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలను ఇలా సూచిస్తున్నారు.
తాజా కూరగాయలు, పళ్లు, తృణధాన్యాలతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవాలి. ఇందులో మితంగా ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. మసాలాలతో కూడిన నూనె పదార్థాలను తినకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తినాలి.
శరీరం నిర్జలీకరణ స్థితిలోకి వెళ్లకుండా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. పలుచని మజ్జిగ, నీళ్లు కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో క్రమంగా నీటి శాతం పెరగడంతోపాటు తక్షణ శక్తి కూడా లభిస్తుంది. దాహంగా ఉందంటూ శీతల పానీయాలు తాగకూడదు. దీనివల్ల శరీరంలో అదనంగా చక్కెర చేరి దాహార్తి పెరుగుతుంది.
ఈ నెల రోజులూ తక్కువగా తింటూ ఎక్కువ సమయం మేలుకొని ఉండే విధానాన్ని శరీరం అలవాటు చేసుకుని ఉంటుంది కాబట్టి సాధారణ విధానాన్ని ఒకేసారిగా కాకుండా మెల్లగా అనుసరించే ప్రయత్నం చేయాలి. ఆలస్యంగా పడుకోవడం, ఎక్కువసేపు నిద్రపోవడం కాకుండా సాధారణ దినచర్యను పాటించాలి.
ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్దికొద్దిగా పలుమార్లు తింటే జీర్ణ సమస్యలను నివారించవచ్చు. భోజనం తరవాత కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ వేగం పుంజుకుంటుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరానికి చురుకుదనం లభిస్తుంది.
ఆకలి అనిపించినప్పుడు అధిక క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలు కాకుండా తేలికగా జీర్ణమయ్యే పోషకారాన్ని తినాలి. మొలకలు, క్యారెట్, కీరా, గింజలు తినడం మంచిది. దీనివల్ల శరీరం అలసిపోకుండా ఉంటుంది.
శరీర బరువులో వస్తున్న మార్పులు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి తదితరాలను పరీక్షించుకుంటూ ఉండాలి. వాటికి అనుగుణంగా ఆహారపదార్థాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..