Share News

మనీ సేవింగ్ సవాల్‏కు సిద్ధమా...

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:07 PM

ప్రపంచంలోనే అపరకుబేరుడైన వారెన్‌బఫెట్‌ ‘‘నేను పదకొండేళ్లకే పొదుపు చేయడం మొదలుపెట్టాను. కానీ ఆలస్యమైంది. ఇంకా ముందే చేయాల్సింది’ అంటాడు. అంటే.. పొదుపు అలవాటును ఎంత ముందు చేస్తే అంత మంచిదన్నది ఆయన ఉద్దేశ్యం. ఇప్పుడు పిల్లలకు వేసవి సెలవులు వస్తున్నాయి. మనీ సేవింగ్‌ను అలవాటు చేయడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పొదుపు పద్ధతులు చాలానే ఉన్నాయి.. వీటిలో ఏది నచ్చితే దాన్ని అనుసరించవచ్చు..

మనీ సేవింగ్ సవాల్‏కు సిద్ధమా...

మొక్కై వంగనిది మానై వంగుతుందా? ఏ అలవాటు అయినా విత్తనం దశలోనే మొలకెత్తాలి. డబ్బు విలువ కూడా బాల్యం నుంచే తెలియాలి. పెద్దయ్యాక ఎడాపెడా ఖర్చు చేస్తూ.. అనవసరంగా తగలేస్తూ.. అప్పులు కుప్పలయ్యాక ఏడిస్తే లాభం లేదు. అసలు ఆర్థిక స్పృహ లేకుండా ఎంత పెద్ద విజయం సాధించినా ఉపయోగమే లేదు. డబ్బును సంపాదించడం ఎంత కష్టమో.. దాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం. ఆ ఆర్థిక సామర్థ్యం మొక్క దశలోనే అలవడాలి అంటారు ఆర్థిక నిపుణులు. అలాంటి మొక్క మానయ్యాక లాభాల పంట పండిస్తుంది. కుటుంబాన్ని ఉన్నతస్థితిలోకి తీసుకెళుతుంది. అందుకే ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యం నుంచే పొదుపును జీవనశైలిలో భాగం చెయ్యాలి. ఒక అలవాటుగా ప్రోత్సహించాలి. ఇప్పటికే ప్రపంచం అనేక రకాల సేవింగ్‌ ప్లానింగ్స్‌ను అనుసరిస్తోంది.. అలాంటి కొన్ని పొదుపు మార్గాలే ఇవి..


100 ఎన్వలప్‌ ఛాలెంజ్‌..

ఒక చిన్న చెక్కపెట్టె.. అందులో రంగురంగుల వంద ఎన్వలప్‌ కవర్లు. అన్నేసి స్ర్కాచ్‌కార్డులు. ఇవన్నీ కలిపితేనే ‘100 ఎన్వలప్‌ ఛాలెంజ్‌’ బాక్స్‌ అవుతుంది. ముందుగా పిల్లలు స్ర్కాచ్‌కార్డులో ఒక చుక్కను కదిపితే చాలు. అందులో ఒక వంద లేదా రెండొందలు కనిపిస్తుంది. ఆ రోజుకు ఆ మొత్తాన్ని కవర్‌లో పెట్టి సీల్‌ వేయాలి. ఆ కవర్‌ను చెక్కెపెట్టెలో దాచుకోవాలి. ఇలా చేస్తే కొంత కాలానికి పెద్ద మొత్తం అవుతుంది. ఇప్పటి పిల్లలకు స్ర్కాచ్‌కార్డులు కొత్తకాదు. గూగుల్‌పేలాంటి యాప్స్‌లో కూడా ఇతరులకు డబ్బు పంపగానే స్ర్కాచ్‌కార్డు వస్తుంది. దానిని వేలితో తుడిపేస్తే అందులో కొన్ని ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌ వంటివి కనిపిస్తాయి. షాపింగ్‌మాల్స్‌కు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి పద్ధతుల్లోనే బహుమతులు ఇస్తున్నారు. కాబట్టి ఇదే ట్రెండ్‌ను ‘100 ఎన్వలప్‌ ఛాలెంజ్‌’కు తర్జుమా చేశారు తయారీదారులు. పిల్లల్లో సహజంగా ఉండే కుతూహలం పొదుపు పోటీకి ఉపకరిస్తుంది. త్వరగా పొదుపు అలవాటు అవుతుంది.. అంటున్నారు ఆర్థిక సలహాదారులు. హండ్రెడ్‌ ఎన్వలప్‌ ఛాలెంజ్‌ బాక్స్‌లు కొంత ఖరీదైనప్పటికీ ఆన్‌లైన్‌లో కొని, పిల్లలకు కానుకగా ఇవ్వొచ్చు. ఆ చిన్న పెట్టె.. పొదుపును జీవితంలో భాగం చేస్తుంది.

book7.2.jpg


52 వీక్స్‌ మనీ ఛాలెంజ్‌..

సవాళ్లు స్వీకరించడం నేటితరానికి చాలా ఇష్టం. పరిమిత సమయంలో ఆ లక్ష్యాన్ని ఛేదిస్తే మజా అనిపిస్తుంది. పిల్లల్లోని ఆ లక్షణాన్నే పట్టుకుంది కసంద్రాపెర్రీ అనే ఆర్థిక నిపుణురాలు. 52 వీక్స్‌ మనీ ఛాలెంజ్‌ అనే కాన్సెప్ట్‌ను జనంలోకి తీసుకొచ్చింది. తొలుత తను ఒక బ్లాగ్‌లో చిన్న పోస్టుగా పెట్టింది. అదింత ప్రాచుర్యం పొందుతుందని ఊహించలేదు. ఈ ఛాలెంజ్‌ చాలా సింపుల్‌. 52 వారాలు క్రమం తప్పకుండా డబ్బును పొదుపు చేయాలన్నది నిబంధన. అందులోనూ తొలివారం 10 రూపాయలతో మొదలుపెట్టి.. రెండో వారం 20 రూపాయలు, మూడో వారం 30 రూపాయలు... ఇలా రెట్టింపు డబ్బును పొదుపు చేస్తూ.. ఒక హుండీలోకి వేయాలన్నది ఆమె చెప్పిన సూత్రం.

book7.3.jpg


ఏడాది తిరిగే సరికి (52 వారాలు) ఆ మొత్తం రూ.13,640 అవుతుంది. పొదుపు లక్ష్యం నెరవేరినందుకు పిల్లల్లో జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ప్రతీ పైసా విలువైనదేనని మనసులో నాటుకుపోతుంది. క్రమశిక్షణ ఉన్నప్పుడే డబ్బు పోగవుతుందన్న ఆర్థికజ్ఞానం అలవడుతుందంటారు కసంద్రా. ఆమె కొన్నేళ్ల కిందట ఈ మనీ ఛాలెంజ్‌ను ప్రపంచానికి చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. 2013లో సామాజిక మాధ్యమాల పుణ్యమాని పాపులర్‌ అయ్యింది. అన్ని దేశాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలతో మనీ ఛాలెంజ్‌ చేయించారు. ఒక తెల్లకాగితం లేదా డైరీ తీసుకుని.. పది రూపాయలతో మొదలుపెట్టి.. రెట్టింపు డబ్బును జతచేస్తూ.. ఒక టేబుల్‌ను తయారుచేసుకుంటే పిల్లలకు సులభం అవుతుంది.

book7.4.jpg


సేవింగ్‌ డాజీ

సినిమాకు వెళదామంటే ఇంట్లో డబ్బులు ఇవ్వరు. స్నేహితులతో కలిసి ట్రిప్‌కు పోదామంటే వద్దంటారు. కనీసం పుట్టినరోజుకు ఒక ఖరీదైన చొక్కా తీసుకుందామన్నా ఒప్పుకోరు. ఇక, కొత్త బైకు కల కలగానే మిగిలిపోయిందిలే!. అది ఇప్పట్లో అయ్యే పని కాదు.. ఇవన్నీ తల్చుకుంటే తల్లిదండ్రులపైన కోపం. ఒక్కోసారి ఇంట్లో నుంచి పారిపోవాలన్నంత అసహనం. అన్నింటికీ కారణం డబ్బు.. డబ్బు. వంద రూపాయలు ఇవ్వడానికే సవాలక్ష ఆలోచిస్తారు అమ్మానాన్నలు... సరిగ్గా ఇలాంటి కోపతాపాలతోనే పెద్దలను నిందిస్తుంటారు యువతీయువకులు. కోపం పేరెంట్స్‌ మీద కాదు.. షాపింగ్‌ మీద చూపండి.. హోటళ్లపైన ఎగరండి.. ఇంకా చెప్పాలంటే మీరు పెట్టే ప్రతీపైసాపైనా కోపం ప్రదర్శించండి.. అప్పుడు బాగుపడతారు అంటోంది సేవింగ్‌ డాజీ ఉద్యమం. ఇది కరోనా తర్వాత చైనాలోని పేద కుటుంబాల్లో పుట్టింది. ఇప్పుడు ఆ దేశం నలుమూలలా వ్యాపించింది.


book7.5.jpg

సేవింగ్‌ డాజీ అంటే కక్ష తీర్చుకున్నట్లు పట్టుపట్టి డబ్బును పొదుపు చేయడం. చైనీయులకు ఈ ఉద్యమం ఎందుకింతగా నచ్చిందంటే.. కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఆర్థికపరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఉద్యోగాలు పోయాయి. ఉపాధి లభించలేదు. కొందరైతే ఆస్పత్రులపాలైనప్పుడు చేసిన అప్పులు ఇప్పటికీ తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ స్వేచ్ఛగా డబ్బులు ఖర్చు చేసిన జనానికి కసితో మిగిలిస్తే తప్ప బతకలేని పరిస్థితికి వచ్చేశారు. అందుకే సేవింగ్‌ డాజీ పొదుపు ఉద్యమం తెగ నచ్చేసింది. హోటళ్లకు వెళ్లడాలు లేవు. షాపింగ్‌ ఊసే లేదు. టూర్లు ఎప్పుడో కానీ వెళ్లరు. విచ్చలవిడిగా కొత్తబట్టలు, నగలు, వస్తువులు కొనడాలేవీ లేవు. ఇదే డాజీ ఉద్యమం. ఖర్చు పెట్టకపోగా.. కసితో డబ్బును మిగల్చడం చైనీయులకు అలవాటు అయ్యింది. ఇప్పుడిప్పుడే చాలా కుటుంబాల్లో మార్పు వచ్చింది. కనీసం కొంత మొత్తమైనా పోగైందని చైనా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. డాజీ వల్ల కుటుంబాలే కాదు దేశ ఆర్థికపరిస్థితి కూడా మెరుగుపడింది.


నో డైనింగ్‌ అవుట్‌..

కరోనా మనందరి జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చిందంటే.. ఇప్పటికీ పరోక్షంగా దాని ప్రభావం నుంచి బయటపడలేకపోతున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో.. మితిమీరిన తిండి అలవాటు అయ్యింది. ఆ తర్వాత ఫుడ్‌డెలివరీ ద్వారా రకరకాల ఆహారపదార్థాలను తెప్పించుకునే ధోరణి పెరిగింది. మానసిక ఒత్తిళ్లతో ఉన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్‌స్థాయిలు పెరిగి.. తిండిమీద విపరీతయావ కలుగుతుంది. ఇంట్లోనే వర్క్‌ఫ్రంహోమ్‌లో ఉన్న ఉద్యోగుల్లో చాలా మంది ఫుడ్‌డెలివరీ యాప్స్‌కు బానిసలైనట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అందుకే స్థూలకాయం, అధికబరువు, అధికకొవ్వు, ట్రైగ్లిజరైడ్స్‌ వంటివి ఎక్కువయ్యాయి. తద్వార మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కాలేయ, ఉదర సంబంధిత వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయని వైద్యులు చెబుతున్నారు.


వీటన్నింటికీ ప్రధాన కారణం తరచూ హోటళ్ల ఆహారాన్ని తినడం. ఫుడ్‌అవుట్‌లెట్లలో లభించే వేపుడు పదార్థాలను ఆరగించడం. కరోనా తర్వాత హోటళ్లకు వెళ్లే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. వారాంతాల్లో అయితే పర్లేదుకానీ.. ఇలా తరచూ బయట వండిన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యం చెడిపోవడంతోపాటు... డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. మన జీవితాల్లో చొరబడిన ఈ ఉపద్రవాన్ని అడ్డుకునేందుకు పుట్టుకొచ్చిన మరో పొదుపు ఉద్యమమే నో డైనింగ్‌ అవుట్‌. దీని ఉద్దేశ్యం ఏంటంటే.. ఎప్పుడు పడితే అప్పుడు అనవసరంగా హోటళ్లకు వెళ్లకపోవడం. ఆహార పానీయాల కోసం ఆర్థిక పరిస్థితులకు మించి ఖర్చు పెట్టకపోవడం. ప్రత్యేక సందర్భాలప్పుడు (జన్మదిన, వివాహ వేడుకలు) తప్పిస్తే.. మిగిలిన సందర్భాలలో హోటళ్లకు వెళ్లకూడదన్నది నో డైనింగ్‌ అవుట్‌ లక్ష్యం. చాలా దేశాల్లో ఇదొక ఉద్యమంలా సాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో ఎంతోకొంత డబ్బును మిగిల్చుకోవడానికి పనికొచ్చింది. నిత్యం బయట తింటూ.. హోటల్‌ బిల్లులకే వేల రూపాయలు వెచ్చించే వాళ్లను కట్టడి చేసిందీ ట్రెండ్‌.


వుడెన్‌ సేవింగ్‌ బాక్స్‌

మట్టితో చేసిన పిగ్గీ బ్యాంక్‌ చేతిలో పెట్టి.. డబ్బును పొదుపు చేయమంటే పెదవి విరుస్తారు పిల్లలు. ఎందుకంటే అది పాత పద్ధతి. అందులో థ్రిల్‌గా భావించేదేమీ ఉండదన్నది వారి భావన. పిల్లలకు ఏ పని చేసినా కొత్తగా ఉండాలి. కుతూహలం కలగాలి. చిన్న చిన్న పజిల్స్‌ను పూర్తి చేశామన్న సంతృప్తి ఏర్పడాలి. అప్పుడే ఏ పని అయినా ఆసక్తితో చేస్తారు. కొత్తతరం పిల్లల మనస్తత్వమెరిగి తయారుచేసినదే వుడెన్‌ మనీ పిగ్గీ బ్యాంక్‌. దీన్నొక మనీ మ్యాజిక్‌ పెట్టె అనే చెప్పొచ్చు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో తెగ అమ్ముడవుతున్నాయివి. వీటిని పిల్లలు అమితంగా ఇష్టపడటమే కాకుండా.. మనీ సేవింగ్‌ను వెంటనే ప్రారంభిస్తారు. కలపతో చేసిన ఈ పెట్టెపైన గళ్లలో రూ.200, రూ.500, రూ.100 వంటి మొత్తాలతో అంకెలు ఉంటాయి.


అంతా కలిపితే ఒక మొత్తం అవుతుంది. లక్ష రూపాయలు లేదా రెండు లక్షలు లేదా యాభై వేలు.. ఇలా మన ఆర్థిక లక్ష్యాన్ని బట్టి బాక్స్‌లను కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు ఒక లక్షరూపాయలు పొదుపు చేయాలన్న టార్గెట్‌తో ఒక బాక్స్‌ను కొనుగోలు చేశామనుకోండి. తొలుత వంద నుంచి ఐదొందలు సేవ్‌ చేస్తూపోవాలి. మనం ఏ నోటును అయితే వుడెన్‌బాక్స్‌లో వేశామో.. ఆ అంకెను స్కెచ్‌తో కొట్టేయాలి. ఇలా రోజూ ఎంత డబ్బులు వేస్తే అంత జమ అవుతుంది. లక్ష రూపాయల లక్ష్యాన్ని చేరుకున్నామో లేదో పెట్టెపైనున్న అంకెలు చెబుతాయి. లక్ష మదుపు చేశాక... వుడెన్‌బాక్స్‌ కింద ఉన్న బోల్టులు ఊడదీసి.. లోపలున్న డబ్బును తీసి.. లెక్కపెట్టుకోవాలి. ఆ మొత్తాన్ని పిల్లల పేరు మీద మదుపు చేయాలి. ఆన్‌లైన్‌లో లభించే ఈ బాక్స్‌ ఖరీదు ఆరొందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది. దీనిని ఒకసారి కొంటే నాలుగైదేళ్లు వాడొచ్చు.


మనీ ప్లానర్‌ పౌచ్‌

ఆర్థిక ప్రణాళిక అనేది పెద్దలకే సంబంధించిన విషయం కాదు. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా తెలియాల్సిన ప్రధాన అంశం. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ప్రతి నెలా వస్తున్న ఆదాయం, అవుతున్న ఖర్చులు, రేపటి అవసరాలకు చేసే పొదుపు.. ఇవన్నీ తెలియాలి. పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఫ్యామిలీ బడ్జెట్‌పై చర్చించాలి. ప్రణాళికలో వాళ్లనూ భాగస్వాములు చేయాలి.. అప్పుడే తమ ఆర్థికస్థితిగతులు అర్థం అవుతాయి. తద్వార ఏది కొనకూడదు.. ఏది కొనాలి.. ఏది తమ తాహతుకు మించినది తెలుస్తుంది. ఇందుకు కావాల్సింది ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌. ఈ పద్ధతిని అనుసరించేందుకు దోహదపడుతుంది మనీ ప్లానర్‌ పౌచ్‌. ఆన్‌లైన్‌లో నాలుగు వందల నుంచి ఆరొందల రూపాయల్లో లభిస్తున్నాయివి.


ఒక చిన్న పర్సులాంటి డైరీలా ఉంటుందీ ప్లానర్‌ పౌచ్‌. మన ఆర్థిక అవసరాలను బట్టి ఒక్కో పౌచ్‌కు ఒక్కో పేరు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఇంటిఅద్దె, విహారయాత్రలు, ఫీజులు, ఖర్చులు.. ఇలా కేటాయించిన పేజీ పౌచ్‌లలో డబ్బును దాచుకోవచ్చు. పిల్లలకు డబ్బులు అందించి ఈ పనులన్నీ చేయిస్తే.. కుటుంబ అవసరాలకుపోను ఎంత మిగులుతుందనే విషయం తెలుస్తుంది. అప్పుడు వినియోగ మనస్తత్వం తగ్గుతుంది. ఎడాపెడా ఖర్చులు పెట్టరు. డబ్బు విలువ అర్థం అవుతుంది. ఈ మనీ ప్లానర్‌ పౌచ్‌లు రకరకాల రంగుల్లో లభిస్తున్నాయి. ఒకసారి కొంటే కొన్నేళ్ల వరకు వాడుకోవచ్చు.

...ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న సరికొత్త పొదుపు పద్ధతులు. ఇవేకాకుండా మన సంప్రదాయ మదుపు అలవాట్లను కూడా కొనసాగించవచ్చు.. అయితే కొత్త కొత్త సేవింగ్‌ ఐడియాలను పిల్లలకు అందిస్తే... చక్కగా అమలుచేస్తారు. చిన్నప్పటి నుంచే డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టే తత్వం అలవడుతుంది. భవిష్యత్తులో ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తారు.. కాబట్టి ఏదో ఒక పొదుపు మార్గం అనుసరించేలా మీ పిల్లల్ని ప్రోత్సహించండి.

- సండే డెస్క్‌


ఈ వార్తలు కూడా చదవండి

పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత

రైతులకు మహాప్రసాదం భూభారతి

చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

సోషల్‌ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త

వాట్ యాన్ ఐడియా సర్ జీ...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 20 , 2025 | 12:07 PM