రోహిత్ లేకుండానే?
ABN , Publish Date - Jan 03 , 2025 | 06:12 AM
అత్యంత ఆసక్తిగా సాగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. గురువారం నుంచి జరిగే ఆఖరిదైన ఐదో టెస్టు భారత జట్టుకు అత్యంత కీలకమైనది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీ్‌సను సమం చేసుకోగలుగుతుంది. దీంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప...
బరిలోకి టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా
గాయంతో పేసర్ ఆకాశ్ అవుట్ జూ నేటి నుంచి ఆసీ్‌సతో ఐదో టెస్టు
ఉదయం 5 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
సిరీ్‌సలో ఇప్పటికే 1-2తో వెనుకబడిన వేళ.. సిడ్నీ టెస్టులో భారత జట్టు చావోరేవో తేల్చుకోవాల్సిందే. అయితే ఫలితంపై కాకుండా, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడా? పెవిలియన్‌కే పరిమితమవుతాడా? అనేదే ఇప్పుడు అందరికీ ఆసక్తికర అంశం. కోచ్ గంభీర్ సైతం అతడి స్థానంపై భరోసా ఇవ్వకపోవడంతో జరుగబోయేదేంటో అర్థమవుతోంది. పేలవ ఫామ్ కొనసాగిస్తున్న హిట్‌మ్యాన్‌పై వేటు పడితే.. సిరీస్ మధ్యలో ఏకంగా కెప్టెన్‌నే పక్కనబెట్టినట్టవుతుంది. భారత క్రికెట్‌లో ఇలాంటి పరిణామం గతంలో ఎన్నడూ చూడనిది. అదే జరిగితే తొలి టెస్టు మాదిరి ఆఖరి మ్యాచ్‌కు కూడా బుమ్రా కెప్టెన్సీలోనే భారత్ తలపడనుంది.
సిడ్నీ: అత్యంత ఆసక్తిగా సాగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. గురువారం నుంచి జరిగే ఆఖరిదైన ఐదో టెస్టు భారత జట్టుకు అత్యంత కీలకమైనది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీ్‌సను సమం చేసుకోగలుగుతుంది. దీంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్ బెర్త్ ఆశలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఇలా ఒక్క మ్యాచ్.. రెండు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న టీమిండియా సిడ్నీ టెస్టులో భారీ మార్పులతో బరిలోకి దిగబోతోంది. పేలవ ఫామ్‌తోపాటు నాయకత్వం విషయంలోనూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి తప్పుకొనే అవకాశాలున్నాయి. దీంతో బుమ్రా నాయకత్వంలో జట్టు ఆసీ్‌సను ఎదుర్కొనబోతోంది. ఈ సిరీ్‌సలో ఆడిన మూడు టెస్టుల్లో హిట్‌మ్యాన్ కేవలం 6.2 సగటుతో 31 పరుగులు చేయడంతో కోచ్ గంభీర్ అసంతృప్తితో ఉన్నాడు. అలాగే కెప్టెన్సీలోనూ తేలిపోతున్నాడు. మిడిలార్డర్, ఓపెనింగ్ స్థానాల్లో వచ్చినా పరుగుల్లో వెనుకబడిపోవడంతో చివరి టెస్టులో అతడిపై కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు మీడియా కథనం. మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలోనూ గౌతీ నర్మగర్భంగా ఇదే విషయాన్ని తెలిపాడు. రోహిత్ ఆడతాడని నేరుగా తేల్చకుండా, పిచ్‌ను పరిశీలించాకే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటామని సమాధానాన్ని దాటవేశాడు. ఒకవేళ శుక్రవారం టాస్ వేసేందుకు రాకపోతే రోహిత్ కెరీర్‌లో మెల్‌బోర్న్ టెస్టే చివరిదని భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఆసీస్ జట్టు ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు దక్కించుకుంటుంది.
మార్పులు ఖాయమే..: సిడ్నీని చేజిక్కించుకోవడం భారత్‌కు అత్యంత ఆవశ్యకం కాబట్టి కోచ్ గౌతీ తుది జట్టును పకడ్బందీగా రూపొందించాలనుకుంటున్నాడు. దీంట్లో భాగంగా నాలుగో టెస్టుకు దూరమైన గిల్‌ను రోహిత్ స్థానంలో తీసుకుని వన్‌డౌన్‌లో ఆడించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఓపెనర్‌గా తిరిగి రాహుల్ ఆడతాడు. మరోవైపు నిర్లక్ష్యపు షాట్లతో ఎంసీజీలో జట్టు ఓటమికి కారణమైన కీపర్ పంత్‌పైనా వేటు వేస్తారా? అనేది చూడాల్సిందే. డ్రాకోసం ఓపిగ్గా ఆడాల్సిన వేళ భారీ షాట్‌కు వెళ్లి పంత్ అవుట్ కాగా, ఆసీస్ ఆ తర్వాత టపటపా వికెట్లను పడగొట్టింది. తన స్థానంలో మరో కీపర్ ధ్రువ్ జురెల్ చాన్స్ కోసం చూస్తున్నాడు. నెట్స్‌లోనూ తను ప్రాక్టీస్ చేయడం కనిపించింది. కానీ సిడ్నీ మైదానంలో పంత్ గతంలో అజేయంగా 159 రన్స్ చేసి జట్టును కాపాడాడు. ఒకవేళ పంత్‌ను కొనసాగిస్తే..తుది కూర్పు ఎలావుంటుందో చూడాలి. అలాగే మెల్‌బోర్న్‌లో ఆకట్టుకున్న పేసర్ ఆకాశ్ దీప్ వెన్నునొప్పితో ఈ టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానం కోసం హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ క్రిష్ణ పోటీపడుతున్నారు. బ్యాటింగ్‌లో జైస్వాల్, నితీశ్, రాహుల్ నిలకడగా రాణిస్తున్నారు. విరాట్ కోహ్లీ సైతం ఫామ్‌లేమితో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సిడ్నీలో స్థాయికి తగ్గట్టు రాణిస్తేనే అతడి కెరీర్ కొనసాగే అవకాశాలుంటాయి. ఇక బౌలింగ్‌లో బుమ్రా జట్టు భారాన్నంతా మోస్తున్నాడు. సహచర బౌలర్ల నుంచి అతడికి తోడ్పాటు అందడం లేదు.
జట్లు
భారత్ (అంచనా) : రోహిత్ (కెప్టెన్)/గిల్, జైస్వాల్, రాహుల్, విరాట్, పంత్, జడేజా, సుందర్/జురెల్, నితీశ్, ప్రసిద్ధ్/హర్షిత్, బుమ్రా, సిరాజ్.
ఆస్ర్టేలియా (తుదిజట్టు): ఖవాజా, కాన్‌స్టా్‌స, లబుషేన్, స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, క్యారీ, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, బోలాండ్, లియోన్.
పిచ్, వాతావరణం
ఎస్‌సీజీ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలించనుంది. ఆరంభంలో బ్యాటర్లు లాభపడనుండగా.. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి పేసర్లు కూడా కీలకంగా మారే చాన్స్ ఉంది. వికెట్‌పై 7 మిల్లీమీటర్ల మేర గడ్డిని కత్తిరించారు. తొలి రోజు ఆకాశం మేఘావృతంగా ఉన్నా, వర్షం కురిసే అవకాశం 25 శాతం మాత్రమే. చివరి రెండు రోజులు మాత్రం వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకునే అవకాశం లేకపోలేదు.
రోహిత్ ఏమైనా కుర్రాడా?
రోహిత్ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడనే కథనాలపై మాజీ కోచ్ స్పందించాడు. అదే జరిగితే తానేమీ ఆశ్చర్యపోనని బదులిచ్చాడు. రోహిత్ కుర్రాడేమీ కాదని, చాలామంది యువ ఆటగాళ్లు చాన్స్‌ల కోసం వేచిచూస్తున్నారని గుర్తుచేశాడు. ఆసీ్‌సతో సిరీస్ తర్వాత రోహిత్ నిర్ణయం తీసుకోవచ్చని, ఒకవేళ భారతజట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తే పరిస్థితి వేరేలా ఉంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
అవి పుకార్లు మాత్రమే
‘డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి బాగాలేదనే వార్తలు పూర్తి అవాస్తవం. అక్కడ మేం మాట్లాడుకునేది ఆటగాళ్ల ప్రదర్శన గురించి. ఇంకా టెస్టు మ్యాచ్‌లు ఎలా గెలవాలనే దానిపైనా చర్చిస్తాం. సీనియర్లు విరాట్, రోహిత్‌తో వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్, ఆటగాళ్ల మధ్య జరిగిన విషయాలు అక్కడి వరకే పరిమితం కావాలి. బయటకు రాకూడదు. నిజాయతీ కలిగిన వ్యక్తులు ఉన్నంతవరకు భారత క్రికెట్ భద్రంగానే ఉంటుంది’
కోచ్ గౌతం గంభీర్
మార్ష్‌పై వేటు
ఆస్ట్రేలియా కూడా సిరీ్‌సను గెలిచేందుకు మార్పులతో బరిలోకి దిగుతోంది. మిడిలార్డర్‌లో మిచెల్ మార్ష్ దారుణంగా విఫలమవుతున్నాడు. టీ20ల్లో జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న తను ఈ సిరీ్‌సలో చేసింది 73 పరుగులే. దీంతో అతడిపై వేటు పడింది. కొత్తగా 31 ఏళ్ల బ్యూ వెబ్‌స్టర్‌కు అవకాశమిచ్చారు. ఈ సిరీ్‌సలో ఆసీస్ నుంచి తను మెక్‌స్వీనే, కాన్‌స్టా్‌స తర్వాత మూడో అరంగేట్ర ప్లేయర్ కాబోతున్నాడు. 6.5 అడుగుల ఎత్తున్న ఈ ఆజానుబాహుడు బౌలింగ్‌లో ఆఫ్‌స్పిన్ కాకుండా మీడియం పేస్ కూడా వేయగలడు. అలాగే ఆసీస్ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తుండడంతో భారత బౌలర్లు శ్రమించాల్సిందే. దూకుడు మీదున్న ట్రావిస్ హెడ్ ఎంసీజీలో మాత్రం విఫలమయ్యాడు. పేసర్ స్టార్క్ ఫిట్‌గానే ఉండడం ఆసీస్‌కు సానుకూలాంశం. కెప్టెన్ కమిన్స్ ప్రత్యర్థి బ్యాటర్లను హడలగొడుతున్నాడు.
1
సిడ్నీ గ్రౌండ్‌లో తానాడిన 13 టెస్టుల్లో భారత్ ఒక్కసారి మాత్రమే నెగ్గడం గమనార్హం. ఇందులో ఐదు ఓటములు, ఏడు డ్రాలున్నాయి.