Share News

Badminton : సెమీస్‌కు గాయత్రి జోడీ

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:09 AM

డబుల్స్‌ స్టార్‌ జోడీ పుల్లెల గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా దూసుకెళుతోంది.

  Badminton : సెమీస్‌కు  గాయత్రి జోడీ

  • రెండో ర్యాంకర్‌కు శంకర్‌ షాక్‌ జూ స్విస్‌ ఓపెన్‌

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): డబుల్స్‌ స్టార్‌ జోడీ పుల్లెల గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా దూసుకెళుతోంది. ఈ ఏస్‌ జంట మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్‌ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 4వ సీడ్‌ గాయత్రి/ట్రీసా ద్వయం 21-18, 21-14తో హాంకాంగ్‌ జంట యంగ్‌ గా టింగ్‌/యంగ్‌ పూ లామ్‌పై గెలిచింది. ఫైనల్లో చోటుకోసం చైనాకు చెందిన టాప్‌సీడ్‌ ద్వయం లూ షెంగ్‌ షు/టాన్‌ నింగ్‌తో గాయత్రి జోడీ తలపడనుంది. ఇక, పురుషుల సింగిల్స్‌లో భారత యువ షట్లర్‌ శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్‌ తన కెరీర్‌లోనే తొలిసారిగా సంచలనాత్మక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల శంకర్‌ 18-21, 21-12, 21-5తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేత, ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)ను కంగుతినిపించి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు.


గంటకుపైగా సాగిన హోరాహోరీ పోరులో ఆరంభ గేమ్‌ను కోల్పోయిన శంకర్‌.. అద్భుతంగా పుంజుకొని తర్వాతి రెండు గేముల్లో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాడు. సెమీఫైనల్‌ బెర్త్‌ కోసం ఫ్రాన్స్‌కు చెందిన 31వ ర్యాంకర్‌ క్రిస్టో పొపోవ్‌తో శంకర్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇక, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో భారత జోడీ ఆద్య/సతీశ్‌14-21, 16-21తో చైనీస్‌ తైపీ జంట లూ కువాంగ్‌ హెంగ్‌/జెంగ్‌ యూ చీ చేతిలో ఓటమిపాలై ఇంటిబాట పట్టింది.

Updated Date - Mar 22 , 2025 | 03:11 AM