స్కూబా... దిల్‌రూబా...
ABN , Publish Date - Apr 20 , 2025 | 09:06 AM
స్కూబా డైవింగ్... ఏ మారిషస్‌లోనో, మాల్దీవుల్లోనో మాత్రమే ఉంటుందని చాలామంది అనుకుంటారు. సోషల్‌మీడియా వీడియోల్లో చూసి... సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండదని, డైవ్ చేయడం మన వల్ల కాదని భావిస్తుంటారు.
సముద్రగర్భంలోకి వెళ్లి, అక్కడి విశేషాలు చూడాలనుకుంటోంది యువతరం. అందుకే ఆన్‌లైన్‌లో ‘స్కూబా డైవింగ్’ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సముద్ర తీరానికి విహారానికి వెళ్తున్న చాలామంది వాటర్‌స్పోర్ట్స్‌తో పాటు స్కూబా డైవింగ్‌తో సాహసం చేసేందుకు సై అంటున్నారు. మన దగ్గరున్న కొన్ని డైవింగ్ స్పాట్స్ విశేషాలివి...
స్కూబా డైవింగ్... ఏ మారిషస్‌లోనో, మాల్దీవుల్లోనో మాత్రమే ఉంటుందని చాలామంది అనుకుంటారు. సోషల్‌మీడియా వీడియోల్లో చూసి... సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండదని, డైవ్ చేయడం మన వల్ల కాదని భావిస్తుంటారు. కానీ ఈత రాని వారు సహా ఎవరైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుని స్కూబా డైవింగ్ చేయొచ్చు. సముద్రపు లోతుల్లోకి వెళ్లి అక్కడి దృశ్యాలను తిలకించాలనుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. థ్రిల్‌ను అందించే బెస్ట్ సమ్మర్ వెకేషన్ డైవింగ్ స్పాట్స్ ఇవి...
నేచర్ వండర్... అండమాన్
బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ దీవులు స్కూబా డైవింగ్‌కు అత్యుత్తమమైన, అనుకూలమైన ప్రదేశాలుగా పేరొందాయి. ఇక్కడి సముద్రభాగంలో స్కూబా డైవ్ చేస్తే తాబేళ్లు, ఆక్టోపస్‌లు, బ్యాట్‌ఫిష్, మోరే ఈల్స్, ట్రెవ్యాలీ వంటి జీవులను చూడొచ్చు. తెల్లని ఇసుక బీచ్‌లు, నీలివర్ణంలో మెరిసిపోయే సముద్రం, స్వచ్ఛమైన నీళ్లు, రంగురంగుల సముద్రజీవులు, సహజసిద్ధంగా ఏర్పడిన పగడపు దిబ్బలు... పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పోర్ట్‌బ్లెయిర్, నీల్ దీవి (షాహిద్ ద్వీప్), హావెలాక్ ఐలాండ్ (స్వరాజ్ ద్వీప్) వంటివి అండమాన్‌లో స్కూబా డైవ్‌కి అనుకూల ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. నీల్ ఐలాండ్ పోర్ట్‌బ్లెయిర్‌కు 53 కి.మీ దూరంలో ఉంటుంది. ప్రకృతి సౌందర్యాన్ని, అద్భుతాలను వీక్షించడానికి ఈ ఐలాండ్ బెస్ట్ ప్లేస్‌గా చెప్పుకోవచ్చు.

అండమాన్ దీవుల్లో టర్టిల్ బీచ్, ట్రైబ్ గేట్, ది వాల్, జంక్షన్, కరప్షన్ రాక్, స్నేక్ ఐలాండ్ వంటివి డైవ్ సైట్స్‌గా పేరొందాయి. ఇక్కడ డైవ్ టికెట్ ధరలు రూ. 3500 నుంచి 6500 వరకు ఉన్నాయి. ఉదయం వేళ డైవ్ చేస్తే అబ్బురపరిచే సముద్ర జంతుజాలం కనువిందు చేస్తుంది. అదృష్టం ఉంటే అండమాన్ దీవుల రాష్ట్ర జంతువు ‘డ్యుగాంగ్’ మీ కంట పడొచ్చు. డ్యుగాంగ్‌ని ‘సీ కౌ’ అని కూడా పిలుస్తారు. అండమాన్ దీవులలో భాగంగా ఉన్న సింక్యూ ఐలాండ్‌లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నీళ్లు ఇక్కడ కనిపిస్తాయి. నీళ్లలో 80 అడుగుల లోతు వరకు స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడి స్కూబా డైవ్ ఆపరేటర్స్ బేసిక్, అడ్వాన్స్‌డ్ డైవ్ కోర్సులు నేర్పించి కాన్ఫిడెంట్ డైవర్‌గా తీర్చిదిద్దుతారు.
సముద్రంలో దాగిన స్వర్గం...
స్కూబా డైవ్‌ని ఇష్టపడే వారికి లక్షద్వీప్ ‘హిడెన్ ప్యారడైజ్’గా నిలుస్తుంది. ఆమధ్య ప్రధాని మోదీ పర్యటన తరువాత లక్షద్వీప్‌ను సందర్శించే వారి సంఖ్య పెరిగింది. ఇక్కడ రంగురంగుల పగడపు దిబ్బలు విశేషంగా ఆకర్షిస్తాయి. తాబేళ్లు, రంగురంగుల చేపలు, షార్క్ వంటివి కనువిందు చేస్తాయి. సముద్రజీవులను అన్వేషించాలనుకునే స్కూబా డైవింగ్ లవర్స్‌కి అత్యుత్తమమైన ప్రదేశం ఇది. ఇక్కడ డాల్ఫిన్ రీఫ్, క్లాస్‌రూమ్, ప్రిన్సెస్ రాయల్, లాస్ట్ ప్యారడైజ్, మాంటా పాయింట్, ఫిష్ సూప్ వంటి ప్రదేశాలు డైవ్ సైట్స్‌గా గుర్తింపు పొందాయి. అరగంట అండర్‌వాటర్ డైవ్ చేయాలనుకుంటే ఒక్కొక్కరికి రూ 4 వేల నుంచి 6 వేల వరకు ఛార్జ్ చేస్తారు. 200 ఏళ్ల క్రితం ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన యుద్ధంలో మునిగిపోయిన యుద్ధనౌక అవశేషాలను ప్రిన్స్ రాయల్ డైవ్ సైట్‌లో చూడొచ్చు. లక్షద్వీప్‌లో భాగంగా ఉన్న కార్డమమ్ ఐలాండ్‌లో స్కూబా డైవ్ చేస్తే సముద్రపు తాబేళ్లు కనువిందు చేస్తాయి. తెల్లని ఇసుక బీచ్‌లు, స్వచ్ఛమైన జలాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ నార్త్ కేవ్, టర్టిల్ సిటీ, డబుల్ రీఫ్, జాక్ పాయింట్, షార్క్ అల్లే ప్రదేశాలు ప్రసిద్ధ డైవ్ సైట్‌లుగా పేరొందాయి.
బోలెడంత ఫన్
స్కూబా ఔత్సాహికులకు అత్యంత రక్షిత ప్రదేశం గోవా అని చెప్పుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో స్కూబా డైవ్ చేయాలనుకునే వారికి ఇది సరైన ప్లేస్. ఇక్కడున్న డైవ్ సైట్స్ అన్నీ 5 నుంచి 15 మీటర్లలోతు మాత్రమే ఉంటాయి. అడుగున నీటి ప్రవాహం ఉండదు. స్వచ్ఛమైన జలాలు, రకరకాల సముద్ర జీవులు డైవర్స్‌ని ఆకట్టుకుంటాయి. డేవీ జోన్స్ లాకర్, సుజీ రెక్, గ్రాండ్ ఐలాండ్, టర్బో టన్నెల్, షెల్టర్ కోవ్, సెయిల్ రాక్ వంటి పేరున్న డైవ్ సైట్లలో పర్యాటకులు స్కూబా డైవ్ చేయవచ్చు. ఒక్కో వ్యక్తికి శిక్షణతో పాటు డైవ్‌కు తీసుకెళ్లడానికి రూ. 1500 నుంచి 4000 వరకు వసూలు చేస్తారు. నీళ్లలో ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

దైవభూమిలో...
ప్రశాంతమైన నీటిలో స్కూబా డైవ్ చేయాలంటే ఛలో కేరళ అనాల్సిందే. ఇక్కడ డైవ్ స్పాట్స్‌కు కొదువ లేదు. అందులో కోవలం బెస్ట్ ప్లేస్‌గా గుర్తింపు పొందింది. స్కూబా డైవింగ్ కొద్దిగా సాహసాలు కోరుకునే వారికి కోవలం మంచి ఎంపికగా నిలుస్తుంది. రకరకాల సముద్ర జంతువులు, పగడపు దిబ్బలు కనువిందు చేస్తాయి. పఫ్ఫర్ ప్యారడైజ్, లైట్‌హౌజ్ బీచ్, కోవలం బీచ్, హవా బీచ్‌లు పాపులర్ డైవ్ సైట్లుగా గుర్తింపు పొందాయి. ఒక్కరికి రూ.3500 నుంచి 4500 వరకు ఛార్జ్ చేస్తారు.
ఔత్సాహికుల కోసం...
ఇండియాకి తూర్పు తీరంలో ఉన్న ఏకైక డైవింగ్ స్పాట్ పాండిచ్చేరి. ఇండియాలో ఉన్న స్కూబా డైవింగ్ ప్రదేశాలలో అత్యుత్తమమైనది కూడా. నీటి అడుగు భాగంలో ఉన్న అందాలను చూడాలంటే ఇక్కడ స్కూబా డైవ్ చేయాల్సిందే. సహజసిద్ధంగా ఏర్పడిన పగడపు దిబ్బలు, ప్యారట్ ఫిష్, జాక్‌ఫిష్, సీ స్నేక్స్ వంటి రకరకాల జంతుజాలాన్ని ఇక్కడ చూడొచ్చు. మొదటిసారి స్కూబా డైవ్ చేయాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్. టెంపుల్ రీఫ్, కూల్ షార్క్ రీఫ్, 4 కార్నర్స్, ద హోల్, అరవింద్ వాల్, రావెన్స్ వంటివి గుర్తింపు పొందిన డైవ్ సైట్లు ఉన్నాయి. ఇక్కడ డీప్ డైవర్స్ 40 మీటర్ల లోతు వరకు వెళ్లే వీలుంది. స్కూబా డైవింగ్‌కి రూ. 4 వేల నుంచి 6 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆకట్టుకునే బీచ్‌లు, ప్రశాంతమైన వాతావరణం ఉండటం వల్ల ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు.
నేత్రాని దీవి...
కర్ణాటకలో ఉన్న స్కూబా డైవింగ్ స్పాట్ నేత్రాని దీవి. దీన్ని ‘పీజియన్ ఐలాండ్’ అని కూడా పిలుస్తారు. హృదయాకారంలో ఉండే ఈ దీవి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మురుదేశ్వర్ పట్టణం నుంచి నేత్రాని దీవి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్పీడ్ బోటులో ప్రయాణించి దీవిని చేరుకోవచ్చు. ఇక్కడ అరుదుగా సొరచేపలు కనిపిస్తాయి. పెబ్బెల్ బీచ్, నర్సరీ, ది గ్రొట్టో, టి 55 ప్రదేశాలు బెస్ట్ డైవ్ స్పాట్స్‌గా గుర్తింపు పొందాయి. ఒక్కొక్కరికి 5 వేల నుంచి 6 వేల వరకు వసూలు చేస్తారు.
ఈత రానివారు సైతం...
తార్కర్లి... మహారాష్ట్రలో ఉన్న డైవింగ్ స్పాట్ ఇది. సింధుదుర్గ్ ఫోర్ట్ సమీపంలో... తీరం నుంచి కాస్త దూరంలో ఉంటుంది. పర్యాటకులు దండి బీచ్ నుంచి స్పీడ్ బోట్లో తార్కర్లి చేరుకోవచ్చు. కింగ్స్ గార్డెన్, ధారన్ పాయింట్‌లు డైవ్ స్పాట్‌లుగా గుర్తింపు పొందాయి. ఒక్కరికి రూ.500 నుంచి 1000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఈత రానివారు సైతం 30 మీటర్ల లోతు వరకు వెళ్లొచ్చు. శిక్షకుల సహాయంతోనే డైవింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
ద్వారకను చూస్తారా?
శ్రీకృష్ణుడి జన్మస్థలం ద్వారక. ఈ పట్టణం నీళ్లలో మునిగిపోయిందన్న విషయం తెలిసిందే. మరి నీటిలో మునిగిపోయిన నగరాన్ని చూసే భాగ్యం కావాలంటే స్కూబా డైవ్ చేయాల్సిందే. అండర్‌వాటర్ సిటీగా ద్వారకకు గుర్తింపు ఉంది. శివరాజ్‌పూర్ బీచ్ స్కూబా డైవ్‌కు బెస్ట్ ప్లేస్. ఒక్కరికి 3 వేల నుంచి 6 వేల వరకు ఛార్జ్ చేస్తారు. ద్వారకా నగరంతో పాటు తాబేళ్లు, డాల్ఫిన్లు, సొరచేపలు చూడొచ్చు.
డైవింగ్ సూట్
స్కూబా డైవింగ్ సూట్ ధరించడం వల్ల చల్లని నీటిలోనూ శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోకుండా ఉంటాయి. అలాగే మందంగా ఉండే డైవింగ్ సూట్ ఇన్సులేషన్‌గా పనిచేస్తుంది. సూట్లలో వెట్ స్కూబా సూట్, డ్రై డైవింగ్ సూట్‌లు ఉంటాయి. డైవింగ్ సూట్ ఫ్లెక్సిబుల్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. శరీరానికి సరిగ్గా నప్పేలా ఉంటుంది. దీన్ని నియోప్రిన్‌తో తయారుచేస్తారు. నియోప్రిన్ అనేది ఒకరకమైన సింథటిక్ రబ్బరు. నియోప్రిన్‌లో రెండు రకాలుంటాయి. ఒకటి ఓపెన్ సెల్ నియోప్రిన్, రెండోది క్లోజ్డ్ సెల్ నియోప్రిన్. ఓపెన్ సెల్ వెట్‌సూట్‌లో ఇంటర్నల్ లైనింగ్ ఉండదు. కాబట్టి సెమీ డ్రైగా ఉంటాయి. ఈ సూట్ ధరిస్తే నీరు చర్మానికి తగలదు. ఇక క్లోజ్డ్ సెల్ నియోప్రిన్‌లో అంతర్గత లైనింగ్ ఉంటుంది. ఈ సూట్ ధరిస్తే చర్మానికి నీరు తగులుతూ ఉంటుంది. వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద డైవ్ చేయడానికి వేర్వేరు మందం ఉన్న సూట్‌లు లభిస్తాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- ఒంటరిగా డైవ్ చేయకూడదు. శిక్షకులు వెంట ఉంటేనే డైవింగ్‌కు దిగాలి.
- స్కూబా డైవ్ చేసే ప్రదేశానికి దగ్గరలో అత్యవసర సహాయాన్ని అందించే సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా గమనించాలి.
- ఆల్కహాల్ తీసుకుని స్కూబా డైవింగ్ చేయడం ప్రమాదకరం.
- నీళ్లలో బ్రీతింగ్‌ను ఆపొద్దు. నెమ్మదిగా డీప్ బ్రీత్ చేస్తుండాలి.
- స్కూబా ఎక్విప్‌మెంట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా డబల్ చెక్ చేయాలి.
- 12 ఏళ్లలోపు పిల్లలు, 50 ఏళ్లు పైబడిన వారిని రిక్రియేషనల్ స్కూబా డైవింగ్‌కు అనుమతించరు.
- ప్రొఫెషనల్ డైవర్స్ చెప్పే సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలి.
సర్టిఫైడ్ డైవర్స్ 130 అడుగుల లోతు వరకు డైవ్ చేస్తూ వెళ్లవచ్చు. నాన్ సర్టిఫైడ్ డైవర్స్ మాత్రం 40 అడుగులకు మించి లోతుకు వెళ్లకూడదు. ఈత రాకపోయినా ప్రొఫెషనల్స్ సహాయంతో స్కూబా డైవింగ్ చేయవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి
పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత
చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..
సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త
Read Latest Telangana News and National News