మంధాన, ప్రతిక శతక జోరు రికార్డుల హోరు
ABN , Publish Date - Jan 16 , 2025 | 06:31 AM
సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు స్మృతీ మంధాన (80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 135), ప్రతికా రావల్ (129 బంతుల్లో 20 ఫోర్లు, సిక్సర్‌తో 154) సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా పరుగులు వెల్లువెత్తాయి. రికార్డులపై రికార్డులు నమోదయ్యాయి...
ఆఖరి వన్డేలో 304 పరుగులతో భారత్ గెలుపు
0-3తో ఐర్లాండ్ చిత్తు
రాజ్‌కోట్: సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు స్మృతీ మంధాన (80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 135), ప్రతికా రావల్ (129 బంతుల్లో 20 ఫోర్లు, సిక్సర్‌తో 154) సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా పరుగులు వెల్లువెత్తాయి. రికార్డులపై రికార్డులు నమోదయ్యాయి. దాంతో భారత్‌తో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఐర్లాండ్ అమ్మాయిలు ఏకంగా 304 పరుగులతో చిత్తయ్యారు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను స్మృతి సేన 0-3తో దక్కించుకుంది. మొదట భారత్ 50 ఓవర్లలో 435/5 స్కోరు చేసింది. కీపర్ రిచా ఘోష్ (42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 59) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. ప్రెండెర్‌గాస్ట్ రెండు వికెట్లు పడగొట్టింది. అత్యంత భారీ లక్ష్య ఛేధనలో ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. సారా ఫోర్బెస్ (41), ప్రెండెర్‌గాస్ట్ (36) మాత్రమే భారత బౌలర్లను ఒకింత అడ్డుకున్నారు. దీప్తీ శర్మ మూడు, తనూజా కన్వర్ రెండు వికెట్లు కైవసం చేసుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీ్‌స’గా ప్రతికా రావల్ నిలిచింది.
ఎన్ని రికార్డులో ..
కెప్టెన్ మంధాన, ప్రతికా రావల్ సూపర్ షోతో మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది.
435/5.. భారత మహిళలు, పురుషుల జట్టుకు వన్డేలలో అత్యధిక స్కోరు. పురుషుల జట్టు అత్యధిక స్కోరు 418/5, 2011లో వెస్టిండీ్‌సపై ఇండోర్‌లో సాధించింది. ఇక మహిళల జట్టు గత అత్యధిక స్కోరు 370/5ను ఈ సిరీస్ రెండో వన్డేలో చేసింది.
304 పరుగుల తేడా.. వన్డేలలో భారత మహిళలకు అతి భారీ విజయం. 2017లో సౌతాఫ్రికాలో ఐర్లాండ్‌పైనే 248 రన్స్ గెలుపు గత అత్యుత్తమం.
మంధాన, రావల్ 233 పరుగుల భాగస్వామ్యం.. మహిళల వన్డేలలో భారత్ తరపున నాలుగో ద్విశతక భాగస్వామ్యం.
భారత ఓపెనర్లు ఇద్దరూ శతకాలు సాధించడం ఇది మూడోసారి. గతంలో రేష్మ, మిథాలి (1999, 258, ఐర్లాండ్‌పై), దీప్తీ శర్మ, పూనమ్ రౌత్ (2017, 320 పరుగులు, ఐర్లాండ్‌పై) ఈ ఫీట్ నమోదు చేశారు.
సంక్షిప్తస్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 435/5 (ప్రతిక 154, మంధాన 135, రిచా 59, తేజల్ 28, ప్రెండెర్‌గాస్ట్ 2/71). ఐర్లాండ్: 31.4 ఓవర్లలో 131 ఆలౌట్ (సారా 41, ప్రెండెర్‌గాస్ట్ 36, దీప్తి 3/27, కన్వర్ 2/31).
స్మృతీ మంధాన 70 బంతుల్లోనే..
స్మృతీ మంధాన 70 బంతుల్లోనే సెంచరీ చేసి అదరహో అనిపించింది. ఈ క్రమంలో ఆమె వన్డేల్లో వేగవంతమైన శతకం చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కింది. దీంతో నిరుడు దక్షిణాఫ్రికాపై హర్మన్‌ప్రీత్ చేసిన 87 బంతుల రికార్డు తుడిచి పెట్టుకుపోయింది.