టాప్‌లోనే బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్
ABN , Publish Date - Jan 09 , 2025 | 02:12 AM
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా మొత్తం 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు...
దుబాయ్: స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా మొత్తం 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన చివరి, ఐదో టెస్ట్‌కు ముందు 907 పాయింట్లతో నెంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న బుమ్రా... ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసి మరో పాయింట్‌ను పెంచుకున్నాడు. ఇక, స్పిన్నర్ రవీంద్ర జడేజా, బోలాండ్‌తో కలిసి సంయుక్తంగా 9వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు దీంతో బుమ్రా తర్వాత భారత్ నుంచి టాప్-10లో ఉన్న బౌలర్‌గా జడ్డూ నిలిచాడు. ఆసీస్ సారథి కమిన్స్ రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. బ్యాటర్ల జాబితాలో పంత్ మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్‌లో, యశస్వీ జైస్వాల్ 4వ స్థానంలో ఉన్నారు. జో రూట్ నెంబర్‌వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
బంగారు బాతును చంపుకోవద్దు
బుమ్రాకు కెప్టెన్సీపై కైఫ్ హితవు
ముంబై: బుమ్రాకు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించడంపై బీసీసీఐ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించాడు. ఇటీవలి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో తొలి, ఆఖరి టెస్టులకు బుమ్రా సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా..రోహిత్ టెస్ట్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్న క్రమంలో బుమ్రాకే పూర్తిస్థాయి నాయకత్వం అప్పజెపుతారంటూ వార్తలొస్తున్నాయి. ఈనేపథ్యంలో కైఫ్ స్పందిస్తూ కెప్టెన్సీ బుమ్రాపై అదనపు ఒత్తిడి తెస్తుందన్నాడు. అందువల్ల అతడిని పూర్తిస్థాయి సారథిగా నియమించడం ద్వారా బంగారు బాతును చంపుకోవద్దని బోర్డుకు హితవు పలికాడు.