పారిస్ పతకాల నాణ్యతపై విమర్శలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 06:23 AM
పారిస్ ఒలింపిక్స్‌లో విజేతలకు అందించిన పతకాలు నాసిరకంగా ఉన్నాయంటూ అథ్లెట్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది పారిస్ క్రీడల్లో రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన పిస్టల్ షూటర్...
నాసిరకంగా ఉన్నాయన్న భాకర్, అమన్
కొత్తవి ఇస్తామన్న ఐఓసీ
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో విజేతలకు అందించిన పతకాలు నాసిరకంగా ఉన్నాయంటూ అథ్లెట్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది పారిస్ క్రీడల్లో రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన పిస్టల్ షూటర్ మనూ భాకర్, కంచు మోత మోగించిన యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అథ్లెట్లు పతకాల నాణ్యతపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘కాంస్య పతకంపైనున్న పూత తొలగిపోతోంది. ఒలింపిక్స్‌లో దక్కిన పతకంలా ఇది అనిపించడం లేదు’ అని భాకర్ పేర్కొంది. తన పతకం కూడా నాణ్యమైనదిగా లేదని రెజ్లర్ అమన్ వ్యాఖ్యానించాడు. మరో ఇద్దరు షూటర్లు స్వప్నిల్, సరబ్‌జోత్‌ల పతకాలు కూడా మసకబారినట్టు సమాచారం. కాగా, పతకాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా 100 మంది దాకా అథ్లెట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి వెనక్కిచ్చినట్టు తెలుస్తోంది. పతకాల నాణ్యతపై విమర్శలు వస్తుండడంతో ఐఓసీ స్పందించింది. వీటి స్థానంలో కొత్తవి అందజేస్తామని ప్రకటించింది.