India vs Australia : మాటల తూటాలతో ముగిసె..
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:55 AM
ఆసీస్ తొలి రోజు ఆడింది కేవలం మూడు ఓవర్లే అయినా మైదానంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. శుక్రవారం ఆట ఆఖరి బంతికి ఓపెనర్ ఖవాజాను బుమ్రా అవుట్ చేశాడు. స్లిప్‌లో రాహుల్ క్యాచ్ తీసుకోవడంతో భారత
ఆసీస్ తొలి రోజు ఆడింది కేవలం మూడు ఓవర్లే అయినా మైదానంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. శుక్రవారం ఆట ఆఖరి బంతికి ఓపెనర్ ఖవాజాను బుమ్రా అవుట్ చేశాడు. స్లిప్‌లో రాహుల్ క్యాచ్ తీసుకోవడంతో భారత ఆటగాళ్లు ఒక్కసారిగా మరో టీనేజ్ ఓపెనర్ కాన్‌స్టా్‌స వైపు దూసుకువచ్చి కసిగా సంబరాలు చేసుకున్నారు. దీనికి కారణం.. ఆ బంతి వేయడానికి ముందు బుమ్రా, కాన్‌స్టా్‌స మధ్య జరిగిన వాగ్వాదమే. బుమ్రా బౌలింగ్ వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఓపెనర్ ఖవాజా కాస్త ఆగమన్నట్టు సైగ చేశాడు. దీంతో బుమ్రా ఏమైందంటూ రెండు చేతులు చాపి అసహనం వ్యక్తం చేశాడు. ఇంతలో నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న కాన్‌స్టా్‌స కలుగజేసుకున్నాడు. దీంతో సీరియస్ అయిన బుమ్రా ‘మధ్యలో నీకెందుకు?’ అన్నట్టుగా ముందుకు వచ్చాడు. అటు కాన్‌స్టా్‌స ఏమాత్రం తగ్గకుండా బుమ్రా వైపు రావడంతో అంపైర్ సర్దిచెప్పాడు. ఆ వెంటనే తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడి ఖవాజా అవుటయ్యాడు. అంతే.. ఎన్నడూ ప్రశాంతత కోల్పోని బుమ్రా ఒక్కసారిగా కాన్‌స్టా్‌స వైపు దూసుకువచ్చి సంబరాలు చేసుకున్నాడు. పెవిలియన్ వైపు వెళుతున్న కాన్‌స్టాస్‌ను ఆటగాళ్లు కూడా చుట్టుముట్టి సీరియ్‌సగా చూడడం కనిపించింది. బుమ్రాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.