Riyadh: రియాద్‌లో రంగవల్లులతో సాటా సెంట్రల్ సంక్రాంతి ఉత్సవాలు
ABN , Publish Date - Jan 14 , 2025 | 04:53 PM
సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో రాజధాని రియాధ్ నగరం శుక్రవారం ఉదయం నుండి అర్ధరాత్రి వరకుసంక్రాంతి సంబరాలు జరిగాయి
తిరుపతి లడ్డూ ప్రసాదం పంపిణీ
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఇల్లు విడిచి విదేశాలకు వచ్చిందే డబ్బు కొరకు, అయినా డబ్బే ప్రధానం కాకుండా ఆచార, వ్యవహారాల సమ్మేళనాల్లో భాగమైన పండుగలే మనుషులకు, సమాజానికి మధ్య అనుబంధాల వారధులు. కలిసి మెలిసి బతికేలా తరతరాల బంధాలకు అర్థం చెబుతూ ఊళ్లకు ఊళ్లు సందోహంగా కదిలే సాంస్కృతిక సంబరానికి ఆనవాళ్లే సంక్రాంతి సంబరాలు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ పెద్ద పండుగలోనే ఇందుకు ఇంటా బయటా మినహాయింపు కాదు (NRI).
అది గోదావరిలోని పాయలోని అంతర్వేది కానీ అరేబియా ఎడారి నడిబొడ్డులోని రియాధ్ నగరం కానీ ఆంధ్రులకు మినహాయింపు కాదు, సంక్రాంతి అంటే ఎక్కడయినా సరే సంక్రాంతే.
దమ్మాంలో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు
సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో రాజధాని రియాధ్ నగరం శుక్రవారం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు జరిగిన సంక్రాంతి సంబరాలలో 1700 కిలో మీటర్ల సుదూరంలోని తబూక్ నుండి మొదలు హాయిల్, దమ్మాం, జుబైల్ ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు ప్రత్యేకంగా వచ్చి పాల్గొన్నాయి. దమ్మాం మరియు ఈశాన్య ప్రాంతంలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాట్స్’ నాయకగణం కూడ 400 కిలో మీటర్ల దూరం నుండి ప్రత్యేక బస్సులలో రియాధ్ నగరానికి రావడంతో తమ సంబరాల ఉత్సాహం రెట్టింపయిందని నిర్వాహకులు వెల్లడించారు.
సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీయుల సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ కోసం రియాధ్ నగరం నుండి అంకూర్పణ జరిగి సాటా అవిర్భవించిందని, అనంత పరిస్థితులలో సాటా సెంట్రల్‌గా రూపుదిద్దుకొందని సాటా సెంట్రల్ ముఖ్యులు రంజీత్, ముజ్జమ్మీల్, ఆనందరాజు, సుచరితలు పేర్కొన్నారు.
H-1b Visa:ట్రంప్ ఏం చేయబోతున్నారో అన్న టెన్షన్.. ఇండియాకు వచ్చేందుకు జంకుతున్న ఎన్నారైలు!
ఏడు కొండల్లో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నకు సమర్పించే నైవేద్యాల్లో లడ్డూ ప్రధానమైంది. స్వామి వారికి నివేదించే నైవేద్యాల్లో లడ్డూను ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆదరిస్తారు, దీనికి తోడుగా వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుపతి నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులను సభికులకు అందించారు. దాసరి భారతీ నేతృత్వంలో మహిళలు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులకు సంక్రాంతి పండుగ విశిష్ఠతను వివరిస్తూ మహిళ ప్రముఖురాలు శ్రీదేవి రావు భోగి పళ్ళను పంపిణీ చేశారు. సాటా సెంట్రల్ ప్రధాన కార్యదర్శి ముజ్జమ్మీల్ షేఖ్ ఈసారి కూడ ఘటోత్కచుని ప్రాతలో అందర్నీ ఆకర్షించారు. సురేఖ పోతుల, గురు కిరణ్ పోతుల, శ్వేతలు పౌరాణిక సినిమాలో ఎన్టీఆర్ పాత్ర స్థాయిలో ఘటోత్కచుని పాత్రకు వేషధారణ వేయడంలో సహకరించారు.
సంక్రాంతి గాలి పటాల పాత్ర లేకుండా ఏలా ఉంటుంది.. సంక్రాంతితో చలికాలం పూర్తయి వసంతకాలంలోకి ఆహ్వానం పలుకుతూ ఆకాశంలో గాలిపటాలు ఎగురవేస్తుంటారు. మొదటిసారిగా రియాధ్ నగరంలో వచ్చిన అతిథులందరు ఉత్తరాయణంలో గాలిపటాలు ఎగురవేస్తూ ఉల్లాసంగా గడిపారు. అందరిలోనూ హైదరాబాద్‌కు చెందిన మొయినబాద్ నాగార్జున గాలిపటం అగ్రభాగన నిలిచింది. గాలిపటాలు ఎగుర వేయని అనేకులు పతంగి బూత్ వద్ద ఫోటోలు దిగారు, ఈ బూత్‌ను అరుణ, భారతీ దాసరి, భారతీ వి, ధన్వీ బోగినేని, లక్ష్మి మాధవి, సంధ్య బొబ్బూరి, సింధూర పబ్బతిలు ఆకర్షణీయంగా రూపొందించారు. చెరుకు, కుండలను రమ్య మరియు రజనీలు ఏర్పాటు చేయగా అది సభికులను ఆకట్టుకోంది.
సంక్రాంతిని ముగ్గులు లేకుండా ఊహించలేం. రియాద్‌లోని తెలుగు మహిళలు రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకువచ్చారు. ముగ్గుల నమూనలను విజయ లక్ష్మి వినూత్నంగా రూపొందించారు. వివిధ రకాల ఆకృతులతో మహిళలు అందమైన ముగ్గులు వేయగా, న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులను మెప్పించి భావన వన్నడ, నాగ పుష్పలత మొదటి, శ్వేత రియాజోద్దీన్, విద్య అగస్త్యరాజు రెండవ, విజయ లక్ష్మి, అరుణలు మూడవ బహుమతులు గెలుచుకున్నారు. ఉత్సాహభరితంగా జరిగిన రంగోళి పోటీలను లావణ్య నిర్వహించారు.
సంప్రదాయాలు, ఆచారాల నుండి తాత్కాలిక విరామం తీసుకుంటూ వినోదభరిత కార్యక్రమాలను చేయగా సమంత నటించిన ఓ బేబి సినిమా పాటకు హైదరాబాద్ నుండి వచ్చిన జ్యోతి వనం, స్థానిక ప్రవాసీయుడు శివారెడ్డిలు చేసిన నృత్యం అందర్నీ అలరించింది. తన కూతురు శ్వేత వద్ద వచ్చిన జ్యోతి స్థానిక ప్రవాసీయులను ఉత్తేజపర్చడానికి చేసిన నృత్యం యువతను కూడా అబ్బురపరిచింది.
సంక్రాంతి పండుగలో సుమారు వంద మంది ముస్లింలు పాల్గొనడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించారు. శుక్రవారం నమాజు చేయడానికి వీరికి ప్రత్యేక రవాణా ఏర్పాట్లను కూడా చేసినట్లుగా యాఖుబ్ తెలిపారు.
సాట్స్ నాయకులు కోనేరు ఉమా మహేశ్వరరావు, నాగశేఖర్, వరప్రసాద్, కిషోర్, హరికృష్ణ తదితరులు రియాద్‌లోని నిర్వాహకులను అభినందిస్తూ సువిశాల సౌదీలోని దమ్మాం, అల్ ఖోబర్ ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల తెలుగు ప్రవాసీయులు కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండవల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సౌదీలోని తెలుగు వారికి కావల్సిన సహాయసహాకారాలను అందిస్తామని సాట్స్ ప్రతినిధులు హామినిచ్చారు. నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఉమా మహెశ్వరరావు అవిష్కరించారు.
చిన్నారుల సందడి లేకుండా ఏ రకమైన పండుగ ఉత్సవం కూడా పూర్తి కాదు, ఊరూ వాడా సందడంతా చిన్నారులదే. రిశాంక్ రాం, కార్తీక అల్లా, మన్య,శారద చెక్క, అన్విత, సాన్విక, దాక్ష్య, తీసిస్ధా, ప్రజ్వల్, జస్వంత్, గీత్ సత్వీక్‌లు వివిధ పోటీలలో విజయం సాధించారు.
సంక్రాంతి నుండి విభిన్న రాశుల వారికి ఆర్థికంగా దశ తిరగడం ప్రారంభించి సంపద, సౌభాగ్యాలకు సంబంధించిన కలలు నిజం కావడం జరుగుతుందని, దీనికి తగు సేవలందించడానికి వివర్త మ్యూచువల్ ఫండ్, భువనేశ్వరి రియల్ ఎస్టేట్‌లు ఈ సందర్భంగా ముందుకు వచ్చినట్లుగా నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమ నిర్వహణలో భారతీ దాసరి, సుచరిత శంకర్, సింధూర పబ్బతి, సంధ్య బొబ్బురి, మానస, ప్రియాంక, గోద, శ్రీ లక్ష్మి, రమ్య, రజనీ పరెపల్లి, లక్ష్మి మాధవి, ఉషాలు ముఖ్య భూమిక వహించారు.
సందర్భానుసారం లక్ష్మి కాకుమని, మానస, సుచరిత మరియు శివారెడ్డిలు వ్యాఖ్యాతలుగా వ్యవహారించిన తీరు సభికులను ఆకట్టుకొంది. అనేక తెలుగు కుటుంబాలు ఈ సందర్భంగా వివిధ రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేయగా దానికి సభికుల నుండి అనూహ్య స్పందన లభించింది.