Share News

IPL 2025 SRH VS MI: ముంబైతో సన్‌రైజర్స్ ఢీ.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:10 PM

ఆరంభంలో పరాజయాలతో ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్ తరువాత పుంజుకుని విజయాల బాట పట్టింది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

IPL 2025 SRH VS MI: ముంబైతో సన్‌రైజర్స్ ఢీ.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
SRH VS MI

వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ ఈ రోజు మరో కీలక మ్యాచ్‌కు రెడీ అవుతోంది. హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ టీమ్‌తో తలపడుతోంది (SRH vs MI). ఆరంభంలో పరాజయాలతో ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్ తరువాత పుంజుకుని విజయాల బాట పట్టింది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది (IPL 2025).


మరోవైపు ఈ సీజన్‌ను భారీ విజయంతో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడింది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ విజయాలు సాధించాల్సిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ప్రధాన బలం. వారు విఫలమైతే జట్టు మొత్తం బలహీనంగా మారుతోంది. వారు రాణించిన రెండు మ్యాచ్‌ల్లోనే సన్‌రైజర్స్ విజయం సాధించింది.


మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసేన్ వంటి బ్యాటర్లు ఉన్నప్పటికీ వారు వరుసగా విఫలమవుతున్నారు. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే బౌలింగ్ కాస్త బలంగా కనిపిస్తోంది. ప్యాట్ కమిన్స్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్‌తో కూడిన బౌలింగ్ విభాగం పరుగులు కట్టడి చేస్తోంది. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా రాకతో ముంబై టీమ్ బలపడింది. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను ఎదుర్కొని పరుగులు చేయడం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలుగా మారుతోంది. ఇక, రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడం ముంబైకు కొండంత బలం ఇస్తోంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కూడా పరుగులు చేస్తున్నారు.


తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్

ముంబై ఇండియన్స్ (అంచనా): రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, శాంట్నర్, దీపక్ ఛాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2025 | 05:10 PM