Eyebrow Tips: కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే...
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:50 AM
కనుబొమ్మలు ఒత్తుగా ఉంటేనే ముఖం కళగా కనిపిస్తుంది. కొంతమందికి కనుబొమ్మల్లోని వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. చాలా కాలం వరకూ అవి పెరగకపోవడంవల్ల కనుబొమ్మలు పలుచగా మారతాయి. అలాకాకుండా కనుబొమ్మలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!
కనుబొమ్మలు ఒత్తుగా ఉంటేనే ముఖం కళగా కనిపిస్తుంది. కొంతమందికి కనుబొమ్మల్లోని వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. చాలా కాలం వరకూ అవి పెరగకపోవడంవల్ల కనుబొమ్మలు పలుచగా మారతాయి. అలాకాకుండా కనుబొమ్మలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!
ఒక గిన్నెలో రెండు చెంచాల ఆముదం వేసి వేడిచేయాలి. దీనిని చూపుడు వేలితో కొద్దిగా తీసుకుని కనుబొమ్మల మీద రాసి ఒకే దిశలో అయిదు నిమిషాలపాటు మర్దన చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తూ ఉంటే కనుబొమ్మలు రాలడం తగ్గుతుంది.
రాత్రిపూట రెండు చెంచాల మెంతులను మంచినీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలకు పట్టించాలి. పావుగంట తరవాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే కనుబొమ్మలు బాగా పెరుగుతాయి.
కలబంద ఆకు లోపలి గుజ్జును తీసుకుని కనుబొమ్మలపై మెల్లగా రుద్దాలి. పది నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె, మందారం నూనెల్లో ఒకదాన్ని రాస్తూ ఉంటే ఎ, ఇ విటమిన్లు అంది కనుబొమ్మలు చక్కగా పెరుగుతాయి. ఇ విటమిన్ నూనె కూడా రాయవచ్చు.
పాలలో దూదిని ముంచి దానితో కనుబొమ్మల మీద అద్దాలి. గంటసేపు ఆరిన తరవాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. పాలు కండిషనర్‌లా పనిచేసి కనుబొమ్మలకు పోషణ అందిస్తాయి. కొబ్బరి పాలు కూడా ఉపయోగించుకోవచ్చు.
కనుబొమ్మలు అందమైన ఆకృతిలో కనిపించాలని చాలామంది థ్రెడింగ్ చేయించుకుంటూ ఉంటారు. మరీ పలుచగా, సన్నగా కాకుండా ఒత్తుగా కనిపించే విధంగా షేపింగ్ చేయించుకోవాలి. కనుబొమ్మల చుట్టూ అదనంగా ఉన్న వెంట్రుకలను మాత్రమే తీయించాలి. అప్పుడే కనుబొమ్మలు వేగంగా పెరుగుతాయి.