క్రీడా రత్నాలు గుకేష్, మను
ABN , Publish Date - Jan 03 , 2025 | 06:08 AM
చెస్ వరల్డ్ చాంపియన్ గుకేష్, డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌లను ప్రతిష్ఠాత్మక ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డులు వరించాయి. 2024కు సంబంధించిన క్రీడా పురస్కారాల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం....
నలుగురికి ఖేల్‌రత్న ఫ జ్యోతి, దీప్తికి అర్జున
జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన
న్యూఢిల్లీ: చెస్ వరల్డ్ చాంపియన్ గుకేష్, డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌లను ప్రతిష్ఠాత్మక ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డులు వరించాయి. 2024కు సంబంధించిన క్రీడా పురస్కారాల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నకు నలుగురిని, అర్జున అవార్డుకు 32 మందిని ఎంపిక చేశారు. గుకేష్, మనుతోపాటు భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లు కూడా ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు. కాగా, తెలుగు అథ్లెట్లు జ్యోతి యర్రాజి, దీప్తి జీవాంజిలకు అర్జున దక్కాయి. ఈసారి అర్జునకు ఎంపికైన వారిలో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం విశేషం. వీరిలో ఎక్కువ మంది పారిస్ పారాలింపిక్స్‌లో అదరగొట్టినవారే. ముగ్గురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఖేల్‌రత్న విజేతలకు జ్ఞాపికతోపాటు రూ. 25 లక్షలు, అర్జున అవార్డీలకు రూ. 15 లక్షలతోపాటు అర్జునుడి ప్రతిమను బహూకరించనున్నారు.
చెస్ చిన్నోడికి అనూహ్యంగా..
ఊహించని రీతిలో గుకే్‌షకు ఖేల్‌రత్న అవార్డు దక్కింది. 18 ఏళ్ల వయసులోనే చెస్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. ఇటీవలే జరిగిన పోరులో డిఫెండింగ్ చాంప్ డింగ్ లిరెన్‌ను ఓడించిన గుకేష్ చెస్ రారాజు కిరీటాన్ని అందుకొన్నాడు. చెస్ ఒలింపియాడ్‌లోనూ దేశానికి చారిత్రక స్వర్ణం అందించడంలోనూ గుకేష్ కీలకపాత్ర పోషించాడు.
పారి్‌స స్టార్లకు పెద్దపీట
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా 22 ఏళ్ల మను భాకర్ రికార్డు సృష్టించింది. పారిస్ క్రీడల్లో 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ విభాగాల్లో మను కాంస్య పతకాలు సొంతం చేసుకొంది. అయితే, కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చిన జాబితాలో మను పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. కానీ, ఆ తర్వాత మంత్రిత్వశాఖ జోక్యంతో అంతా సద్దుమణిగింది. కాగా, హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత పురుషుల హాకీ జట్టు విశ్వక్రీడల్లో వరుసగా రెండో కాంస్యం సాధించింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ టీ-64 విభాగంలో ప్రవీణ్ స్వర్ణం కొల్లగొట్టగా.. 400 మీ. రేస్‌లో టీ20 విభాగంలో తెలంగాణ అమ్మాయి దీప్తి కాంస్యం అందుకొంది. ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌కు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన జ్యోతి రికార్డు నెలకొల్పింది. పారిస్ బరిలో నిలిచిన ఆమె సెమీ్‌సకు అర్హత సాధించలేక పోయింది.
క్రీడా అవార్డుల జాబితా ఇదిగో..
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న
గుకేష్ (చెస్)
మను భాకర్ (షూటింగ్)
హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్)
అర్జున
జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్)
అన్నూ రాణి (అథ్లెటిక్స్)
నీతూ (బాక్సింగ్)
సవీటి బోరా (బాక్సింగ్)
వంతిక అగర్వాల్ (చెస్)
సలీమా టెటే (హాకీ)
అభిషేక్ (హాకీ)
సంజయ్ (హాకీ)
జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
సుఖ్‌జీత్ సింగ్ (హాకీ)
స్వప్నిల్ సురేష్ కుశాలే (షూటింగ్)
సరభ్‌జోత్ సింగ్ (షూటింగ్)
అభయ్ సింగ్ (స్క్వాష్)
సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)
అమన్ (రెజ్లింగ్)
రాకేశ్ కుమార్ (పారా ఆర్చర్)
ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్)
దీప్తి జీవాంజి (పారా అథ్లెటిక్స్)
అజీత్ సింగ్ (పారా అథ్లెటిక్స్)
సచిన్ సర్జేరావు ఖిలారా (పారా అథ్లెటిక్స్)
ధరమ్‌బిర్ (పారా అథ్లెటిక్స్)
ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్)
హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్)
సిమ్రన్ (పారా అథ్లెటిక్స్)
నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్)
నితీశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)
తులసీమతి మురుగేశన్
(పారా బ్యాడ్మింటన్)
నిత్యశ్రీ సుమతి శివన్
(పారా బ్యాడ్మింటన్)
మనీషా రాందాస్ (పారా బ్యాడ్మింటన్)
కపిల్ పర్మార్ (పారా జూడో)
మోనా అగర్వాల్ (పారా షూటింగ్)
రూబినా ఫ్రాన్సిస్ (పారా బ్యాడ్మింటన్)
అర్జున అవార్డులు (లైఫ్‌టైమ్)
సుచా సింగ్ (అథ్లెటిక్స్)
మురళీకాంత్ రాజారామ్ పెట్కర్
(పారా స్విమ్మింగ్)
ద్రోణాచార్య అవార్డులు (కోచ్‌లు)
సుభాష్ రాణా (పారా షూటింగ్)
దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్)
సందీప్ సంగ్వాన్ (హాకీ)
రేవంత్‌రెడ్డి అభినందన
అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ క్రీడాకారులు అత్యున్నత స్థాయిలో మరింత రాణించాలని ఆయన ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా దీప్తిని ప్రశంసించారు. ఇంకా వరంగల్ జిల్లాకు చెందిన దీప్తికి అర్జున అవార్డు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి కొండా సురేఖ అన్నారు.