Share News

Shivashree Skandaprasad: భరతనాట్యమే గెలిపించింది

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:22 AM

సంగీతం, నృత్యం, క్రీడలు ఈ మూడూ భిన్నమైన అభిరుచులు... అంతకు మించిన భిన్నమైన రంగాలు..

Shivashree Skandaprasad: భరతనాట్యమే గెలిపించింది

సంగీతం, నృత్యం, క్రీడలు ఈ మూడూ భిన్నమైన అభిరుచులు... అంతకు మించిన భిన్నమైన రంగాలు. అయినప్పటికీ మూడింట్లో ప్రత్యేకత చాటుకుంది చెన్నైకి చెందిన శివశ్రీ స్కందప్రసాద్‌. తన కన్నడ భక్తి గీతంతో ప్రధాని మోదీ ప్రశంసలను అందుకున్న శివశ్రీ, తాజాగా ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ నాల్గవ ఎడిషన్‌ పూర్తి చేసి, తనలోని క్రీడా స్ఫూర్తిని సైతం చాటుకోవడం విశేషం. త్వరలో బీజేపీ ఎంపీ తేజస్విసూర్యను వివాహం చేసుకోబోతున్న ఈ బహుముఖ కళాకారిణి గురించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు...

యోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకల్లో ‘పూజిలలెండె హూగళ తండె’ అనే కన్నడ భక్తి గీతాన్ని ఆలపించి, ప్రధాని మోదీ ప్రశంసలు అందుకోడంతో తొలిసారి వెలుగులోకొచ్చింది 28 ఏళ్ల శివశ్రీ. ప్రధాని ప్రశంసల గురించి ప్రస్తావిస్తూ... ‘‘నాలాంటి యువ కళాకారులను అంతటి గొప్ప వ్యక్తి ప్రస్తావించడం ఎంతో ప్రోత్సాహకరం. భారతీయ సంస్కృతి విలువను అర్థం చేసుకుని, ప్రతి పౌరుడూ బాధ్యతగా ఈ వారసత్వాన్నీ ముందుకు తీసుకువెళ్లడానికి ఈ ప్రశంస ఎంతో తోడ్పడుతుంది’’ అంటూ శివశ్రీ ఒక సందర్భంలో మీడియాతో చెప్పుకొచ్చింది. కర్నాటక సంగీతంలో దిట్ట అయిన శివశ్రీ భరతనాట్య కళాకారిణి కూడా! 1996, ఆగష్టు ఒకటిన చెన్నైలో పుట్టిన ఈ కళాకారిణి, మృందగ విద్వాంసుడైన శ్రీ జె. స్కందప్రసాద్‌ సంతానం. ఆయన ద్వారానే, శివశ్రీ సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది. శాస్త్ర యూనివర్శిటీ నుంచి బయోఇంజనీరింగ్‌ బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన ఈ కళాకారిణి, మద్రాసు యూనివర్శిటీ నుంచి భరతనాట్యంలో డిగ్రీ పొందింది. శివశ్రీ తొలిసారిగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిత్రం, పొన్నియన్‌ సెల్వన్‌లో ఎ.ఆర్‌.రహమాన్‌ సంగీత దర్శకత్వంలో, హెల్హె నీను అనే పాట కూడా పాడింది. ఈ గాయని 64 భారతీయ కళలను ప్రోత్సహించే ‘ఆహుతి’ అనే వేదికను కూడా స్థాపించింది.

ప్రదర్శనలు- అవార్డులు...

శివశ్రీ భరతనాట్య ప్రయాణం ఆమె మూడవ ఏటలోనే మొదలైంది. కలైమామణి శ్రీమతి కృష్ణకుమారి నరేంద్రన్‌, ఆచార్య చూడామణి గురు శ్రీమతి రోజా కన్నన్‌ల ఆధ్వర్యంలో భరతనాట్యం నేర్చుకున్న శివశ్రీ, మ్యూజిక్‌ అకాడమీ, నారద గాన సభ, శ్రీకృష్ణ గాన సభలతో పాటు చెన్నైలో ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. శివశ్రీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ ద్వారా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 2018లో డెన్‌మార్క్‌లో, 2019లో దక్షిణ కొరియాలో నాట్య ప్రదర్శనలివ్వడం విశేషం. తన నాట్య, సంగీత ప్రదర్శనల ద్వారా సమ్మాన్‌ అవార్డు, భరత కళా చూడామణి అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. శివశ్రీ తన యూట్యూబ్‌ ఛానల్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు తాజా వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. ఈమె యూట్యూబ్‌ ఛానల్‌కు 2 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.

.


నా నేస్తం సైకిల్‌...

తన కళాత్మక నైపుణ్యాలతో రాణించడంతోనే సరిపెట్టుకోకుండా, సైక్లింగ్‌, ట్రెక్కింగ్‌ మొదలైన క్రీడల్లో కూడా మెరుగైన ప్రతిభను కనబరుస్తోంది శివశ్రీ. తాజాగా ఐరన్‌మ్యాన్‌ 70.3 నాల్గవ ఎడిషన్‌లో సైక్లింగ్‌ రేసును విజయవంతంగా పూర్తి చేసిందామె. ఆ పోటీల గురించి ఆమె ప్రస్తావిస్తూ... ‘‘నా బడి చదువంతా సైకిల్‌తోనే సాగింది. డాన్స్‌ తరగతులకూ, సంగీత తరగతులకూ.. ఇలా ఎక్కడకు వెళ్లాలన్నా నేను సైకిల్‌ మీదే వెళ్లేదాన్ని. అయితే ఐరన్‌మ్యాన్‌ రేసులో భాగంగా ఏకబిగిన 90 కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కడమన్నది పూర్తిగా భిన్నమైన అనుభవం. పైగా గోవాలోని వేడి, తేమతో కూడిన వాతావరణంలో సైకిల్‌ తొక్కడం ఆషామాషీ వ్యవహారం కాదు. నేను రిలే పోటీలో సైక్లింగ్‌ విభాగాన్ని ఎంచుకున్నాను. నా కోచ్‌ హేమ, పరుగు పందేన్ని పూర్తి చేస్తే, హర్షిణి ఈత పోటీని పూర్తి చేసింది. ఈ పోటీకి సిద్ధపడాలని నిశ్చయించుకున్నప్పుడు, 90 కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కగలుగుతానా? అని భయపడ్డాను. కానీ నా సహ క్రీడాకారుణులిద్దరూ నన్నెంతో ప్రోత్సహించి పోటీలకు సిద్ధం చేశారు. పోటీకి నెల రోజుల ముందు నేను ఒక ప్రదర్శన కోసం అమెరికా వెళ్లాను. అక్కడ ఉన్న నెల రోజులూ సైకిల్‌ తొక్కడం, వ్యాయామం చేయడం సాధన చేశాను. తిరిగి భారతదేశానికి చేరుకున్న తర్వాత, ఆహారం మీద దృష్టి పెట్టాను. మాంసకృత్తులు, పీచు మోతాదు పెంచాను. నీళ్లు కూడా ఎక్కువ తాగడం మొదలుపెట్టాను. సైకిల్‌ తొక్కడంవెనకున్న సైన్స్‌తో పాటు శరీర పనితీరు గురించి లోతుగా తెలుసుకున్నాను. అలాగే సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడే శక్తి వ్యవస్థలు, కండరాల రికవరీ, పోషకాల ప్రాముఖ్యతల గురించి నేర్చుకున్నాను. ఇవన్నీ నా శిక్షణకు ఎంతో బాగా తోడ్పడ్డాయి’’ అంటూ చెప్పుకొచ్చింది.

fnhb.jpg

నాట్యమే సహాయపడింది

‘‘ఐరన్‌మ్యాన్‌ పోటీకి రెండు వారాల ముందు కొత్త సైకిల్‌ కొనుగోలు చేసి, పోటీకి ఒక్క రోజు ముందు 60 కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కాను. అలాగే సరికొత్త సైకిల్‌తో పోటీలో పాల్గొన్నాను. సాధారణంగా ఎవరూ ఇలాంటి రిస్క్‌ తీసుకోరు. పోటీలోకి అడుగు పెట్టగానే ఓ పక్క సంతోషం, మరో పక్క భయం నన్ను ఆవరించాయి. అయినా పోటీలో గెలిచి తీరాలనే పట్టుదల అంతకంతకూ పెరిగిపోయింది. పోటీలో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా నిరంతరం ఎలకొ్ట్రలైట్స్‌తో కూడిన నీళ్లు తాగడంతో పాటు శక్తి కోసం, కార్బ్స్‌ కలిగి ఉండే బార్స్‌, జెల్స్‌ తీసుకున్నాను. నిజం చెప్పాలంటే ఈ పోటీలో సమర్థంగా సైకిల్‌ తొక్కడానికి సైక్లింగ్‌ సాధన కంటే, నా 23 ఏళ్ల భరతనాట్య సాధనే ఎక్కువగా తోడ్పడిందని చెప్పాలి. భరతనాట్యంలోని ‘అరమండి’వల్ల పిరుదులు, పిక్కలు దృఢంగా మారడంవల్లే నేను అంత దూరం సైకిల్‌ తొక్కగలిగాననే భావిస్తున్నాను’’ అంటూ శివశ్రీ తన అనుభవాలను పంచుకుంది.


ఏమిటీ ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’?

మానసిక, శారీరక దారుఢ్యాలను, శక్తిసామర్థ్యాలను పరీక్షించే పోటీగా ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’కి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుంది. ఇందులో 1.2 మైళ్లు స్విమ్మింగ్‌, 56 మైళ్లు సైక్లింగ్‌, 13.1 మైళ్లు రన్నింగ్‌ ఉంటాయి. మొత్తం కలిపి 70.3 మైళ్ల రేస్‌ ఇది. ఎంతో అనుభవమున్న క్రీడాకారులు, ఒలింపిక్‌ పతక విజేతలు ఈ పోటీలో పాల్గొని సత్తా చాటుకుంటూ ఉంటారు. ఈ పోటీల్లో ఒక్కరే పాల్గొనవచ్చు. లేదా మూడు విభాగాలకు ముగ్గురు వేర్వేరు క్రీడాకారులు కలిసి ఒక బృందంగా కూడా పాల్గొనవచ్చు. శివశ్రీ పెళ్లాడబోతున్న బీజేపీ నేత, తేజస్విసూర్య ఈ పోటీలో పాల్గొన్న మొట్టమొదటి ప్రజా ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. 50 దేశాల క్రీడాకారులు పాల్గొనే ‘ఐరన్‌ మ్యాన్‌ 70.3’ పోటీని సూర్య 8 గంటల 27 నిమిషాల్లో పూర్తి చేయడం విశేషం.

తేజస్వితో పెళ్లి...

బీజేపీ నేత, బెంగుళూరు సౌత్‌ ఎంపీ తేజస్విసూర్యతో శివశ్రీ స్కందప్రసాద్‌కు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. వీరి పెళ్లి మార్చిలో జరగనుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి

Updated Date - Jan 06 , 2025 | 04:22 AM