Share News

సప్తసాగరాలే లక్ష్యంగా..!

ABN , Publish Date - Jan 02 , 2025 | 07:00 AM

‘‘ఈత కొలనులో నా ప్రయాణం చాలా విచిత్రంగా ప్రారంభమైంది. ఒకప్పుడు నాకు నీళ్లంటే చచ్చేంత భయం. అలాంటిది నేడు మహాసముద్రాల్లో ఈదేస్తున్నానంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, వ్యాపారంలో నష్టంతో మానసిక ఒత్తిడుల నేపథ్యంలో...

సప్తసాగరాలే లక్ష్యంగా..!

సంకల్పం

నాలుగు పదులు దాటిన వయసులో ఈత మొదలుపెట్టారు. కానీ నేడు గజ ఈతగాళ్లను మించిపోయారు. అలలకు ఎదురెళ్లి రికార్డులెన్నో బద్దలు కొట్టారు. యాభై ఒక్క ఏళ్ల వయసులో తాజాగా విశాఖ నుంచి కాకినాడకు బంగాళాఖాతంలో ఈత ప్రారంభించారు... గోలి శ్యామల. విరామ సమయంలో ఈ యాత్ర గురించి... ఒకప్పటి సాధారణ గృహిణి... ఇప్పుడు సాహసనారిగా మారిన ప్రస్థానం గురించి ఆమె ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘ఈత కొలనులో నా ప్రయాణం చాలా విచిత్రంగా ప్రారంభమైంది. ఒకప్పుడు నాకు నీళ్లంటే చచ్చేంత భయం. అలాంటిది నేడు మహాసముద్రాల్లో ఈదేస్తున్నానంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, వ్యాపారంలో నష్టంతో మానసిక ఒత్తిడుల నేపథ్యంలో తీవ్ర అనారోగ్యం పాలయ్యాను. కోమాలోకి వెళ్లాను. ఆసుపత్రి మంచం మీద గట్టి నిర్ణయం తీసుకున్నాను... తిరిగి హాస్పిటల్‌ గడప తొక్కకూడదని. అదే సమయంలో వేసవి శిబిరం జరుగుతుంటే వెళ్లాను. ఆరోగ్యకరమైన జీవనయానం కోసం ఈత ప్రారంభించాను. అలా అనూహ్యంగా మొదలైన ఈత నేడు నా జీవితంలో భాగమైపోయింది. ఎన్నో మైలు రాళ్లను దాటి... నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. మాది తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోట అయినా రెండున్నర దశాబ్దాల కిందటే హైదరాబాద్‌లో స్థిరపడ్డాం.


7-Navya.jpg

అలా మొదలైంది...

మాకు ఒక యానిమేషన్‌ స్టూడియో ఉండేది. ఇంటి పనులతో పాటు స్టూడియో కూడా చూసుకొనేదాన్ని. ప్రొడ్యూసర్‌గా, క్రియేటివ్‌ డైరెక్టర్‌గా, రైటర్‌గా సొంతంగా చాలా యానిమేషన్‌ చిత్రాలు చేశాను. అందులో నష్టాలు రావడంతో స్టూడియో మూసేయాల్సివచ్చింది. అది నన్ను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెట్టింది. దాంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వీటన్నిటి నుంచి బయటపడటానికి నేను ఎంచుకున్న మార్గమే స్విమ్మింగ్‌. ఈత కొలనులోకి దిగాక స్విమ్మింగ్‌పై ఇష్టం పెరిగింది. దీంతో పోటీల వైపు దృష్టి పెట్టి, సాధన మొదలుపెట్టాను. మూడు నెలలకే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. కాంస్య పతకం నెగ్గాను. అది నాలో ఆత్మవిశ్వాసం నింపింది. ఆ తరువాత నుంచి వెళ్లిన ప్రతి పోటీలో పతకాలు గెలుస్తూనే ఉన్నాను.


నిరుత్సాహపరిచినా...

ఈతలో మంచి నైపుణ్యం సాధించాక సాహస క్రీడలపై దృష్టి పెట్టాను. అందులో భాగంగానే ‘ఓపెన్‌ వాటర్‌’ ఈవెంట్‌లో పాల్గొన్నాను. ఇది జాతీయ స్థాయి పోటీ. 1.5 కిలోమీటర్లు. 2019లో విజయవాడ కృష్ణా నదిలో జరిగిన ఆ ఈవెంట్‌లో స్వర్ణ పతకం నెగ్గాను. ఆ తరువాత రెండేళ్లు కూడా తొలి స్థానం నాదే. ఓ ఆంగ్ల పత్రికలో ఇంగ్లిష్‌ చానల్‌ ఈదిన వ్యక్తి కథనం నాలో స్ఫూర్తి నింపింది. సప్త సముద్రాల్లో ఈత కొట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా లక్ష్యం గురించి చెబితే సహచరులు తీవ్రంగా నిరుత్సాహపరిచారు. నా వయసుకు అంతటి సాహసం తగదని కొందరు సలహాలు ఇచ్చారు. అవేవీ పట్టించుకోలేదు. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను. అదే ఉత్సాహంతో అత్యంత క్లిష్టమైన బంగాళాఖాతంలోని పాక్‌ జలసంధిని ఈదాను. శ్రీలంకలోని తలైమన్నారు నుంచి తమిళనాడులోని ధనుష్కోటి వరకు 30 కిలోమీటర్ల దూరం ఇది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు మహిళను నేనే. అది నాలో ఎనలేని స్ఫూర్తి నింపింది. అదే ఏడాది అమెరికాలోని 36 కిలోమీటర్ల కాటలినా చానల్‌ను ఈదాను.


ఆ స్ఫూర్తితో...

లక్షద్వీ్‌పలో పర్యాటక అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రచారం నాకు ప్రేరణనిచ్చాయి. దానికి నావంతు ప్రయత్నంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్ష ద్వీప్‌లో కిల్తాన్‌ ద్వీపం నుంచి అరేబియా మహాసముద్రంలో 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కద్మత్‌ ద్వీపానికి ఈత కొట్టాను. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిని నేనే. లక్షద్వీప్‌ పర్యాటక శాఖ, ఇతరుల మద్దతుతో దీన్ని పూర్తి చేశాను. అంతకుముందు కోల్‌కతా భగీరథ నదిలో 81 కిలోమీటర్లు, బిహార్‌లోని గంగా నదిలో 13 కిలోమీటర్లు ఈదాను.

77-Navya.jpg


విశాఖ నుంచి కాకినాడకు...

ప్రస్తుతం విశాఖ నుంచి కాకినాడకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడానికి సిద్ధమయ్యాను. దానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాను. గత నెల 28న విశాఖ రామకృష్ణా బీచ్‌ వద్ద ఈ సాహస యాత్ర ప్రారంభమైంది. బుధవారానికి వంద కిలోమీటర్లు పూర్తయింది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 4న పూర్తికావచ్చని అనుకొంటున్నాను. సముద్రంలో ఈతకు ప్రతికూల పరిస్థితులు ఎదురవడంవల్ల కాస్త ఆలస్యమైంది. ప్రతిరోజూ సూర్యోదయానికి ఈత ప్రారంభిస్తాను. సూర్యాస్తమయానికి ఆపేసి, రాత్రి విశ్రాంతి తీసుకొంటాను. నాకు సహకారంగా నేవీ బోటు వెంట వస్తోంది. గతంలో ఈ దారిలో ఈదినవారు ఎవరూ లేరు. నదులు ఈదేవారు కనిపిస్తుంటారు కానీ... మహాసముద్రాల్లో ఈదేవారు చాలా అరుదు. అదీ మహిళలు ఎవరూ లేరనే చెప్పాలి.’’

ఆర్వీ రమణమూర్తి, సామర్లకోట


ఘనతలు ఎన్నో...

నా ఈ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. రికార్డులు అధిగమించాను. ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, అబ్దుల్‌ కలాం వరల్డ్‌ రికార్డ్సు, ఇంటర్‌నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’లో నా పేరు నమోదయింది. తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘అవుట్‌స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు, ‘వండర్‌ ఉమన్‌’ అవార్డులు అందుకున్నాను. గత ఏడాది భారత్‌ ఒలింపిక్‌ సంఘం నుంచి కూడా పలు పురస్కారాలు నన్ను వరించాయి. ఇవన్నీ నాలో స్ఫూర్తి రగిలిస్తాయి.

Updated Date - Jan 02 , 2025 | 07:00 AM