బసవారెడ్డి భయపెట్టాడు!
ABN , Publish Date - Jan 14 , 2025 | 05:04 AM
తన ఆరాధ్య ఆటగాడు, పైగా అతడో దిగ్గజం..అలాంటి ప్రత్యర్థితో గ్రాండ్‌స్లామ్ అరంగేట్ర మ్యాచ్ అంటే ఎంతో ఉద్వేగం, ఉత్కంఠ ఉంటుంది..కానీ తెలుగు మూలాలున్న 19 ఏళ్ల అమెరికన్ నిషేష్ బసవారెడ్డి...
చెమటోడ్చిన జొకోవిచ్
సిన్నర్, స్వియటెక్ సునాయాసంగా..
ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్ : తన ఆరాధ్య ఆటగాడు, పైగా అతడో దిగ్గజం..అలాంటి ప్రత్యర్థితో గ్రాండ్‌స్లామ్ అరంగేట్ర మ్యాచ్ అంటే ఎంతో ఉద్వేగం, ఉత్కంఠ ఉంటుంది..కానీ తెలుగు మూలాలున్న 19 ఏళ్ల అమెరికన్ నిషేష్ బసవారెడ్డి ఆ ఒత్తిడి ఛాయలను ఏమాత్రం దరి చేరనివ్వలేదు..పైగా బెరుకులేని ఆటతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. తొలి సెట్ గెలిచి సవాలు విసిరాడు. ఫలితంగా మ్యాచ్ నాలుగు సెట్లపాటు సాగింది. దాంతో సోమవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ మొదటి రౌండ్‌ను అధిగమించేందుకు 10 సార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ పోరాడాల్సి వచ్చింది.
ఆల్‌రౌండ్ ఆటతో..: జొకోవిచ్‌తో బసవారెడ్డి మ్యాచ్‌ను టెన్నిస్ పండితులంతా ఏకపక్షమని తేల్చేశారు. కానీ అమెరికా కుర్రోడు ఏకంగా మూడు గంటలపాటు చూపిన తెగువ, పోరాట పటిమతో జొకో 4-6, 6-3, 6-4, 6-2తో కానీ మ్యాచ్ నెగ్గలేకపోయాడు. బలమైన సర్వీసులు, వేగవంతమైన ఏస్‌లు, తెలివైన షాట్లతో జొకోను ముప్పుతిప్పలు పెట్టిన నిషేష్ తొలి సెట్‌ను సొంతం చేసుకొని ప్రత్యర్థికి షాకిచ్చాడు. పదునైన ఆటతో రెండో సెట్ ఆరంభంలోనూ నొవాక్‌ను ఇబ్బందిపెట్టాడు. అయితే సర్వీస్ గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సెర్బియా స్టార్ రెండో సెట్ నెగ్గడం ద్వారా 1-1తో స్కోరు సమం చేశాడు. మూడో సెట్‌లో బసవారెడ్డి మళ్లీ పోరాడడంతో..ఈ సెట్‌ను దక్కించుకొనేందుకు జొకో శ్రమకోర్చాల్సి వచ్చింది. కీలకమైన నాలుగో సెట్‌లో తొలుత అనవసర తప్పిదాలు, డబుల్ ఫాల్ట్‌లతో నొవాక్ తడబాటుకు లోనైనా తేరుకొని..సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకొన్నాడు. గ్రాండ్‌స్లామ్ తొలి మ్యాచ్‌లో బసవారెడ్డి చూపిన ఆల్‌రౌండ్ ఆటకు ఫిదా అయిన ప్రేక్షకులు లేచి నిల్చొని చప్పట్లతో అతడికి వీడ్కోలు పలికారు.
పురుషుల ఇతర మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సిన్నర్ 7-6 (2), 7-6 (5), 6-1తో జారీపై, మూడో సీడ్ అల్కారజ్ 6-1, 7-5, 6-1తో షెవ్‌చెన్కోపై వరుస సెట్లలో గెలిచి ముందంజ వేశారు. 11వ సీడ్ సిట్సిపా్‌సకు 7-5, 6-3, 2-6, 6-4తో అమెరికాకు చెందిన అలెక్స్ మిచెల్సన్ ఝలకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో స్వియటెక్ 6-3, 6-4తో సినియకోవాని, మూడో సీడ్ గాఫ్ 6-3, 6-3తో సోఫియా కెనిన్‌ని, ఏడో సీడ్ పెగులా 6-3, 6-0తో మాయా జోయింట్‌ని, నవోమి ఒసాక 6-3, 3-6, 6-3తో గార్షియాని ఒడించి రెండో రౌండ్‌కు చేరారు.