Share News

ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:23 PM

ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. కౌటాల మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం

కౌటాల, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. కౌటాల మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాణహిత ప్రాజెక్టు చేపడుతామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ నేడు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదని పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో రూ.200 కోట్లు ప్రాజెక్టుకు కేటాయించినట్లు చెప్పి వాటి ఊసే ఎత్తడం లేదని ఆ డబ్బులు ఎటు పోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టుపై సరైన నిర్ణయం తీసుకుని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాంత రైతులు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయి అన్ని విధాల నష్టపోయారన్నారు. ఉన్న భూములకైనా నీళ్లు వస్తాయని ఎదురు చూస్తుంటే ఆ ప్రాజెక్టు కాస్త కాళేశ్వరానికి తరలిపోయిందన్నారు. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టుకు అన్యాయం చేసిందన్నారు. గ్రూపు-1 తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్రఅన్యాయం జరిగిందని ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలనితి సూచించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని భయపడే ఎన్నికలకు పోవడం లేదని విమర్శించారు. ఆయన వెంట నాయకులు రాజేందర్‌గౌడ్‌, విజయ్‌, రవి, అశోక్‌, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 11:23 PM