Ananya Pandey: దీపికను చూసి తీరు మార్చుకున్నా...
ABN , Publish Date - Apr 20 , 2025 | 07:13 AM
సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తారల్లో అనన్య పాండే(Ananya Pandey) ఒకరు. ‘లైగర్’తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఈ ఉత్తరాది భామ... ఈ ఏడాది బాలీవుడ్‌లో ‘కేసరి చాప్టర్2’తో తన సత్తా చాటేందుకు సిద్ధం అయ్యింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న కొన్ని కబుర్లివి...
నటనంటే పిచ్చి
చిన్నప్పట్నుంచి నాకు నటన అంటే పిచ్చి. అది ఏ స్థాయిలో అంటే... అమ్మానాన్నల దృష్టిని ఆకర్షించడానికి చెల్లితో తరచూ గొడవపడేదాన్ని. కానీ అదంతా నటనేనని అందరికీ సులువుగా తెలిసిపోతుండేది. ఒకర్ని ఇమిటేట్ చేయడమన్నా, అందర్నీ కూర్చోబెట్టి ఆసక్తికర కథలు చెప్పడమన్నా నాకు భలే ఇష్టం. అవకాశం వస్తే... అలనాటినటీమణులు వహీదా రెహమాన్, మాలాసిన్హాల బయోపిక్‌లో నటిస్తా.
కోలుకోవడానికి థెరపీ...
కెరీర్ ఆరంభంలో నాపై ఏవేవో వార్తలు వస్తుండేవి. వాటిలో ఒకటి నన్ను చాలా బాధించింది. ఎవరో ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని, తను నా క్లాస్‌మేట్ అయినట్లు పోస్టులు పెట్టేవాడు. ఇంటర్వ్యూలలో నా కాలేజ్, స్కూల్ విషయాల గురించి నేను అన్నీ అబద్ధాలు చెబుతున్నానని పనిగట్టుకొని మరీ ఇన్‌స్టాలో నాపై కామెంట్లు చేసేవాడు. అవి బాగా ట్రోల్ అయ్యాయి. నన్నెంతో బాధించాయి. ఆ బాధ నుంచి కోలుకోవడానికి థెరపీ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత అలాంటివాటిని పట్టించుకోవడం మానేశా.
సమయం దొరికితే...
ఫ్యాషన్ అంటే నా దృష్టిలో దుస్తులే కాదు.. తగిన యాక్సెసరీస్ కూడా. అందుకే దుస్తులకు తగ్గట్టు హ్యాండ్‌బ్యాగ్స్/హ్యాండ్‌క్లచ్‌లను ఎంచుకుంటా. నా క్లోజెట్‌లో రకరకాల హ్యాండ్‌బ్యాగ్స్‌తో పాటు ఖరీదైన హీల్స్, స్టేట్‌మెంట్ జ్యుయలరీ ఉంటాయి. ఇక ఖాళీ సమయం దొరికితే.. నా గాళ్స్‌గ్యాంగ్‌తో వెకేషన్లకు చెక్కేస్తా. ఇప్పటికే న్యూయార్క్, అమెరికా, మాల్దీవులు.. వంటి దేశాల్ని చుట్టొచ్చేశా. బీచ్ అంటే తెగ ఇష్టం.

అతిథి పాత్రలు ప్రత్యేకం
అతిథి పాత్రలు చేయడమంటే చాలా ఇష్టం. థియేటర్లో సడెన్‌గా వారు అభిమానించే నటుడు/నటి తెరమీద కనిపిస్తే ప్రేక్షకులు బాగా ఎగ్జయిట్ అవుతారు. ఉదాహరణకు.. ‘ఓం శాంతి ఓం’లోని ఒక పాటలో షారుక్‌తో కలిసి పలువురు బాలీవుడ్ నటీనటులు ఆడిపాడారు. ‘కుచ్ కుచ్ హోతా హై’లో సల్మాన్‌ఖాన్ అతిథి పాత్రలో మెరిసినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు ఒకటే గోల. అందుకే నాక్కూడా సినిమాల్లో హఠాత్తుగా కనిపించి, అభిమానుల్ని ఆశ్చర్యపరచడమంటే ఇష్టం.
ఆమే కారణం...

కెరీర్ ప్రారంభంలో నా పనేదో నేను చేసుకుపోయేదాన్ని. కానీ ‘గెహ్రియా’ సినిమా సెట్‌లో దీపికను చూశాక నా తీరు చాలా మార్చుకున్నా. సెట్స్‌లో తనకేం కావాలో, తనెలా ఉండాలనుకుంటుందో ధైర్యంగా వెల్లడించేదామె. అన్ని విషయాల్లో స్పష్టతతో ఉండేది. తనకు నచ్చని కాస్ట్యూమ్ అయినా, సన్నివేశమైనా... మర్యాదపూర్వకంగానే ‘నో’ చెప్పేది. దీపికను చూసి నేనూ ప్రేరణ పొందా. ఇప్పుడు నాకు అసౌకర్యంగా అనిపించే ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పగలుగుతున్నానంటే అందుకు కారణం దీపిక పరోక్షంగా నాలో నింపిన ధైర్యమే.
ఈ వార్తలు కూడా చదవండి
పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత
చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..
సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త
Read Latest Telangana News and National News