గంభీర్‌కు గండం
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:14 AM
కొన్నేళ్లుగా భారత క్రికెట్‌కు మూలస్తంభాలుగా ఉన్న రోహిత్ శర్మ, కోహ్లీ త్వరలో రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. భారత జట్టు సంధి దశలో ఉన్న కీలక సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్, సహాయ సిబ్బంది...
గంభీర్‌కు గండం
కొందరు ఆటగాళ్ల అసంతృప్తి
నిశితంగా పరిశీలిస్తున్న భారత బోర్డు
కోచ్‌పై సన్నగిల్లుతున్న నమ్మకం?
సిడ్నీ: కొన్నేళ్లుగా భారత క్రికెట్‌కు మూలస్తంభాలుగా ఉన్న రోహిత్ శర్మ, కోహ్లీ త్వరలో రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. భారత జట్టు సంధి దశలో ఉన్న కీలక సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్, సహాయ సిబ్బంది భవిష్యత్ సవాళ్లకు తగినట్టుగా టీమిండియాను ఎలా నడిపిస్తారనేది ప్రసుత్తం హాట్ టాపిక్‌గామారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీ్‌సలో సమతుల్యమైన జట్టును ఎంపిక చేయడం సంక్లిష్టంగా మారింది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే సిడ్నీలో జరిగే ఐదో టెస్ట్‌లో భారత్ నెగ్గి తీరాల్సిందే. కాగా, వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అనిశ్చితి నెలకొందనే టాక్ రోజురోజుకూ పెరుగుతోంది. జట్టులోకి ఎక్కువ మంది ప్లేయర్లతో గంభీర్‌కు శ్రుతి కుదరడం లేదనే ప్రచారం సాగుతోంది. రవిశాస్త్రి, ద్రవిడ్ తరహాలో ఆటగాళ్లతో సమాచార మార్పిడి సజావుగా జరగడం లేదనేది ప్రముఖంగా వినిపిస్తున్న ఆరోపణ. సీనియర్లు కాకుండా.. ఈ మధ్య కాలంలో జట్టులో చోటును సుస్థిరం చేసుకొన్న కొందరు క్రికెటర్లు గౌతీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
అలా జరిగితే.. ఉద్వాసనే?
‘మరో టెస్ట్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్. టీమిండియా ప్రదర్శన మెరుగుపడకపోతే మాత్రం కోచ్‌గా గంభీర్ పోస్టు ప్రమాదంలో పడినట్టేన’ని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు ప్రయోగాలు చేస్తుండడంతో జట్టులోని ఆటగాళ్లు కూడా అభద్రతా భావానికి లోనవుతున్నారని తెలుస్తోంది. బీసీసీఐలో ఖాళీ అయిన పదవులు భర్తీ అయిన తర్వాత.. భారత జట్టుపై కొన్ని నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు ప్రదర్శన మెరుగుపడకపోతే మాత్రం గంభీర్‌కు ఉద్వాసన తప్పదని అంటున్నారు. ‘గౌతీ ఎప్పుడూ మా మొదటి ప్రాధాన్యం కాదు. ఆ లిస్ట్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ముందున్నాడు. దీంతో కొంత రాజీపడి, తప్పని పరిస్థితుల్లో అతడి నియామకం చేయాల్సి వచ్చింద’ని ఆ అధికారి చెప్పారు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వా్‌షకు గురైనప్పుడే గౌతీని నిలదీశారు. ఇక ఈ సిరీస్‌లో కోహ్లీ వరుస వైఫల్యాలకు గౌతీ ఏదైనా సమాధానం వెతకగలడా? అనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి ఎదురవుతోంది. అంతేకాకుండా ఓ సహాయ కోచ్‌కు చెందిన సహాయకుడు ఫ్రాంచైజీ జెర్సీలో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లే ఏరియాలోకి రావడంతోపాటు బీసీసీఐకు కేటాయించిన బాక్స్‌లో కనిపించడంపై కూడా బోర్డు పెద్దలు ఆరాతీస్తున్నట్టు సమాచారం.
ప్రశ్నించనున్న
బీసీసీఐ
సిరీస్ మధ్యలో అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంపై రోహిత్, గౌతీని బీసీసీఐ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అవమానాలు తట్టుకోలేకే అశ్విన్ వెళ్లిపోయాడన్న ఊహాగానాలు ఉన్నాయి.
చేసింది ఇక చాలు..
నాలుగో టెస్ట్ ఓడిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన ఆటగాళ్లపై గంభీర్ ఫైర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ‘ఇక...చేసింది చాలు’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఓ చానెల్ తెలిపింది. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడకుండా.. తమ సహజ శైలిలో ఆడితే ఎలా? అని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొత్తంగా గౌతీ వ్యూహాలకు.. మైదానంలో వారు ఆడే తీరుకు పొంతన లేదని అంటున్నారు. ఒకరకంగా అందరినీ గౌతీ ఘాటుగానే హెచ్చరించాడని సమాచారం. చటేశ్వర్ పుజారను జట్టులోకి తీసుకోవాలని కూడా గంభీర్ ప్రతిపాదించినా.. సెలెక్టర్లు ఒప్పుకోలేదట.