Share News

Chapati: చపాతీలు మెత్తగా రావాలంటే...

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:17 AM

మనలో చాలామంది చపాతీలను ఇష్టంగా తింటూ ఉంటారు. రెండు వేళ్లతో తుంచగలిగేంత సుతిమెత్తని చపాతీలు ఆకలిని మరింత పెంచుతాయి.

Chapati: చపాతీలు మెత్తగా రావాలంటే...

మనలో చాలామంది చపాతీలను ఇష్టంగా తింటూ ఉంటారు. రెండు వేళ్లతో తుంచగలిగేంత సుతిమెత్తని చపాతీలు ఆకలిని మరింత పెంచుతాయి. కానీ ఒక్కోసారి అవి గట్టిగా తయారై అసలు తినాలనిపించదు. చపాతీలు మెత్తగా రావాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!

ముందుగా గోధుమ పిండిలో తగినంత ఉప్పు వేసి కలపాలి. తరవాత కొంచెం నూనె లేదా నెయ్యి వేసి పిండి మొత్తానికి పట్టించాలి. కొన్ని పాలు, కొన్ని నీళ్లు చిలకరిస్తూ పిండిని మెత్తని ముద్దలా చేయాలి. పిండి ముద్ద పగుళ్లు లేకుండా నున్నగా రావాలి. దీనిమీద మూతపెట్టి కనీసం పావుగంట నాననివ్వాలి. చపాతీలు పామేముందు కూడా పిండిని వేళ్లతో నొక్కుతూ మరో పది నిమిషాలు గట్టిగా కలపాలి. అప్పుడే చపాతీలు మెత్తగా వస్తాయి.

పిండిని మరీ చల్లని నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీళ్లతో కలిపితే చపాతీలు మృదువుగా వస్తాయి.

చపాతీని పామేటపుడు పొడి పిండిని ఎక్కువగా చల్లవద్దు. ఒకవేళ చపాతీ మీద పిండి ఎక్కువైందని అనిపిస్తే తడి బ్టటతో తుడిచేయాలి. చపాతీలను మరీ సన్నగా పామకూడదు.

చపాతీలను పెద్ద మంట మీద కాల్చకూడదు. మధ్యస్థాయి మంట ఉండేలా చూసుకోవాలి.

పెనం బాగా వేడిగా అయ్యాకనే దాని మీద చపాతీలు కాల్చాలి. పెనం వేడిగా లేకపోతే చపాతీలు గట్టిగా వస్తాయి.

చపాతీ సగానికి పైగా కాలిన తరవాతనే దాని మీద నూనె రాయాలి. పెనం మీద ముందుగా నూనె వేస్తే చపాతీలు సరిగా కాలవు.

చపాతీలను రెండువైపులా కాల్చిన తరవాత పళ్లెంలోకి తీసి దాని మీద మూత పెట్టాలి. లేకుంటే గట్టిపడతాయి.

Updated Date - Jan 06 , 2025 | 04:17 AM