Share News

Grok AI: గ్రోక్ ఏఐతో మామూలుగా ఉండదు.. తాట తీస్తుంది..

ABN , Publish Date - Mar 20 , 2025 | 09:56 PM

ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర నటించిన సూపర్ హిట్ సినిమా ఉపేంద్ర చూసే ఉంటారు. అందులో హీరో నేను ఫిల్టర్ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. ఇష్టం వచ్చినట్లు చేస్తుంటాడు. ఇప్పుడు గ్రోక్ కూడా అలాగే కనిపిస్తోంది.

Grok AI: గ్రోక్ ఏఐతో మామూలుగా ఉండదు.. తాట తీస్తుంది..
Grok AI

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కొత్తపుంతలు తొక్కుతోంది. మనిషి ఊహించిన దానికంటే అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది. జనం కూడా వాటిని ఉపయోగించుకుని లాభాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోజుకో కొత్త ఏఐ అందుబాటులోకి వస్తోంది. ఏఐకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద కంపెనీలు సైతం రంగంలోకి దిగుతున్నాయి. కొత్త ఏఐని తయారు చేసి మార్కెట్‌లోకి వదులుతున్నాయి. నిన్నటి వరకు చైనాకు చెందిన డీప్‌సీక్ ప్రపంచవ్యాప్తంగా తెగ హల్‌చల్ చేసింది. ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్ నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. అది కూడా లోకల్ భాషలో .. అచ్చం మనిషిలా సమాధానం ఇస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.


సార్ అంటే సార్.. రా అంటే రా..

గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఇంగ్లీష్‌లో ఓ మాట ఉంది. దాన్నే తెలుగులో మర్యాద ఇచ్చిపుచ్చుకో అంటారు. గ్రోక్ ఏఐ దీన్ని నూటికి నూరు శాతం ఫాలో అవుతోంది. మనం మర్యాదపూర్వకంగా ప్రశ్న అడిగితే.. అది మర్యాదపూర్వకంగా సమాధానం చెబుతుంది. మనం ‘ ఏరా ఎలా ఉన్నావు. తిన్నావారా?’ అని అడిగితే.. అది ‘ నేను బానే ఉన్నాను రా.. నేను ఏఐని కదా తిండి తిననురా’ అంటుంది. మనం మన ఫ్రెండ్‌తో చాట్ చేసినట్లు గ్రోక్‌తో చేస్తే.. అది కూడా మనకు మన ఫ్రెండ్‌లానే రిప్లైలు ఇస్తుంది. ఇప్పుడు ఇండియా మొత్తం గ్రోక్ మీద చర్చ జరుగుతోంది. కొంతమంది కావాలనే దాంతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. అది వారికి అర్థం అయ్యేలాగే సమాధానాలు ఇస్తుంది. మనం తిడితే.. అది కూడా తిడుతుంది.


గ్రోక్ ఏం చేయగలదు..

గ్రోక్ 3ని ఎలాన్‌ మస్క్ కంపెనీ xAI డెవలప్‌ చేసింది. సూపర్ కంప్యూటర్ కొలోసస్‌పై గ్రోక్ రన్‌ అవుతుంది. ఇది కోడింగ్, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేయడం, ఇమేజ్‌లు క్రియేట్‌ చేయడం, గేమ్స్ బిల్డ్‌ చేయడం వంటి చాలా రకాల పనులు చేయగలదు. ఇప్పుడు వరకు అందుబాటులో ఉన్న ఏఐల కంటే ఇది చాలా భిన్నంగా ఉంది. చాట్ జీపీటీ, జెమినీ, డీప్‌సీక్, కోపైలట్ వంటి ఏఐలు మనం ఏమన్నా.. ఒక వేళ తిట్టినా మర్యాద పూర్వకంగానే సమాధానం ఇస్తాయి. ఆలస్యం అయితే.. సారీ చెబుతాయి. కానీ, గ్రోక్ మాత్రం తీవ్రంగా స్పందిస్తోంది. గ్రోక్ నిజంగా ఉపేంద్రకు ఏఐ వర్షన్‌లాగా ఉంది. ఫిల్టర్ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తోంది. బూతులు తిడుతోంది.


గ్రోక్ ప్రవర్తనపై కేంద్రం దృష్టి..

కొద్దిరోజుల క్రితం టోకా అనే యూజర్ గ్రోక్‌ను ఓ ప్రశ్న అడిగాడు. దానికి గ్రోక్ త్వరగా స్పందించలేదు. దీంతో సహనం కోల్పోయిన టోకా దాన్ని తిట్టాడు. గ్రోక్ ఊరుకుంటుందా.. అది కూడా హిందీ భాషలో రెచ్చిపోయి మరీ తిట్టింది. ఇక అప్పటినుంచి ఇండియాలో గ్రోక్ పాపులారిటీ పెరిగిపోయింది. జనం కావాలనే గ్రోక్‌ను గోకి మరీ తిట్టించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రోక్ ఏఐ బూతు పదాలు ఉపయోగించటంపై కేంద్రం దృష్టి పెట్టింది. గ్రోక్ బూతులు తిట్టకుండా ఉండేలా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రత్వ శాఖ.. గ్రోక్‌పై ట్విటర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గ్రోక్ అలా తప్పుగా నడుచుకోవడానికి గల కారణాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం.


Also Read:

ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..

For Business News And Telugu News

Updated Date - Mar 20 , 2025 | 09:58 PM