Share News

ఒలింపిక్‌ చాంపియన్‌కు షాక్‌

ABN , Publish Date - Jan 16 , 2025 | 06:26 AM

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాలుగోరోజు కొందరు స్టార్లకు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో గతేడాది ఫైనలిస్టు, పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ కిన్వెన్‌ జెంగ్‌, ఆరో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ రెండో రౌండ్లోనే వెనుదిరిగారు...

ఒలింపిక్‌ చాంపియన్‌కు షాక్‌

  • కిన్వెన్‌ జెంగ్‌, రూడ్‌ అవుట్‌

  • ఫెడరర్‌ను దాటేసిన జొకో

  • అల్కారజ్‌ సబలెంక, ఒసాక, గాఫ్‌ ముందంజ

  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాలుగోరోజు కొందరు స్టార్లకు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో గతేడాది ఫైనలిస్టు, పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ కిన్వెన్‌ జెంగ్‌, ఆరో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ రెండో రౌండ్లోనే వెనుదిరిగారు. ఇక, 25వ గ్రాండ్‌స్లామ్‌ వేటలోనున్న నొవాక్‌ జొకోవిచ్‌ వరుసగా రెండో విజయంతో మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఏడో సీడ్‌ జొకోవిచ్‌ 6-1, 6-7(4), 6-3, 6-2తో పోర్చుగల్‌ క్వాలిఫయర్‌ జేమీ ఫరియాను ఓడించాడు. 37 ఏళ్ల జొకోవిచ్‌కు ఇది గ్రాండ్‌స్లామ్స్‌లో 430వ మ్యాచ్‌ కావడం విశేషం. ఈ క్రమంలో జొకో.. ఓపెన్‌ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లాడిన ఆటలాడిగా దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ (429) రికార్డును అధిగమించాడు.


దీంతో నొవాక్‌ గ్రాండ్‌స్లామ్స్‌లో తన గెలుపోటముల రికార్డును 379-51కి పెంచుకున్నాడు. మిగతా ఫేవరెట్‌ ఆటగాళ్లలో మూడో సీడ్‌ అల్కారజ్‌ 6-0, 6-1, 6-4తో నిషిఒకపై, రెండో సీడ్‌ జ్వెరేవ్‌ 6-1, 6-4, 6-1తో మార్టినెజ్‌పై, 12వ సీడ్‌ టామీ పాల్‌ 6-7(7), 6-0, 6-3, 6-1తో నిషికొరిపై, 15వ సీడ్‌ డ్రేపర్‌ 6-7(7), 6-3, 3-6, 7-5, 6-3తో కొకినాకి్‌సపై గెలిచి మూడో రౌండ్‌ చేరారు. ఆరో సీడ్‌, 2022 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనలిస్టు కాస్పర్‌ రూడ్‌ 2-6, 6-3, 1-6, 4-6తో జాకుబ్‌ మెన్సిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో కంగుతిన్నాడు. గతేడాది పారిస్‌ విశ్వక్రీడల్లో మహిళల విజేతగా నిలిచి రికార్డుకెక్కిన చైనా స్టార్‌, ఐదో సీడ్‌ కిన్వెన్‌ జెంగ్‌కు జర్మనీకి చెందిన 36 ఏళ్ల లారా సిగెమండ్‌ షాకిచ్చి సంచలనం సృష్టించింది. లారా 7-6(3), 6-3తో 22 ఏళ్ల జెంగ్‌ను చిత్తుచేసింది. మిగతా స్టార్‌ క్రీడాకారిణుల్లో టాప్‌ సీడ్‌ సబలెంక 6-3, 7-5తో బౌజా్‌సపై, మూడో సీడ్‌ గాఫ్‌ 6-3, 7-5తో బురేజ్‌పై, ఏడో సీడ్‌ పెగులా 6-4, 6-2తో మెర్టెన్స్‌పై, మాజీ నెంబర్‌వన్‌ నవోమి ఒసాక 1-6, 6-1, 6-3తో ముచోవాపై గెలిచి మూడో రౌండ్లో ప్రవేశించారు.


డబుల్స్‌లో భారత్‌కు నిరాశ: పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు రోహన్‌ బోపన్న, యుకీ భాంబ్రీలకు నిరాశ ఎదురైంది. ఆరంభ రౌండ్లో బోపన్న/నికోలస్‌ ద్వయం 5-7, 6-7(5)తో మార్టినెజ్‌/మునార్‌ జోడీ చేతిలో ఓడగా.. భాంబ్రీ/అల్బానో ఒలివెట్టి జోడీ 2-6, 6-7(7)తో ట్రిస్టన్‌/ఆడమ్‌ చేతిలో పరాజయం పాలైంది.

Updated Date - Jan 16 , 2025 | 06:26 AM