Share News

IPL 2025, DC vs RR: ఢిల్లీ సూపర్ విక్టరీ.. సూపర్ ఓవర్లో రాజస్తాన్ ఓటమి

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:54 PM

క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజా అందింది. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతను సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు. సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్‌ విజేతను నిర్ణయించడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలిచింది.

IPL 2025, DC vs RR: ఢిల్లీ సూపర్ విక్టరీ.. సూపర్ ఓవర్లో రాజస్తాన్ ఓటమి
Mitchell Starc

క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజా అందింది. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతను సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు. సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్‌ విజేతను నిర్ణయించడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. ఈ విజయంలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్‌ది కీలక పాత్ర. రాజస్తాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లోనూ, సూపర్ ఓవర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. సూపర్ ఓవర్లో తడబడిన రాజస్తాన్ టీమ్ పరాజయం పాలైంది.


ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలో పరుగులు చేయడం కష్టమైంది. అయితే అభిషేక్ పోరెల్ (49) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (38) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (34), అక్షర్ పటేల్ (34) కీలక పరుగులు చేశారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు. తీక్షణ, హసరంగ ఒక్కో వికెట్ తీశారు.


189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్ల సంజూ శాంసన్ (31 రిటైర్డ్ హర్ట్), యశస్వి జైస్వాల్ (51) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. గాయం కారణంగా శాంసన్ పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ (8) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా (51) కీలక హాఫ్ సెంచరీ చేశాడు. రాణా అవుట్ తర్వాత ధ్రువ్ జురెల్ (26) చివరి వరకు క్రీజులో నిలిచి రాజస్తాన్‌కు అవసరమైన పరుగులు చేశాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన దశలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.


కాగా, సూపర్ ఓవర్లో ఢిల్లీ తరపున మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేశాడు. నాలుగు బంతులు మాత్రమే ఆడిన రాజస్తాన్ 11 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోతే తర్వాత ఆడేందుకు ఉండదు. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం నాలుగు బంతుల్లోనే టార్గెట్‌కు చేరుకుంది. కేఎల్ రాహుల్ (7), స్టబ్స్ (6) రాణించారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2025 | 11:54 PM