Robin Uthappa : కోహ్లీ వల్లే యువీ వీడ్కోలు
ABN , Publish Date - Jan 11 , 2025 | 05:33 AM
భారత క్రికెట్‌లో మునుపెన్నడూ లేని రీతిలో ఆటగాళ్లపై మాజీలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అటు కోచ్ గంభీర్‌పై మనోజ్ తివారీ విరుచుకుపడుతుండగా..
రాబిన్ ఊతప్ప
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో మునుపెన్నడూ లేని రీతిలో ఆటగాళ్లపై మాజీలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అటు కోచ్ గంభీర్‌పై మనోజ్ తివారీ విరుచుకుపడుతుండగా.. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై రాబిన్ ఊతప్ప ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతడి వల్లే యువరాజ్ సింగ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసిందని ఆరోపించాడు. ‘క్యాన్సర్‌ను జయించి తిరిగి క్రికెట్ ఆడిన యువీ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. భారత్‌కు రెండు వరల్డ్‌క్‌పలు అందించడంలో కీలకపాత్ర పోషించాడు. కానీ అలాంటి ప్లేయర్‌కు అప్పటి కెప్టెన్ కోహ్లీ నుంచి ఎలాంటి మద్దతూ లభించలేదు. యువీ పడిన కష్టం కోహ్లీకి బాగా తెలుసు. అలాంటిది తన ప్రమాణాలకు సరితూగడం లేదనే సాకుతో యువీని పక్కనబెట్టాడు. అందరూ విరాట్‌లాగే ఫిట్‌గా ఉండాలంటే ఎలా? తన కోసం ఫిట్‌నెస్ టెస్టులో రెండు పాయింట్లు తగ్గించాలని యువీ కోరినా విరాట్ ఒప్పుకోలేదు. ఇందులో తొలుత విఫలమైనా ఆ తర్వాత కష్టపడి జట్టులోకి వచ్చాడు. కానీ చాంపియన్స్ ట్రోఫీలో సరిగా ఆడలేదని యువరాజ్‌ను పక్కకు తప్పించారు. దీంతో అతడు క్రికెట్‌కే వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నాడు’ అని ఊతప్ప వివరించాడు.