Health tips: వీటిని అలాగే తింటే మేలు..!
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:15 AM
కొన్ని రకాల కూరగాయలను ఉడకబెట్టుకొని కాకుండా పచ్చివిగా తింటేనే ఆరోగ్యకరం అంటున్నారు పోషకాహార నిపుణులు.
కొన్ని రకాల కూరగాయలను ఉడకబెట్టుకొని కాకుండా పచ్చివిగా తింటేనే ఆరోగ్యకరం అంటున్నారు పోషకాహార నిపుణులు. అలా తినడంవల్ల వాటిల్లోని పోషక విలువలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయని చెబుతున్నారు. అలాంటి కూరగాయలే ఇవి...
బీట్‌రూట్: దీనిలో పీచుపదార్థం, ఫోలేట్లు, ఐరన్, సి విటమిన్, పొటాషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. బీట్‌రూట్ ముక్కలను ఎక్కువ వేడిమీద ఉడికిస్తే ఈ పోషకాల్లో 25 శాతం వరకూ నష్టపోతాం. అందుకే బీట్‌రూట్ ముక్కలను సలాడ్స్‌లో కలుపుకుని తినడం, జ్యూస్ చేసుకుని తాగడం మంచిది. బీట్‌రూట్‌ని సన్నని చక్రాల్లా కోసి దానిమీద నిమ్మరసం, మిరియాలపొడి చల్లుకుని తింటే రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. రక్తహీనత సమస్యలు రావు.
కేరెట్: దీనిలో బీటా కెరోటిన్, పీచు పదార్థం, కె విటమిన్, ఎ విటమిన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పిండిపదార్థాలు ఉంటాయి. కేరెట్‌ను ఉడికించినపుడు వీటిలో చాలావరకూ ఆవిరైపోతాయి. కేరెట్ రుచిగా ఉంటుంది కాబట్టి దానిని అలాగే తినడం ఉత్తమం. లేదంటే కేరెట్ తురుముని సలాడ్స్‌లో, మొలకల్లో కలుపుకుని తినవచ్చు. జ్యూస్ చేసుకుని తాగవచ్చు. కేరెట్‌లోని పోషకాలు కంటిచూపుని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్‌ను నివారిస్తాయి.
నిమ్మకాయ: దీనిలో సి విటమిన్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి పోషకాలు ఉంటాయి. నిమ్మరసాన్ని వేడి పదార్థాలకు కలిపితే ఇవన్నీ నశించిపోతాయి. అందుకే గోరువెచ్చగా ఉన్నపుడు మాత్రమే వంటకాలకు నిమ్మరసాన్ని కలపాలి.
పచ్చి కొబ్బరి: ఇది జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో సిలీనియం, మాంగనీస్, కాపర్, జింక్ లాంటి అరుదైన పోషకాలతోపాటు పీచుపదార్థాలు, ఐరన్, ప్రోటీన్లు, పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి. పచ్చి కొబ్బరిని పచ్చడి రూపంలో తినడం వల్ల ఈ పోషకాలను పూర్తిగా పొందవచ్చు. వంకాయ, దొండకాయ, బీరకాయ లాంటి కూరలను వండిన తరవాత వాటికి పచ్చి కొబ్బరి తురుం కలిపి తినవచ్చు.
టమాటా: దీనిని వంటకాల్లో చాలా రకాలుగా ఉపయోగిస్తుంటాం. ప్యూరీ, గ్రేవీ, రసం ఇలా సందర్భానుసారం టమాటాలను వాడుతుంటాం. కూర, పచ్చడి, చారు అంటూ ఎన్నో చేస్తుంటాం కూడా. అప్పుడప్పుడు టమాటాలను పచ్చిగా కూడా తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. దీనిలో సి, కె, బి విటమిన్లతోపాటు పీచు పదార్థం, పిండిపదార్థాలు, ప్రోటీన్లు, పొటాషియం, లైకోపీన్, బీటా కెరోటిన్లు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి, క్యాన్సర్ నివారణకు, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.