Share News

Depression: కొత్త తల్లుల్లో కుంగుబాటు

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:07 AM

సాధారణ మహిళలతో పోలిస్తే, చిన్నప్పటి నుంచీ డిప్రెషన్‌కు లోనవుతున్నవారు, భర్త ప్రేమను పొందలేనివారు,

Depression: కొత్త తల్లుల్లో కుంగుబాటు

కొత్తగా తల్లైన కొందరు మహిళల్లో, బిడ్డకు తల్లైన ఆనందం కంటే మానసిక కుంగుబాటు ఎక్కువైపోతుంది. బిడ్డ పోషణ పట్ల ఆసక్తి సన్నగిలి, అర్థం లేని భయాలు, అనుమానాలు ఆవరిస్తాయి. ఈ స్థితే... ‘పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌’!

సాధారణ మహిళలతో పోలిస్తే, చిన్నప్పటి నుంచీ డిప్రెషన్‌కు లోనవుతున్నవారు, భర్త ప్రేమను పొందలేనివారు, గతంలో ప్రసవ సమయంలో మానసిక కుంగుబాటుకు లోనయినవాళ్లు, గర్భం దాల్చిన తొలినాళ్లలోనే డిప్రెషన్‌ బారిన పడుతూ ఉంటారు. వీరిలో గర్భం దాల్చామనే ఆనందం మచ్చుకైనా కనిపించదు. తీవ్రమైన భావోద్వేగాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. కొందరికి ప్రసవం ముందువరకూ లేని కుంగుబాటు, ప్రసవం తర్వాతి ఏడు రోజులు తీవ్రంగా బాధిస్తుంది. ఆ సమయంలో పిల్లలను దగ్గరకు తీసుకోరు. పాలివ్వడానికి ఇష్టపడరు. ఆ ఏడు రోజులు దాటితే ఈ మహిళలు తిరిగి మామూలుగా మారిపోతారు. ఇంకొందరిలో ప్రసవమైన 4వ నెలలో పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ తీవ్రత పెరుగుతుంది. పిల్లల పెంపకం వారిలో ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిస్థితి తొలిసారి తల్లయిన మహిళల్లో ఎక్కువ.

వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి

మహిళలు నిరాశానిస్పృహలను వ్యక్తం చేయడానికి ఇష్టపడరు. కానీ ఇలాంటి భావనలను నిర్లక్ష్యం చేయకూడదు. దానంతట అదే తగ్గిపోతుందిలే! అనే నిర్లక్ష ధోరణీ తగదు. అకారణంగా, ఏమాత్రం వేదనగా ఉన్నా, ఊరికే ఏడుపొస్తున్నా, తిండి మీద ఆసక్తి తగ్గినా, నిద్ర పట్టకపోతున్నా వెంటనే గైనకాలజి్‌స్టను కలిసి పరిస్థితి వివరించాలి. ఒకవేళ గతంలో డిప్రెషన్‌ బారిన పడి ఉంటే ఆ విషయాన్నీ వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. ఏ మందులు వాడుతున్నదీ చెప్పాలి. ప్రసవం తర్వాత ఏడు రోజుల్లో ఇవే లక్షణాలు మొదటిసారి కనిపించినా అశ్రద్ధ చేయకూడదు. గతంలో ప్రసవానికి ముందుగానీ, తర్వాతగానీ ఈ లక్షణాలు ఎదుర్కొన్న మహిళలు గర్భం దాల్చిన వెంటనే ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.


చికిత్సలున్నాయి!

ప్రసవం ముందైనా, తర్వాతైనా డిప్రెషన్‌ తాలూకు లక్షణాలు కనిపిస్తే మొదట కౌన్సిలింగ్‌ ఇవ్వవలసి ఉంటుంది. వారి వైద్య చరిత్ర ఆధారంగా డిప్రెషన్‌ గురించి లోతైన అవగాహన ఏర్పరుచుకుని, వైద్యులు తదనుగుణ చికిత్సను సూచిస్తారు. ప్రారంభంలో కౌన్సెలింగ్‌ ఉంటుంది. దీంతో చాలావరకూ కుంగుబాటు, పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌లు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే యాంటీడిప్రెసెంట్లు ఇవ్వవలసి ఉంటుంది. వీటితో కూడా అదుపు కాకుండా సైకోటిక్‌ దశకు చేరుకుంటే ఆ సమస్యకు తగిన చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. ఏదేమైనా గర్భిణుల్లో, బాలింతల్లో ఈ భావోద్వేగాలను అలక్ష్యం చేయకూడదు. లక్షణాలు కనిపించిన వెంటనే కుటుంబ సభ్యులే చొరవ తీసుకుని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. కొందరికి కొన్ని నెలలపాటు చికిత్స చేస్తే డిప్రెషన్‌ పూర్తిగా పోతుంది. కొందరికి అరుదుగా జీవితాంతం మందులు వాడవలసిరావొచ్చు.

Updated Date - Jan 07 , 2025 | 04:07 AM