Share News

Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!

ABN , Publish Date - Mar 24 , 2025 | 08:36 AM

సోషల్ మీడియా వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇష్టానికి పోస్ట్ చేస్తే.. జరిమానా చెల్లించడమే కాక జైలుకు వెళ్లే పరిస్థితి రావొచ్చు.

Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!
Social Media

నేటి కాలంలో సోషల్ మీడియా అనేది మన జీవితంలో ఓ భాగం అయ్యింది. అయితే ఇంతకుముందులా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టింగ్స్, కామెంట్స్ చేస్తామంటే కుదరదు. ఏమాత్రం తేడా జరిగినా జైలుకే. సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి భారత ప్రభుత్వం కొన్ని కఠిన చట్టాలు చేసింది. మరి ఆ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోకుండా తోచింది పోస్ట్ చేస్తే జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఆ వివరాలు..


తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, రూమర్లు పోస్ట్ చేయడం నేరం. తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (ఐటీ యాక్ట్) సెక్షన్ 66ఏ, ఐపీసీ సెక్షన్ 505 కింద 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 2023లో ఢిల్లీలో ఒక వ్యక్తి కోవిడ్ గురించి తప్పుడు పోస్ట్‌లు చేశాడనే కారణంతో అరెస్ట్ చేశారు.

అగౌరవ వ్యాఖ్యలు మానండి

మతం, కులం, లింగం గురించి అవమానకరమైన పోస్ట్‌లు చేస్తే.. ఐపీసీ సెక్షన్ 295ఏ, 153ఏ కింద శిక్షార్హులవుతారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి, వారికి జైలు శిక్ష పడింది.


గోప్యతను ఉల్లంఘించవద్దు

అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్నిషేర్ చేస్తే ఐటీ యాక్ట్ సెక్షన్ 66ఈ కింద 3 సంవత్సరాల జైల శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. 2022లో ముంబైలో ఒక కేసులో ఇలానే శిక్ష విధించారు.

బెదిరింపు, హింసను ప్రోత్సహించవద్దు

సోషల్ మీడియా వేదికగా.. బెదిరింపు సందేశాలు, హింసాత్మక కంటెంట్ పోస్ట్ చేస్తే శిక్ష తప్పదు. ఈ తరహా పోస్ట్‌లు చేస్తే ఐపీసీ సెక్షన్ 506, 509 కింద జైలు శిక్ష తప్పదు. 2023లో బెంగళూరులో బెదిరింపు పోస్ట్‌లు చేశాడనే కారణంగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.


కాపీరైట్ ఉల్లంఘన మానండి

ఇతరుల కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడితే కాపీరైట్ యాక్ట్ 1957 కింద జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇటీవల ఒక యూట్యూబర్‌ మీద ఈ కారణంగా కేసు నమోదైంది.

సలహా

మీరు సోషల్ మీడియాలో ఏదైనా సమాచారం పోస్ట్ చేసే ముందు అది నిజమో కాదో చెక్ చేసుకొండి. అలానే గోప్యతను గౌరవించండి, చట్టపరమైన సలహా తీసుకోండి. సోషల్ మీడయా వాడే సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే.. జైలు శిక్ష, జరిమానా నుంచి కాపాడుకోవచ్చు.

Updated Date - Mar 24 , 2025 | 08:40 AM