Share News

రాయుడి కెరీర్‌కు విలన్‌.. విరాట్‌!

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:13 AM

వరల్డ్‌క్‌పలో ఆడాలనేది ఏ ఆటగాడికైనా జీవిత కల. తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడుకు ఆ అవకాశం అందినట్టే అంది చేజారింది. అయితే, 2019 వరల్డ్‌కప్‌ జట్టులో రాయుడుకు చోటు దక్కకపోవడానికి కోహ్లీనే....

రాయుడి కెరీర్‌కు విలన్‌.. విరాట్‌!

వరల్డ్‌క్‌పలో చోటు దక్కకుండా అడ్డుకొన్నాడు

బాంబు పేల్చిన ఊతప్ప

కోహ్లీ కంటే రోహిత్‌ గొప్ప కెప్టెన్‌

న్యూఢిల్లీ: వరల్డ్‌క్‌పలో ఆడాలనేది ఏ ఆటగాడికైనా జీవిత కల. తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడుకు ఆ అవకాశం అందినట్టే అంది చేజారింది. అయితే, 2019 వరల్డ్‌కప్‌ జట్టులో రాయుడుకు చోటు దక్కకపోవడానికి కోహ్లీనే కారణమని టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప బాంబు పేల్చాడు. విరాట్‌కు ఎవరైనా నచ్చకపోతే.. ఇక అంతేనంటూ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బహిర్గతం చేశాడు. రాయుడు ఇంటికి జెర్సీలు, కిట్‌బ్యాట్‌లు కూడా చేరాయని తెలిపాడు. ‘ కోహ్లీ ఎవరినైనా వద్దనుకొంటే ఇక వారి కెరీర్‌ నాశనమే. అందుకు రాయుడే ప్రత్యక్ష ఉదాహరణ. అతనికి జరిగిన దానికి సానుభూతి తెలపాలి. వరల్డ్‌ కప్‌ జెర్సీలు, కిట్‌ బ్యాగులు కూడా రాయుడు ఇంటికి చేరాయంటే టీమ్‌లో చోటు ఖాయమనేగా. అలాంటి సమయంలో జట్టులో చోటు లేదంటే ఏఆటగాడైనా ఎలా తట్టుకోగలడు. ఇలా మరొకరికి ఎప్పుడూ జరగకూడదు. ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడ’ని ఊతప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. 2019 వరల్డ్‌కప్‌ టీమ్‌ ఎంపిక ముందు డ్రామా చోటు చేసుకొంది.


రాయుడుకి జట్టులో చోటు ఖాయమని అందరూ భావిస్తుండగా.. హఠాత్తుగా విజయ్‌ శంకర్‌ను టీమ్‌లోకి తీసుకొన్నారు. దీనిపై అంబటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, రాయుడుకి టీమ్‌లో స్థానం లభించకపోవడానికి అప్పటి చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కారణమన్న విమర్శలు కూడా వచ్చాయి. కానీ, అసలు విలన్‌ కోహ్లీ అని ఊతప్ప ఇప్పుడు బయటపెట్టాడు. అప్పట్లో ఎమ్మెస్కే కూడా ఈ విషయమై మాట్లాడాడు. జట్టు ఎంపికలో తానొక్కడినే ఉండనని, మిగతా సెలెక్టర్లతోపాటు జట్టు కెప్టెన్‌ కూడా తన అభిప్రాయాన్ని చెబుతాడని ప్రసాద్‌ వెల్లడించాడు.


కెప్టెన్సీ విషయంలో కోహ్లీకి, రోహిత్‌ శర్మకు మధ్య తేడాని కూడా విడమర్చి చెప్పాడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో సంజూ శాంసన్‌కు తుదిజట్టులో చోటు పక్కా అని అనుకున్నారు. కానీ, టాస్‌కు 10 నిమిషాల ముందు శివమ్‌ దూబేను జట్టులోకి తీసుకొన్నారు. ఆ సమయంలో శాంసన్‌తో రోహిత్‌ మాట్లాడిన విధానం తనకు నచ్చిందని రాబిన్‌ చెప్పాడు. ఇద్దరి సారథ్యాల్లో తేడా ఇదేనని స్పష్టం చేశాడు. అందుకే తాను రోహిత్‌ను గొప్ప నాయకుడిగా భావిస్తానని చెప్పాడు.


చాపెల్‌కు సీనియర్లతో ఎప్పుడూ గొడవలే..: కోచ్‌గా గ్రెగ్‌ చాపెల్‌ హయాంలో జట్టులో ఎప్పుడూ అలజడి వాతావరణం నెలకొని ఉండేదని ఊతప్ప తెలిపాడు. ‘భారత ఆటగాళ్లలో ఫిట్‌నెస్‌ లోపాన్ని చాపెల్‌ గుర్తించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల మాదిరిగా జట్టు ఫిట్‌నె్‌సను పెంచాలనుకొన్నాడు. కానీ, జట్టులోని కొందరు సీనియర్లకు ఆ విషయాన్ని సమర్థంగా చెప్పలేక పోవడం గొడవలకు దారి తీసింది. పైగా, తను అనుకొన్నట్టు సాగకపోతే.. డ్రెస్సింగ్‌ రూమ్‌ విషయాలను కూడా చాపెల్‌ లీక్‌ చేసేవాడ’ని రాబిన్‌ తెలిపాడు. కాగా యువరాజ్‌ కెరీర్‌ ముగియడానికి కూడా కోహ్లీనే కారణమని రెండు రోజుల క్రితం ఊతప్ప చెప్పిన సంగతి విదితమే. క్యాన్సర్‌నుంచి బయటపడిన యువరాజ్‌ను ఫిట్‌నెస్‌ విషయంలో కోహ్లీ ఇబ్బందిపెట్టేవాడని, తనతో సమానంగా అందరూ ఫిట్‌గా ఉండాలని అనేవాడని ఊతప్ప ఆరోపించాడు.

Updated Date - Jan 14 , 2025 | 05:13 AM