Share News

Test Match : సిడ్నీ సమరం రసవత్తరం!

ABN , Publish Date - Jan 05 , 2025 | 06:14 AM

ఒకవైపు డాషింగ్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) ధనాధన్‌ అర్ధ శతకంతో సత్తా చాటితే.. మరోవైపు బొలాండ్‌ (4/42) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో టాపార్డర్‌ను దెబ్బ కొట్టాడు.

Test Match : సిడ్నీ సమరం రసవత్తరం!

ఉత్కంఠగా ఐదో టెస్ట్‌

పంత్‌ దూకుడు

బొలాండ్‌ నిప్పులు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 141/6

ప్రస్తుత ఆధిక్యం 145

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌181 ఆలౌట్‌

సిడ్నీ: ఒకవైపు డాషింగ్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) ధనాధన్‌ అర్ధ శతకంతో సత్తా చాటితే.. మరోవైపు బొలాండ్‌ (4/42) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో టాపార్డర్‌ను దెబ్బ కొట్టాడు. ఫలితంగా ఆఖరిదైన ఐదో టెస్ట్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత్‌ శనివారం ఆట ముగిసేసరికి 141/6 స్కోరు చేసింది. జడేజా (8), వాషింగ్టన్‌ సుందర్‌ (6) క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్‌ (22), రాహుల్‌ (13), గిల్‌ (13), కోహ్లీ (6) పెవిలియన్‌ చేరారు. మొత్తంగా టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్‌ బుమ్రా ఫిట్‌నె్‌సపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. భారత్‌ వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇక జట్టుకు గెలవగలిగే స్కోరును అందించే బాధ్యత జడ్డూ-సుందర్‌ జోడీపైనే. ఇక, ఆటకు రెండోరోజు ఓవర్‌నైట్‌ స్కోరు 9/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 181 పరుగుల ఆలౌటైంది. వెబ్‌స్టర్‌ (57), స్మిత్‌ (33) రాణించారు. ప్రసిద్ధ్‌ కృష్ణ, సిరాజ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, నితీశ్‌ రెండేసి వికెట్లు తీశారు. కాగా, వెన్నునొప్పితో బుమ్రా మైదానం వీడడంతో కోహ్లీ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ సమయంలో కృష్ణ, నితీశ్‌.. బుమ్రా లేని లోటు కనిపించకుండా చేయడంతోపాటు 4 పరుగుల ఆధిక్యాన్ని అందించి జట్టు నైతిక స్థైర్యాన్ని పెంచారు. మొత్తంగా రెండో రోజు ఆటలో 314 పరుగులు నమోదవగా.. 15 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 185 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

బుమ్రా లేకపోయినా.: తొలి రెండు సెషన్లపాటు బ్యాటింగ్‌ చేసిన ఆసీ్‌సకు ఆధిక్యం దక్కకుండా భారత బౌలర్లు సమర్థంగానే నిలువరించారు. ఆరంభంలోనే లబుషేన్‌ (2)ను క్యాచవుట్‌ చేసిన బుమ్రా ఆసీస్‌ పతకానికి నాంది పలికాడు. మరోవైపు పిచ్‌ నుంచి స్వింగ్‌ లభించడంతో సిరాజ్‌ ఒక్కసారిగా ఆసీస్‌ బ్యాటర్లను భయపెట్టాడు. 12వ ఓవర్‌లో ఓపెనర్‌ కాన్‌స్టా్‌స (23), హెడ్‌ (4)ను అవుట్‌ చేసి షాకిచ్చాడు. 39/4తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్మిత్‌, వెబ్‌స్టర్‌ ఐదో వికెట్‌ 57 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, లంచ్‌కు ముందు స్మిత్‌ను కృష్ణ క్యాచవుట్‌ చేయడంతో ఆసీస్‌ 101/5తో నిలిచింది. అలెక్స్‌ క్యారీ (21), వెబ్‌స్టర్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ, వీరిద్దరినీ కూడా వెనక్కుపంపిన కృష్ణ ఆసీ్‌సకు పగ్గాలేశాడు. కమిన్స్‌ (10), స్టార్క్‌ (1)ను నితీశ్‌ పెవిలియన్‌ చేర్చగా.. బొలాండ్‌ (9)ను బౌల్డ్‌ చేసిన సిరాజ్‌ కంగారూల ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

టాప్‌ తడబాటు..: చివరి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత జట్టుకు పంత్‌ ఆటే హైలైట్‌. ఓపెనర్లు జైస్వాల్‌, రాహుల్‌ తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యంతో దూకుడైన ఆరంభాన్నిచ్చారు. అయితే, 5 పరుగుల తేడాతో వీరిద్దరినీ బొలాండ్‌ బౌల్డ్‌ చేయడంతో టీమిండియా తడబడింది. బొలాండ్‌ బౌలింగ్‌లో కోహ్లీ ఆఫ్‌స్టం్‌పపై పడిన బంతిని ఆడి స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. విరాట్‌ ఇలా అవుటవడం వరుసగా ఎనిమిదోసారి. క్రీజులో కుదురుకొంటున్న గిల్‌ను వెబ్‌స్టర్‌ వెనక్కిపంపాడు. 78/4తో టాపార్డర్‌ను కోల్పోయి ఇబ్బందుల్లోపడ్డ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌ టీ20 తరహా ఆటతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలచి వావ్‌ అనిపించాడు. తన సహజ శైలిలో విరుచుకుపడ్డ రిషభ్‌.. ఆసీస్‌ బౌలర్లను ఆత్మరక్షణలోకి నెట్టాడు. వెబ్‌స్టర్‌ బౌలింగ్‌లో మూడు వరుస బౌండ్రీలతో జోష్‌ నింపిన పంత్‌.. స్టార్క్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. ఆ వెంటనే మరో సిక్స్‌ బాదాడు. అయితే, కమిన్స్‌ బౌలింగ్‌లో దూరంగా వెళ్లే బంతిని వెంటాడి అవుటయ్యాడు. నితీశ్‌ (4) మరోసారి నిరాశపర్చాడు.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 185 ఆలౌట్‌.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: కాన్‌స్టా్‌స (సి) జైస్వాల్‌ (బి) సిరాజ్‌ 23, ఖవాజా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 2, లబుషేన్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 2, స్మిత్‌ (సి) రాహుల్‌ (బి) ప్రసిద్ధ్‌ 33, హెడ్‌ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 4, వెబ్‌స్టర్‌ (సి) జైస్వాల్‌ (బి) ప్రసిద్ధ్‌ 57, క్యారీ (బి) ప్రసిద్ధ్‌ 21, కమిన్స్‌ (సి) కోహ్లీ (బి) నితీశ్‌ 10, స్టార్క్‌ (సి) రాహుల్‌ (బి) నితీశ్‌ 1, లియోన్‌ (నాటౌట్‌) 7, బొలాండ్‌ (బి) సిరాజ్‌ 9; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 51 ఓవర్లలో 181 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-9, 2-15, 3-35, 4-39, 5-96, 6-137, 7-162, 8-164, 9-166, 10-181; బౌలింగ్‌: బుమ్రా 10-1-33-2, సిరాజ్‌ 16-2-51-3, ప్రసిద్ధ్‌ కృష్ణ 15-3-42-3, నితీశ్‌ కుమార్‌ 7-0-32-2, జడేజా 3-0-12-0.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) బొలాండ్‌ 22, రాహుల్‌ (బి) బొలాండ్‌ 13, గిల్‌ (సి) క్యారీ (బి) వెబ్‌స్టర్‌ 13, కోహ్లీ (సి) స్మిత్‌ (బి) బొలాండ్‌ 6, పంత్‌ (సి) క్యారీ (బి) కమిన్స్‌ 61, జడేజా (బ్యాటింగ్‌) 8, నితీశ్‌ (సి) కమిన్స్‌ (బి) బొలాండ్‌ 4, సుందర్‌ (బ్యాటింగ్‌) 6; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 32 ఓవర్లలో 141/6; వికెట్లపతనం: 1-42, 2-47, 3-59, 4-78, 5-124, 6-129; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-36-0, కమిన్స్‌ 11-4-31-1, బొలాండ్‌ 13-3-42-4, వెబ్‌స్టర్‌ 4-1-24-1.

148 ఏళ్లలో ఒకే ఒక్కడు

ఆసీస్‌ గడ్డపై వేగవంతమైన అర్ధ శతకం చేసిన విదేశీ బ్యాటర్‌గా రిషభ్‌ పంత్‌ చరిత్ర సృష్టించాడు. దూకుడుగా ఆడిన పంత్‌ 29 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్‌ చేరుకొన్నాడు. ఈ క్రమంలో 148 ఏళ్ల ఆసీస్‌ టెస్ట్‌ చరిత్రలో ఇక్కడ 30 బంతుల్లోపే హాఫ్‌ సెంచరీ చేసిన పర్యాటక జట్టు ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు జాన్‌ బ్రౌన్‌ (1895), విండీస్‌ మాజీ క్రికెటర్‌ రాయ్‌ ఫ్రెడిరిక్‌ (1975) 33 బంతుల్లోనే చేసిన అర్ధ సెంచరీ రికార్డులను పంత్‌ బద్దలుకొట్టాడు. టెస్టుల్లో వేగవంతమైన ఫిఫ్టీ చేసిన రెండో భారత బ్యాటర్‌గానూ నిలిచాడు.

Updated Date - Jan 05 , 2025 | 06:14 AM